breaking news
Chandrayaan-1
-
చంద్రయాన్ ప్రయోగంపై శాస్త్రవేత్తలకు అబ్దుల్ కలాం ప్రశ్న..?
ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతం అవుతుందని యావత్ దేశం ఎదురుచూస్తోంది. విక్రమ్ ల్యాండర్ నేడు సాయంత్రం 6.04 నిమిషాలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్ంగ్ కానుంది. దాదాపు నాలుగేళ్లుగా 1000 మంది శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి ఫలితం దక్కనుందని ఇస్రో ఛైర్మని సోమనాథ్ తెలిపారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2019లో ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే.. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియలో ఈ మిషన్ విఫలమైంది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుకు ముందు భారత్ చంద్రయాన్ 1 ప్రాజెక్టు కూడా చేపట్టింది. ఈ మిషన్ జాబిల్లి కక్ష్యలో దాదాపు 3400 ఆర్బిట్లు తిరిగింది. 2009 ఆగష్టు 29న ఈ స్పేస్ క్రాఫ్ట్ కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత ఈ మిషన్ కూడా పూర్తయింది. అయితే.. చంద్రయాన్ 1 ప్రయోగం లాంచింగ్‌కి అప్పట్లో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంని పిలిచారు. అక్కడకు హాజరైన ఆయన చంద్రయాన్ 1 మిషన్ శాస్త్రవేత్తల బృందానికి ఓ ప్రశ్న వేశారు. ప్రయోగం విజయవంతం అయిందనడానికి రుజువులు ఏం ఉంటాయని అడిగారు. అందుకు ఫొటోలు మాత్రమే అని శాస్త్రవేత్తలు తెలపగా.. అవి సరిపోవని అయన చెప్పారు. చంద్రునిపై ఏదైనా వస్తువు వేయాలని సూచించారు. కలాం సూచనలు విన్న శాస్త్రవేత్తల బృందం.. ప్రయోగంలో మార్పులు చేసింది. ఆ తర్వాత చంద్రయాన్ 1 నుంచి టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా భూమి ఫొటోలను పంపించినప్పుడు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగ్గ విషయమని విలేఖరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రయోగం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే.. -
ఫ్లాష్ బ్యాక్: ఒక ఉపగ్రహం కూలిన వేళ
కొన్నేళ్ల క్రితం చంద్రయాన్–2ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చందమామ మీద నేలకూలి్చన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలా ఇస్రో నేలకూలి్చన శాటిలైట్లలో అదే మొదటిది కాదు. చంద్రయాన్ 1ను పదేళ్ల క్రితమే ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేసింది. అది 2008. నవంబర్ 14. మధ్యాహ్న వేళ. ఉక్కపోత చుక్కలు చూపుతోంది. గుజరాత్‌లోని రాజ్ కోట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ శివాలెత్తుతున్నాడు. మహా మహా ఇంగ్లండ్ పేస్ బౌలర్లను వీర బాదుడు బాదుతున్నాడు. కేవలం 78 బంతుల్లో అతను చేసిన 138 పరుగుల సాయంతో భారత్ మరపురాని విజయం సాధించింది. దేశమంతా సంబరాల్లో మునిగి పోయింది. కానీ, అదే సమయంలో అక్కడికి 1,600 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులో పరిస్థితి మరోలా ఉంది. మరో దారిలేని పరిస్థితుల్లో, ఒక మినీ విస్ఫోటనానికి ఇస్రో భారంగా సిద్ధమవుతోంది. ఎందుకా విస్ఫోటనం? ఏమా కథ? అసలేం జరిగింది? చూద్దాం రండి...! 2008 అక్టోబర్ 22న చంద్రయాన్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. భూ కక్ష్యకు ఆవలికి శాటిలైట్‌ను పంపడం భారత్‌కు అదే తొలిసారి. అప్పటిదాకా రష్యా, అమెరికా, జపాన్, యూరప్ స్పేస్ ఏజెన్సీల పేరిట ఉన్న ఘనత అది. చంద్రునిపై నీటి ఆనవాళ్లను తొలిసారిగా ప్రపంచానికి పట్టిచి్చన ప్రయోగంగా చంద్రయాన్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే అందరికీ తెలిసిన ఈ ఘనత వెనక బయటికి తెలియని మరో గాథ దాగుంది... ప్రోబ్... కూలేందుకే ఎగిరింది చంద్రయాన్ లో భాగంగా 32 కిలోల బరువున్న మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రునిపైకి పంపింది ఇస్రో. ► 2008 నవంబర్ 17వ తేదీ రాత్రి 8 గంటల వేళ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రుని ఉపరితలం మీద కావాలనే కుప్పకూల్చేందుకు సిద్ధమైంది. ► అందులో భాగంగా చంద్రునికి దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రోబ్ తన అంతిమ ప్రయాణానికి సిద్ధమైంది. ► చంద్రయాన్ కక్ష్య నుంచి క్రమంగా విడివడటం మొదలు పెట్టింది. ► దానిలోని స్పినప్ రాకెట్లు జీవం పోసుకుని గర్జించాయి. అయితే, ప్రోబ్ వేగాన్ని పెంచేందుకు కాదు, వీలైనంత తగ్గించేందుకు! చంద్రుని ఉపరితలం కేసి తిప్పి అనుకున్న విధంగా క్రాష్ చేసేందుకు!! ► ఎట్టకేలకు, చంద్రయాన్ మిషన్ నుంచి విడివడి అరగంటకు క్రాష్ ల్యాండ్ అయింది. ప్రోబ్ కథ అలా కంచికి చేరింది. ► తద్వారా, అంతదాకా అందరాని చందమామతో తొలిసారిగా కరచాలనం చేసి ఇస్రో కొత్త చరిత్ర సృష్టించింది. ఆ మూడింటి ముచ్చట్లు ప్రోబ్ లో మూడు పరికరాలను ఇస్రో పంపింది. అవి ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపే వీడియో ఇమేజింగ్ సిస్టం, ప్రోబ్ చంద్రునిపైకి పడ్డ వేగాన్ని కొలిచేందుకు రాడార్ ఆల్టిమీటర్, చంద్రుని వాతావరణాన్ని విశ్లేíÙంచేందుకు మాస్ స్పెక్ట్రం మీటర్. భావికి బాటలు... కూల్చేయడమే అంతిమ లక్ష్యంగా ఇస్రో ప్రయోగించిన ’విఫల’ చంద్రయాన్ మిషన్ తర్వాతి రోజుల్లో చంద్రయాన్–2, చంద్రయాన్ –3 ప్రయోగాలకు బాటలు వేసింది. ఆగస్ట్ 23న చంద్రునిపై సగర్వంగా దిగి చంద్రయాన్–3 సాధించబోయే అంతిమ విజయం కోసం దేశమంతా ఇప్పుడు ఎదురు చూసేందుకు మూల కారణంగా నిలిచింది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
చందమామ నీటి కుండ.. జాబిల్లిపై నీరుందట!
మన జాబిల్లిపై నీరుందట! అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ... నాసా చెబుతోంది! చంద్రయాన్–1 ప్రయోగంతో మనం ఎప్పుడో చెప్పేశాం కదా...నాసా కొత్తగా తేల్చిందేమిటి? అన్నదేనా మీ ప్రశ్న? చందమామ ఉపరితలంపై, నేల అడుగున...నీరు ఉండేందుకు అవకాశముందని చంద్రయాన్–1 చెబితే...ఇదే విషయాన్ని నాసా తాజాగా నిర్ధారించింది. ఓస్ అంతేనా అంటారా? ఊహూ.. తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది! సాక్షి, హైదరాబాద్: భూమి సహజ ఉపగ్రహం జాబిల్లిపై నీటి ఛాయల కోసం దశాబ్దాలపాటు ప్రయోగాలు జరిగాయి. కానీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2008లో ప్రయోగించిన చంద్రయాన్–1తో చందమామ ఉపరితలంపై, నేల అడుగున కూడా నీరు ఉండే అవకాశముందని స్పష్టమైంది. కానీ ఏ రూపంలో? ఎక్కడ? ఎంత? అన్న ప్రశ్నలకు అప్పట్లో సమాధానాలు దొరకలేదు. ఈ లోటును నాసాకు చెందిన సోఫియా టెలిస్కోపు పూర్తి చేసింది. స్ట్రాటోస్ఫెరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ అస్ట్రానమీ.. క్లుప్తంగా సోఫియా అని పిలిచే ఈ టెలిస్కోపు భూమికి 40 వేల అడుగుల ఎత్తులో పరారుణ కాంతి ద్వారా విశ్వాన్ని పరిశీలిస్తుంది. నక్షత్రాల జననం, మరణం మొదలుకొని అంతరిక్షంలో సంక్లిష్టమైన అణువులను గుర్తించేందుకు దీన్ని వాడుతుంటారు. (చదవండి: నాసా- నోకియా డీల్: చంద్రుడిపై 4జీ నెట్వర్క్) ఇదే క్రమంలో సోఫియా జాబిల్లిపై కూడా కొన్ని పరిశీలనలు చేసింది. ఆ సమాచారం ఆధారంగా జాబిల్లిపై సూర్యుడి వెలుతురు పడే ప్రాంతాల్లోనూ పెద్ద మొత్తంలో నీటి నిల్వలు ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన రెండు పరిశోధన వ్యాసాలు ఈ అంశానికి సంబంధించిన వివరాలను తెలిపాయి. సోఫియా సేకరించిన సమాచారం ఆధారంగా ద్రవ రూపంలో ఉండే నీటి తాలూకూ ప్రత్యేక గుర్తులను చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద తాము గుర్తించామని, ప్రతి ఘనపు అడుగు జాబిల్లి మట్టిలో సుమారు 12 ఔన్స్‌ల నీరు ఉన్నట్లు తెలిసిందని నాసా శాస్త్రవేత్త కేసీ హానిబల్ నిర్వహించిన పరిశోధన తెలిపింది. అయితే మట్టిలో కలిసిపోయిన ఈ నీటిని వెలికితీయడం కష్టసాధ్యమైన విషయమని స్పష్టం చేసింది. రెండో పరిశోధన ప్రకారం జాబిల్లి మొత్తమ్మీద కోటానుకోట్ల సూక్ష్మస్థాయి గుంతలు ఉన్నాయి. వీటి నీడలు పరుచుకున్న చోట్ల నీరు ఉండేంత చల్లదనం ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే ఇక్కడ ఘనీభవించిన మంచు రూపంలో నీరు ఉంటుందన్నమాట. భవిష్యత్తులో జాబిల్లిపైకి చేరే వ్యోమగాములు ఈ ప్రాంతాల నుంచి సులువుగా నీటిని సేకరించగలరు. ప్రయోజనాలేమిటి? జాబిల్లిపై సులువుగా సేకరించగలిగేలా నీరు ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నాసా ఇంకో పదేళ్లలో అక్కడ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడు వ్యోమగాముల కోసం ఇక్కడి నుంచి నీరు మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా రాకెట్ల బరువు, తద్వారా ప్రయోగ ఖర్చులూ గణనీయంగా తగ్గుతాయి. నాసా 2024లో తన ఆర్టిమిస్ ప్రాజెక్టులో భాగంగా జాబిల్లిపైకి తొలి మహిళను, మరోసారి పురుష వ్యోమగామిని పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగం ద్వారా చందమామపైకి చేరే వ్యోమగాములు నీటి ఉనికిని, లభ్యతను ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ధారించుకోగలిగితే జాబిల్లిపై మనిషి శాశ్వత నివాసం ఏర్పరచుకునే దిశగా మలి అడుగు పడినట్లే! జంబోజెట్ విమానంలో దుర్భిణి నాసాకు చెందిన సోఫియా టెలిస్కోపు ఇతర దుర్భిణుల కంటే చాలా భిన్నమైంది. ఎందుకంటే నాసా, జర్మనీకి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ డీఎల్ఆర్లు కలిసి దీన్ని ఓ విమానంలో ఏర్పాటు చేశాయి. ఇది నలభై ఏళ్ల పురాతనమైన బోయింగ్ 747 జంబోజెట్. కాకపోతే ఇందులో ప్రయాణికుల సీట్లు వగైరా సామగ్రి మొత్తాన్ని తొలగించి.. పైకప్పుపై పదహారు అడుగుల వెడల్పు, 23 అడుగుల పొడవైన తలుపు ఒకదాన్ని ఏర్పాటు చేశారు. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఈ తలుపు తెరుచుకుంటుంది. అప్పుడు విమానం లోపల సుమారు 8.2 అడుగుల వ్యాసార్ధమున్న దుర్భిణి విశ్వాన్ని చూడటం మొదలుపెడుతుందన్నమాట. భూమికి 40 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల అక్కడ నీటి ఆవిరి కూడా ఉండదు. ఫలితంగా ఖగోళాన్ని ఏ రకమైన అడ్డంకులూ లేకుండా చూడవచ్చునన్నమాట. విశ్వగవాక్షంగా చెప్పుకునే హబుల్ టెలిస్కోపుతో సమానమైన సామర్థ్యమున్న సోఫియా పరారుణ కాంతిలో విశ్వాన్ని పరిశీలించగలదు. హబుల్ దృశ్య, అతినీలలోహిత కాంతుల్లో పరిశీలనలు జరపగలదు. -
చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?
చందమామ చుట్టూ ఎన్నో కథలు, కల్పనలు... చందమామ చుట్టూ ఎన్నెన్నో పాటలు, ఆటలు... చంద్రుని మీద కనిపించే మచ్చ కుందేలులా కనిపిస్తుంది. నిజానికి అక్కడ కుందేలేమైనా ఉందా? అక్కడ లేకుంటే భూమ్మీద నుంచి కుందేలును పంపితే– ఆ కుందేలు అక్కడ సంతోషంగా ఉంటుందా? చంద్రుని గురించి మనకు కొంత తెలుసు. చాలా తెలీదు. చంద్రుడి మీద మానవుడు అడుగుమోపి ఐదు దశాబ్దాలు గడిచాయి. అయినా, చంద్రుడి గురించి తెలుసుకోవలసిన సంగతులు కొండంత. నేడు చంద్రయాన్–2 ప్రయోగం సందర్భంగా... అందిన చందమామను మరోసారి అందుకోవడానికి సిద్ధపడుతున్నారు మన శాస్త్రవేత్తలు. చందమామ మీద అందీ అందని రహస్యాలను అందిపుచ్చుకోవడానికి నేడు ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని తలపెడుతున్నారు. ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని మైలస్వామి అన్నాదురై నేతృత్వంలో ఇదివరకు విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలోనే ‘చంద్రయాన్–2’ ప్రయోగం జరుగుతోంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో ఈ ప్రయోగం మరో మైలురాయిగా నిలిచిపోతుంది. రష్యా అంతరిక్ష సంస్థ (రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ–రాస్‌కాస్మోస్) సహకారంలో ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు మరోసారి చంద్రుడి మీద పరిశోధనలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ‘చంద్రయాన్–2’ మిషన్‌లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జియోసెంట్రిక్ లాంచ్ వెహికల్–మార్క్3 (జీఎస్ఎల్వీ–మార్క్3 ) వాహనం ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను నేడు చంద్రుని దిశగా అంతరిక్షంలోనికి పంపనున్నారు. ఇందులో మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు తయారు చేసిన లూనార్ ఆర్బిటర్, రోవర్లతో పాటు రష్యా అంతరిక్ష సంస్థ తయారు చేసిన ల్యాండర్‌ను ప్రయోగించనున్నారు. ఇందులో చక్రాలు కలిగిన రోవర్ యంత్రం సౌరశక్తితో పనిచేస్తూ, చంద్రుని ఉపరితలంపై సంచరించి, అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి, వాటి రసాయనిక విశ్లేషణ జరిపి, ఆ సమాచారాన్ని ‘చంద్రయాన్–2’ ఆర్బిటర్ ద్వారా భూమిపైనున్న ‘ఇస్రో’ పరిశోధన కేంద్రానికి చేరవేస్తుంది. ‘చంద్రయాన్–2’ ప్రయోగం కోసం దాదాపు పుష్కరకాలం నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రయోగంలో కలసి పాల్గొనాలని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు, రష్యా అంతరిక్ష సంస్థ (రాస్‌కాస్మోస్) 2007 నవంబరు 12న ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందానికి 2008 సెప్టెంబర్ 18న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కేబినెట్ బృందం ఆమోదం తెలిపింది. ‘ఇస్రో’, రాస్కాస్మోస్ల ఒప్పందం ప్రకారం రోవర్, ఆర్బిటర్ల తయారీ బాధ్యతను ‘ఇస్రో’ తీసుకోగా, ‘రాస్‌కాస్మోస్’ ల్యాండర్ తయారీ బాధ్యతలను చేపట్టింది. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్ చంద్రునికి 200 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ‘రాస్‌కాస్మోస్’ తయారు చేసిన ల్యాండర్.. ‘ఇస్రో’ తయారు చేసిన రోవర్‌ను చంద్రుని ఉపరితలంపైకి దిగవిడుస్తుంది. వీటిని అంతరిక్షంలోకి చేరవేసే జీఎస్ఎల్వీ–మార్క్3 వాహనం ఆకృతిని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2009 ఆగస్టులోనే సిద్ధం చేశారు. దీని బరువు 2650 కిలోలు. ల్యాండర్, రోవర్ల బరువు దాదాపు 1250 కిలోలు. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్‌లో ఐదు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిలో మూడు కొత్తగా రూపొందించినవైతే, మిగిలిన రెండూ చంద్రయాన్–1లో ప్రయోగించిన పాత ఉపగ్రహాలే. అయితే, మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు వీటిని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేశారు. అన్నీ స్వదేశీ పరికరాలే... చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా జీఎస్ఎల్వీ–మార్క్3 వాహనాన్ని భారతీయ కాలమానం ప్రకారం జూలై 14న వేకువ జామున 2.51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందులోని ల్యాండర్ ద్వారా రోవర్ యంత్రం చంద్రుని ఉపరితలం మీదకు సెప్టెంబర్ 6న చేరుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్బిటర్ ద్వారా ఐదు, ల్యాండర్ ద్వారా నాలుగు, రోవర్ ద్వారా రెండు సాంకేతిక పరికరాలను ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపుతున్నారు. చంద్రయాన్–2లో భాగంగా, అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, యూరోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్ఏ) కూడా కొన్ని సాంకేతిక పరికరాలను పంపాలని భావించినా, బరువు పరిమితుల కారణంగా విదేశీ పరికరాలనేవీ ఈ ప్రయోగంలో పంపరాదని ‘ఇస్రో’ బృందం నిర్ణయించింది. చంద్రయాన్–1 తరహాలోనే చంద్రుని ఉపరితలంపై విశేషాలను మరింత లోతుగా తెలుసుకునే ఉద్దేశంతో ‘ఇస్రో’ ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా అంతరిక్షంలోకి పంపుతున్న సాంకేతిక పరికరాల ద్వారా చంద్రుని ఉపరితలాన్ని రోవర్ ద్వారా జల్లెడపట్టి, ఉపరితలంపై మట్టిలోని రసాయనాల విశేషాలను, ఒకవేళ చంద్రునిపై నీటి అణువుల జాడ ఏమైనా ఉందేమో తెలుసుకోవాలని భావిస్తోంది. రోవర్‌కు అమర్చిన టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా–2 (టీఎంసీ–2), మినియేచర్ సింథటిక్ అపెర్చర్ రాడార్ (మినీ–సార్) పరికరాలు చంద్రయాన్–1లో ఉపయోగించిన పరికరాల కంటే మరింత మెరుగైనవి. వీటిలో టీఎంసీ–2 చంద్రుని ఉపరితలానికి చెందిన త్రీడీ మ్యాప్‌లను ఆర్బిటర్‌లోని పరికరాల ద్వారా భూమిపైకి పంపుతుంది. అలాగే, మినీ–సార్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పేరుకుపోయి ఉన్న మంచులోని నీటి కణాలను, అక్కడి మట్టిని, మట్టి మందాన్ని విశ్లేషించి, ఆ సమాచారాన్ని భూమిపైకి పంపుతుంది. చంద్రుని చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణంలోని అత్యంత ఎగువ పొర అయిన ‘అయానోస్ఫియర్’లోని ఎలక్ట్రాన్ల సాంద్రతను ‘డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్’ (డీఎఫ్‌ఆర్‌ఎస్) పరికరం విశ్లేషిస్తుంది. ఐఆర్ స్పెక్ట్రోమీటర్ పరికరం చంద్రునిపై నీటి అణువుల జాడను, ఖనిజాలను గుర్తించి, ఆ సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. ఆర్బిటర్‌కు అమర్చిన హైరిజల్యూషన్ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ల్యాండర్ చంద్రుని ఉపరితలంపైన నిర్దేశిత ప్రదేశానికి సురక్షితంగా చేరుకోగానే త్రీడీ ఫొటోలు తీసి, వాటిని భూమిపైకి పంపిస్తుంది. చంద్రయాన్–2లోని ‘సోలార్ ఎక్స్‌రే మానిటర్’ చంద్రుని వాతావరణానికి ఎగువన ఆవరించి ఉన్న ‘కరోనా’ ప్రాంతంలో సూర్యకిరణాల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదీ కొలవడానికి ఉపయోగపడుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంలో సంచరించనున్న రోవర్ తెలుసుకునే సమాచారాన్ని ఆర్బిటర్ ఎప్పటికప్పుడు భూమిపైకి చేరవేస్తూ ఉంటుంది. ఇది చంద్రుని కక్ష్యలో ఏడాది పాటు పరిభ్రమిస్తుంది. చందమామ అందిన రోజు చంద్రుని చుట్టూ ఎన్నో పురాణాలు ఉన్నాయి. అభూత కల్పనలు ఉన్నాయి. అందరాని చందమామను అందుకోవాలనే తపన మానవుల్లో చాలా ఏళ్లుగానే ఉండేది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ ఈ తపన మరింత ఎక్కువైంది. మానవుడికి సంకల్పబలం ఉండాలే గాని, అసాధ్యమైనదేదీ లేదని నిరూపిస్తూ అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 జూలై 16న భూమిపై నుంచి చంద్రునిపైకి ప్రయాణించాడు. చందమామ మానవుడి చేతికందిన అద్భుతమైన రోజు అది. అపోలో–11 వ్యోమనౌకలో బయలుదేరిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై అడుగు మోపిన తొట్టతొలి మానవుడిగా చరిత్ర సృష్టించాడు. చంద్రుడి ధూళిని సేకరించి భూమిపైకి విజయవంతంగా తిరిగివచ్చాడు. అయితే, అంతకు పదేళ్ల ముందే, 1959లో రష్యా చంద్రునిపైకి లూనా–2 వ్యోమనౌకను విజయవంతంగా పంపింది. చంద్రుడిపైకి మానవులు పంపిన వస్తువు ఒకటి చేరుకోవడం చరిత్రలో అదే మొదటిసారి. చంద్రునిపైకి వ్యోమనౌకలను పంపడానికి రష్యా అంతకు ముందు మూడుసార్లు చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. రష్యన్ శాస్త్రవేత్తలు 1958 సెప్టెంబర్ 23, అక్టోబర్ 12, డిసెంబర్ 4లలో పంపిన వ్యోమనౌకలేవీ చంద్రునిపైకి చేరుకోలేకపోయాయి. వరుస వైఫల్యాల తర్వాత ‘లూనా’ ప్రయోగాలకు రష్యా నడుం బిగించింది. ఇందులో భాగంగా 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ చంద్రునికి 5,965 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని తప్పింది. తిరిగి లోపాలను దిద్దుకుని అదే ఏడాది సెప్టెంబర్ 13న పంపిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రునిపైకి చేరుకోగలిగింది. అయితే, చంద్రునిపైకి మనిషిని తొలిసారిగా పంపిన ఘనత మాత్రం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) దక్కించుకోగలిగింది. ‘నాసా’ ఆధ్వర్యంలో జరిపిన ప్రయోగంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 జూలై 20న చంద్రునిపై తొలి అడుగు మోపి, అక్కడి నుంచి ‘చంద్రుని మీద మనిషి మోపిన తొలి అడుగు మానవాళికే ముందడుగు’ అంటూ సందేశం పంపాడు. చంద్రునిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మోపిన తొలి అడుగు ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే చాలా దేశాలు చంద్రుడిని చేరుకోవడానికి, చంద్రుడి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నాటి నుంచి నేటి వరకు వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు చంద్రుడి వద్దకు ఉపగ్రహాలు, వ్యోమనౌకలు పంపుతూ కీలకమైన సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చందమామ ఏనాటికైనా మానవులకు ఆవాసం కాకపోతుందా అనే ఆశతో చేస్తున్న ప్రయోగాల్లో ఇప్పటికే అనేక విజయాలు సాధించాయి. చంద్రునిపై పంటలు పండించడం ఎంతవరకు సాధ్యమవుతుందో తెలుసుకోవడానికి చైనా ఇటీవల ఒక ప్రయత్నం చేసింది. చంద్రునిపై పత్తి విత్తనాలను మొలకెత్తించింది. చంద్రుని ఉపరితలంపై రాత్రివేళ అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మొలకెత్తిన విత్తనం జీవాన్ని పుంజుకోకుండానే అంతరించిపోయింది. ‘చంద్రయాన్–1’ సాధించిందేమిటంటే..? చంద్రునిపై పరిశోధనల కోసం ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇదివరకు చేపట్టిన చంద్రయాన్–1 గణనీయమైన ఫలితాలనే సాధించింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2008 అక్టోబర్ 22న ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని చేపట్టారు. అందులో భాగంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ–సీ 11) ద్వారా పంపిన ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3,400 సార్లు పరిభ్రమించి, కీలకమైన సమాచారాన్ని చేరవేసింది. దీని నుంచి 2009 ఆగస్టు 29న కమ్యూనికేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ (ఓహెచ్), నీరు (హెచ్2ఓ) అణువుల ఉనికిని తొలిసారిగా గుర్తించగలగడం ‘చంద్రయాన్–1’ సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు. ‘చంద్రయాన్–1’ చంద్రుని ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, క్యాల్షియం వంటి మూలకాల ఉనికిని కూడా గుర్తించింది. ‘చంద్రయాన్–1’లో భాగంగా చంద్రునిపైకి చేరుకున్న టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా (టీఎంసీ) ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత స్పష్టతతో కూడిన త్రీడీ చిత్రాలను భూమిపైకి చేరవేయగలిగింది. దీని ద్వారా చంద్రుని ఉపరితలంపై లావా ట్యూబుల ఉనికిని గుర్తించడం సాధ్యమైంది. ఇలాంటి లావా ట్యూబులు భవిష్యత్తులో చంద్రుడు మానవుల ఆవాసంగా ఉపయోపడే అవకాశాలపై గల ఆశలకు ఊపిరిపోస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. చంద్రునిపై ఆసక్తి ఏనాటిదంటే? గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో చంద్రునిపై మనుషుల్లో ఆసక్తి ఆధునిక పరిశోధనలు మొదలు కావడానికి వేల సంవత్సరాల ముందు నుంచే ఉండేది. నాగరికతలు మొదలు కాక ముందు నుంచే భూమ్మీద నివసించే మనుషులు సూర్యచంద్రులను గమనిస్తూనే ఉన్నారు. నాగరికతలు మొదలైన తొలినాళ్లలో సూర్యచంద్రులను దేవతలుగా ఆరాధించడం మొదలైంది. శాస్త్రీయంగా సూర్యచంద్రుల స్వరూప స్వభావాలను తెలుసుకోవాలనే ఆసక్తి క్రీస్తుపూర్వమే మొదలైంది. సూర్యచంద్రులు రెండూ అంతరిక్షంలోని భారీ రాతిగోళాలని క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్ తొలిసారిగా ప్రకటించాడు. శాస్త్రీయమైన దృష్టితో తన పరిశీలనకు తోచిన సంగతి చెప్పిన పాపానికి నాటి గ్రీకు పాలకులు మత విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడనే ఆరోపణతో ఆయనను ఖైదులో పెట్టారు. నిండు పున్నమినాడు భూమ్మీద మనుషులకు చంద్రుడు పూర్ణ కాంతులతో దర్శనమిస్తాడు. ఎంత పూర్ణకాంతులతో ధగధగలాడుతున్నా చంద్రుడిపై అక్కడక్కడా మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలను సైతం నాటి మనుషులు నిశితంగా పరిశీలించారు. చంద్రుడిపై కుందేలు ఆకారంలోని నీడను చూసి అనేక అభూత కల్పనలను ఊహించుకున్నారు. చంద్రుడిపై భారీస్థాయి ఎత్తు పల్లాలు ఉన్నందు వల్లనే చంద్రుడి ఉపరితలంలోని కొన్ని ప్రదేశాలకు సూర్యకాంతి చేరుకోలేకపోతోందని, అందుకే మనకు అక్కడక్కడా మచ్చల్లా కనిపిస్తున్నాయని మొట్టమొదటిసారిగా క్రీస్తుశకం రెండో శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త ప్లూటార్క్ తన ‘ఆన్ ది ఫేస్ ఇన్ ది మూన్స్ ఆర్బ్’ గ్రంథం ద్వారా తెలిపాడు. చంద్రుడిపై పడి పరావర్తనం చెందిన సూర్యకాంతి కారణంగానే చంద్రుడు మనకు వెన్నెల వెలుగులతో కనిపిస్తున్నాడని క్రీస్తుశకం ఐదో శతాబ్దికి చెందిన మన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట తొలిసారిగా ప్రకటించాడు. కొంతకాలానికి మనుషులు ఖగోళ విశేషాలను మరింత నిశితంగా తెలుసుకోవడానికి దుర్భిణుల వంటి సాధనాలను రూపొందించుకున్నారు. గ్రహాలు, నక్షత్రాల తీరుతెన్నులను తెలుసుకునే ఉద్దేశంతో వేధశాలలను ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో బాగ్దాద్‌లో ఏర్పాటు చేసిన వేధశాల నుంచి పర్షియన్ ఖగోళ శాస్త్రవేత్త హబాష్ అల్ హసీబ్ అల్ మర్వాజీ చంద్రుని వ్యాసం 3,037 కిలోమీటర్లు ఉంటుందని, భూమికి చంద్రునికి మధ్యనున్న దూరం 3,46,345 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశాడు. ఆయన అంచనాలు అధునాతన పరిశోధనల్లో నిగ్గుతేలిన అంచనాలకు దాదాపు దగ్గరగా ఉండటం విశేషం. పదహారో శతాబ్దికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో శక్తిమంతమైన టెలిస్కోప్‌ను రూపొందించి, దాని ద్వారా చంద్రుడు, నక్షత్రాలు, గ్రహచలనాలను ఏళ్ల తరబడి పరిశీలించి, అనేక విషయాలను వెల్లడించాడు. అంతరిక్షంలో భారతీయుడు సోవియట్ రష్యా 1984 ఏప్రిల్ 2న ప్రయోగించిన సోయజ్ టీ–11 రాకెట్ ద్వారా భారత పైలట్ రాకేశ్ శర్మ చంద్రమండలానికి చేరువగా అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లాడు. అంతరిక్షంలో అడుగు మోపిన తొలి భారతీయుడిగా ఘనత సాధించిన రాకేశ్ శర్మ అంతరిక్షంలో దాదాపు ఎనిమిది రోజులు గడిపాడు. తిరిగి భూమిపైకి చేరుకున్న తర్వాత రష్యన్ బృందంతో కలసి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు, ఇందిరాగాంధీ ఆయనను ‘అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎలా కనిపించింది?’ అని అడిగారు. ఆమె ప్రశ్నకు రాకేశ్ శర్మ ‘సారే జహా సే అచ్ఛా’ (ప్రపంచంలోనే అత్యుత్తమంగా) కనిపించిందని బదులిచ్చాడు. ప్రచ్ఛన్న యుద్ధంతో అందిన చందమామ అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒకరకంగా చంద్రునిపై ఆధునిక పరిశోధనల పురోగతికి దోహదపడింది. ఇరవయ్యో శతాబ్దిలో నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రెండు దేశాలూ అంతరిక్షంపై ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. చంద్రునిపై ప్రత్యేకించి దృష్టి సారించాయి. ఎలాగైనా చంద్రునిపైకి చేరుకోవాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలను రంగంలోకి దించి, భారీ స్థాయి పరిశోధనలకు నడుం బిగించాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న హోరాహోరీ పోటీలో కొన్ని విఫలయత్నాల తర్వాత 1959లో లూనా–2 ప్రయోగం ద్వారా రష్యా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత లూనా–3 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా చేసింది. చంద్రుని ఉపరితలం ఫొటోలను తీసి ప్రపంచానికి చూపింది. రష్యాను మించిన స్థాయిలో ఏకంగా మనిషినే చంద్రునిపైకి పంపాలని నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ తలచాడు. జాతీయ సత్వర అవసరాల సభలో ఆయన ఈ అంశాన్ని ముందుకు తెచ్చాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు భారీగా నిధులు మంజూరు చేశాడు. ఫలితంగా రష్యా చేపట్టిన లూనా–2 ప్రయోగానికి పదేళ్ల తర్వాత 1969లో అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుమోపగలిగాడు. వేగం పుంచుకున్న ‘ఇస్రో’ చంద్రునిపై పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్లతో పోల్చుకుంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఇస్రో ఆధ్వర్యంలో చంద్రునిపై చేపట్టిన తొలి ప్రయోగం 2008 నాటి ‘చంద్రయాన్–1’. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘చంద్రయాన్–2’ కోసం అప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. చంద్రునిపై ‘ఇస్రో’ ప్రయోగాలు ‘చంద్రయాన్–1’ నుంచి వేగం పుంజుకున్నాయి. ‘చంద్రయాన్–2’ పూర్తయిన తర్వాత 2024లో ‘చంద్రయాన్–3’ ప్రయోగం చేపట్టడానికి ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించారు. -
మామ.. ‘మంచు’మామ!
వాషింగ్టన్: అత్యంత చల్లగా, చీకటిగా ఉండే చంద్రుడి ధృవ ప్రాంతాల్లో ఘనీభవించిన నీటి నిల్వలు(మంచు) ఉన్నట్లు నాసా వెల్లడించింది. పదేళ్ల క్రితం భారత్ ప్రయోగించిన చంద్రయాన్–1 అంతరిక్ష నౌక పంపిన సమాచారాన్ని విశ్లేషించిన నాసా శాస్త్రవేత్తలు నీటి నిల్వలున్న విషయాన్ని ధ్రువీకరించారు. చంద్రుడి ఉపరితలం కింద లోతైన భాగాల్లో నీటి జాడలు ఉన్నట్లు గతంలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ నీటిని వినియోగించుకోవడం చాలా కష్టతరమైందని అప్పట్లోనే వెల్లడించారు. కానీ ప్రస్తుతం కనుగొన్న ఘనీభవించిన నీటి జాడలు చంద్రుడి ఉపరితలానికి కొద్ది మిల్లిమీటర్ల లోతులోనే ఉన్నాయని తెలిపారు. దీంతో భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాలతోపాటు ఆవాసానికి అవసరమయ్యే నీటిని ఇక్కడి నుంచే పొందవచ్చని చెబుతున్నారు. చంద్రుడి దక్షిణ ధృవం వద్ద లూనార్ క్రేటర్స్ (ఉల్కాపాతం వల్ల ఏర్పడిన గుంత లాంటి ప్రదేశం)లో మంచు మొత్తం ఒకేచోట నిక్షిప్తమై ఉండగా.. ఉత్తర ధృవ ప్రాంతంలో మాత్రం అక్కడక్కడా తక్కువ మొత్తంలో వ్యాపించి ఉందని వివరించారు. చంద్రయాన్–1 అంతరిక్ష నౌకలో మూన్ మినరాలజీ మ్యాపర్( M3) అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు అమర్చారు. ఈ పరికరం పంపిన సమాచారంతోనే చంద్రుడిపై ఉపరితలంపై నీటి ఆనవాళ్లను నాసా గుర్తించింది. -
చంద్రునిపై నీరు,మంచు
వాషింగ్టన్ : చంద్రునిపై నీటి, మంచు నిక్షేపాలు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. చంద్రునిపై ఘన స్థితిలో పలు ప్రాంతాల్లో నీటి నిక్షపాలు ఉన్నట్లు మంగళవారం నాసా ప్రకటించింది. పదేళ్ల క్రితం భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 మిషన్ అందించిన సమాచారం ద్వారా ఈ అంశాలను విశ్లేషించిన నాసా వాటిని నిర్ధారించింది. చంద్రయాన్-1 అందించిన సమాచారాన్ని ప్రకారం చంద్రునిపై గల శీతల భాగాల్లో మంచు నిక్షేపాలు కూడా ఉన్నాయని నాసా వెల్లడించింది. భవిష్యతుల్లో చంద్రుడిపైకి వెళ్లె యాత్రికులకు అక్కడ నివసించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది. చంద్రుని దక్షిణ ద్రువం వద్ద మంచు కేంద్రీకృతమై ఉందని.. ఆ మంచు పొరలు ఉత్తర దృవం వద్ద మరింత విస్త్రతంగా లభిస్తాయని పేర్కొంది. 2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1పై ఎం3 అనే పరికరాన్ని నాసా అమర్చిన విషయం తెలిసిందే. నాసాకు చెందిన ఎం3 పరికరం ద్వారా అక్కడి సమాచారాన్ని, మంచు, నీరు జాడలను సేకరించింది. చంద్రుని ధ్రువాల వద్ద ఎక్కువ మంచు ఉందని.. అక్కడ ఉష్ణోగ్రత -156 డిగ్రీలకు మించదని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా గతంలోనే చంద్రునిపై పలు పరిశోధనలు చేసిన నాసా చంద్రునిపై నీరు, మంచు ఉండే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
చంద్రుడి ఉపరితలంపై నీరు..!
వాషింగ్టన్: చందమామపై అధిక మొత్తంలో నీరు ఉందని నాసా శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో అంచనావేశారు. ఈ నీరు ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా చంద్రుడి ఉపరితలమంతా విస్తరించి ఉందని చెబుతున్నారు. చంద్రుడిపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్–1 పంపిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయం చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలు అక్కడి నీటిని ఒక వనరుగా వాడుకునేందుకు చేయాల్సిన పరిశోధనలకు సహకరిస్తాయని అమెరికాలోని స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ జోషువా బాండ్ఫీల్డ్ వివరించారు. -
జాబిల్లి మీద జలం ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : చందమామ.. చాలాకాలం తరువాత ఈ మధ్య మళ్లీ శాస్త్రవేత్తలను బాగా ఆకర్షిస్తున్నాడు. జాబిల్లిలో జలం ఉందా? లేదా? ఇస్రో నుంచి నాసా దాకా.. అంతర్జాతీయంగా ఉన్న సైంటిస్టులు కూడా ఈ అంశంపై రెండుమూడు రోజులుగా విరివిగా తమ అభిప్రాయాలను వెలువరిస్తున్నారు. ఇందులో 90 శాతం మంది జాబిల్లి మీద జలం ఉంది అంటుంటే.. కొద్ది శాతం మంది లేదని కొట్టి పారేస్తున్నారు.. ఇంతకూ వెన్నలరేడు గురించి చంద్రయాన్-1 ఏం చెప్పింది.. ఇంతవరకూ దాచిపెట్టిన వాస్తవాలను ఇప్పుడు మనవాళ్లు ఎందుకు బయటపెడుతున్నారు? తెలుసుకోవాలని ఉందా? అయితే.. ఈ స్టోరీ చదవేయండి. చందమామ మీద కాలనీలు నిర్మించుకోవచ్చని కొంతకాలంగా శాస్త్రవేత్తలు నమ్మబలుకుతున్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి విమానంలో వెళ్లినట్లు చందమామ మీదకు వెళ్లిరావచ్చని చెబుతున్నారు. ఇదంతా సాధ్యం కావాలంటే అక్కడ నీరుండాలి. జాబిల్లి మీద నీరుందని.. చంద్రుడి భూ పలకల కింద హిమాలయమంత నీటి కొండ ఉందని నాసా చెబుతోంది. ఇదిలా ఉంటే చంద్రుడి మీద పరిశోధనలు చేసేందుకు ఇస్రో 2008లో చంద్రయాన్-1ని చేపట్టింది. చంద్రయాన్ ఉపగ్రహం.. జాబిల్లి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నీటి జాడలు కనుగొంది. నీటి జాడల తాలుకు ఫొటోలను కూడా మనకు పంపింది. తాజాగా చంద్రయాన్ పంపిన ఫొటోలను, నాసా మూన్ మైనరాలజీ మ్యాపర్ పంపిన ఫొటోలపై బ్రౌన్ యూనివర్సిటీ సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో నాసా ఫొటోలకన్నా.. చంద్రయాన్ ఉపగ్రహం పంపిన ఫొటోలలో స్పష్టమైన నీటి జాడలు ఉన్నట్లు వారు తేల్చారు. చంద్రుడు ఉపరితలంతో పాటు.. ధృవ ప్రాంతాల్లోనూ నీటి జాడలున్నాయని తాజాగా సైంటిస్టులు గుర్తించారు. హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులు ఉన్నట్లు చంద్రయాన్ ఉపగ్రహం గుర్తించదని హవాయి యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. చంద్రుడి గురించి నాసాకు సైతం అనేక విశేషాలు అందించిన ఇస్రోకు ప్రపంచమంతా కృతజ్ఞత చెప్పాలని హవాయి వర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. చంద్రయాన్ ఫలితాల వల్లే జాబిల్లి శాస్త్రవేత్తల అంచనాలు మారాయని నాసా డైరెక్టర్ జిమ్ గ్రీన్ చెబుతున్నారు. భూమి మీద ఉన్నట్లు ధృవప్రాంతాల్లో మంచు లేదని.. అలాగే నీటి శాతం కూడా తక్కువగా ఉండొచ్చని నాసా డైరెక్టర్ అంచనా వేస్తున్నారు. -
చంద్రుడు కక్ష్యలో సేఫ్‌గా చంద్రయాన్ 1