జాబిల్లి మీద జలం ఉందా? | Chandrayaan-1 confirms Water on Moon | Sakshi
Sakshi News home page

జాబిల్లి మీద జలం ఉందా?

Sep 15 2017 3:52 PM | Updated on Sep 19 2017 4:36 PM

జాబిల్లి మీద జలం ఉందా?

జాబిల్లి మీద జలం ఉందా?

చందమామ.. చాలాకాలం తరువాత ఈ మధ్య మళ్లీ శాస్త్రవేత్తలను బాగా ఆకర్షిస్తున్నాడు.

సాక్షి, న్యూఢిల్లీ : చందమామ..  చాలాకాలం తరువాత ఈ మధ్య మళ్లీ శాస్త్రవేత్తలను బాగా ఆకర్షిస్తున్నాడు. జాబిల్లిలో జలం ఉందా? లేదా? ఇస్రో నుంచి నాసా దాకా.. అంతర్జాతీయంగా ఉన్న సైంటిస్టులు కూడా ఈ అంశంపై రెండుమూడు రోజులుగా విరివిగా తమ అభిప్రాయాలను వెలువరిస్తున్నారు. ఇందులో 90 శాతం మంది జాబిల్లి మీద జలం ఉంది అంటుంటే.. కొద్ది శాతం మంది లేదని కొట్టి పారేస్తున్నారు.. ఇంతకూ వెన్నలరేడు గురించి చంద్రయాన్‌-1‌ ఏం చెప్పింది.. ఇంతవరకూ దాచిపెట్టిన వాస్తవాలను ఇప్పుడు మనవాళ్లు ఎందుకు బయటపెడుతున్నారు? తెలుసుకోవాలని ఉందా? అయితే.. ఈ స్టోరీ చదవేయండి.

చందమామ మీద కాలనీలు నిర్మించుకోవచ్చని కొంతకాలంగా శాస్త్రవేత్తలు నమ్మబలుకుతున్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి విమానంలో వెళ్లినట్లు చందమామ మీదకు వెళ్లిరావచ్చని చెబుతున్నారు. ఇదంతా సాధ్యం కావాలంటే అక్కడ నీరుండాలి. జాబిల్లి మీద నీరుందని.. చంద్రుడి భూ పలకల కింద హిమాలయమంత నీటి కొండ ఉందని నాసా చెబుతోంది.

ఇదిలా ఉంటే చంద్రుడి మీద పరిశోధనలు చేసేందుకు ఇస్రో 2008లో చంద్రయాన్‌-1ని చేపట్టింది. చంద్రయాన్‌ ఉపగ్రహం.. జాబిల్లి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నీటి జాడలు కనుగొంది. నీటి జాడల తాలుకు ఫొటోలను కూడా మనకు పంపింది. తాజాగా చంద్రయాన్‌ పంపిన ఫొటోలను, నాసా మూన్‌ మైనరాలజీ మ్యాపర్‌ పంపిన ఫొటోలపై బ్రౌన్‌ యూనివర్సిటీ సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో నాసా ఫొటోలకన్నా.. చంద్రయాన్‌ ఉపగ్రహం పంపిన ఫొటోలలో స్పష్టమైన నీటి జాడలు ఉన్నట్లు వారు తేల్చారు. చంద్రుడు ఉపరితలంతో పాటు..  ధృవ ప్రాంతాల్లోనూ నీటి జాడలున్నాయని తాజాగా సైంటిస్టులు గుర్తించారు. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ వాయువులు ఉన్నట్లు చంద్రయాన్‌ ఉపగ్రహం గుర్తించదని హవాయి యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు.

చంద్రుడి గురించి నాసాకు సైతం అనేక విశేషాలు అందించిన ఇస్రోకు ప్రపంచమంతా కృతజ్ఞత చెప్పాలని హవాయి వర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. చంద్రయాన్‌ ఫలితాల వల్లే జాబిల్లి శాస్త్రవేత్తల అంచనాలు మారాయని నాసా డైరెక్టర్‌ జిమ్‌ గ్రీన్‌ చెబుతున్నారు.
భూమి మీద ఉన్నట్లు ధృవప్రాంతాల్లో మంచు లేదని.. అలాగే నీటి శాతం కూడా తక్కువగా ఉండొచ్చని నాసా డైరెక్టర్‌ అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement