'టాలీవుడ్లో కుల పిచ్చి ఎక్కువ'.. మహేశ్ విట్టా షాకింగ్ కామెంట్స్
యూట్యూబర్ కెరీర్ స్టార్ట్ చేసిన టాలీవుడ్లో నటుడిగా స్థిరపడిన కొద్దిమందిలో మహేశ్ విట్టా ఒకరు. చాయ్ బిస్కెట్ వెబ్ సిరీస్‌ల ద్వారా వినోదాన్ని పంచిన మహేశ్.. ఆ తర్వాత బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. టాలీవుడ్ సినిమాల్లో కమెడియన్‌గా తన నటనతో ప్రత్యేక ముద్రవేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూ హాజరైన మహేశ్ సినీ ఇండస్ట్రీలో తన జర్నీ గురించి ప్రస్తావించారు. తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.సినీ ఇండస్ట్రీలో కుల పిచ్చి ఎక్కువని సంచలన కామెంట్స్ చేశారు. ఆడిషన్ పూర్తయిన తర్వాత నాకు రావాల్సిన రోల్స్‌ను చివరి నిమిషంలో వేరేవాళ్లకు ఇచ్చేవారని అన్నారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేయడం కూడా ఆపేసే వారని తెలిపారు. ఇక్కడ టాలెంట్ కంటే.. కులం ముఖ్యమని నాకు అర్థమైందన్నారు. అలా నాకు ఎన్నో అవకాశాలు రాకుండా పోయాయని మహేశ్ విట్టా ఆవేదన వ్యక్తం చేశారు.గత ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ..' నేను చాలా పాత్రలకు ఆడిషన్లు ఇచ్చేవాడిని. నన్ను సెలెక్ట్ కూడా చేసేవారు. షూటింగ్ తేదీలు కూడా ఫిక్స్ చేసేవారు. కానీ చివరి నిమిషంలో నాకు ఫోన్ చేయడం ఆపేయడం.. నా స్థానంలో మరో నటుడిని తీసుకోవడం జరిగేది. మొదట్లో ఇదంతా నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ విషయంపై ఆరా తీశా. నా స్థానంలో వచ్చిన వ్యక్తి నిర్మాత, దర్శకుడి సామాజిక వర్గానికి చెందినవాడేనని తెలిసి షాక్ అయ్యా. ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం క్యాస్ట్ కారణంగా నాకు అవకాశాలు దక్కకపోవడం తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసింది' అని అన్నారు.కాగా.. యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న మహేశ్ విట్టా.. తర్వాత టాలీవుడ్లోకి వచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ షోలోనూ రెండుసార్లు కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. సినిమాలు చేస్తూనే శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు.