ప్రవాసీ చేతికి ట్రావెలెక్స్
న్యూఢిల్లీ: అబూధాబి కేంద్రంగా పనిచేసే ప్రవాస భారతీయ కోటీశ్వరుడు బీఆర్ శెట్టి తాజాగా భారీ డీల్‌కి తెర తీశారు. విదేశీ మారక ద్రవ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ట్రావెలెక్స్ హోల్డింగ్స్ సంస్థను కొనుగోలు చేయనున్నారు. ఈ డీల్ విలువ దాదాపు బిలియన్ పౌండ్లు (సుమారు రూ. 9,500 కోట్లు- రూ. 10,000 కోట్లు) ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రావెలెక్స్ చైర్మన్ లాయిడ్ డోర్ఫ్మన్, పీఈ సంస్థ అపాక్స్ పార్ట్నర్స్, ఇతర షేర్‌హోల్డర్ల నుంచి వాటాలను శెట్టి కొనుగోలు చేయనున్నారు. ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సెంచూరియన్ ఇన్వెస్ట్మెంట్స్.. ఈ డీల్‌ను పర్యవేక్షిస్తోంది.
ట్రావెలెక్స్కి ప్రపంచవ్యాప్తంగా 27 నగరాల్లో 1,500 స్టోర్స్, 1,300 పైగా ఏటీఎంలున్నాయి. యూఏఈ ఎక్స్ఛేంజీ .. శెట్టి యాజమాన్యంలో ఉంది. ట్రావెలెక్స్ పటిష్టమైన పనితీరు కనపర్చగలదని శెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నాటకలో జన్మించిన శెట్టి 1972లో రూ. 50తో అబూధాబి చేరుకున్నారు. అక్కడ ఫార్మా సేల్స్‌మన్‌గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం హెల్త్‌కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపార దిగ్గజాలను ఏర్పాటు చేశారు.