breaking news
B.Narayana Reddy
-
నారాయణరెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డిని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈ నెల 13న ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, రాజకీయ సలహా దారులు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరు లతో కలిసి వైఎస్ జగన్ ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో నారాయణరెడ్డి బయటకు వస్తారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడే ఉన్న వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. -
హైకోర్టు ఏర్పాటు అంత సులభం కాదు
హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడమంటే పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసినంత సులభమైన పని కాదని ఉమ్మడి హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే హైకోర్టు ఏర్పాటు సాధ్యమవుతుందని తెలిపింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పేందుకు మరో వారం రోజుల గడువునివ్వాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) బి.నారాయణరెడ్డి చేసిన విజ్ఞప్తిని కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. గడువు పొడించే సమస్యే లేదని తేల్చిచెబుతూ, విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. హైకోర్టు విభజన వ్యవహారంలో తమనూ ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినాలంటూ ఏపీ హైకోర్టు సాధన సమితి కన్వీనర్ ప్రసాద్‌బాబు, న్యాయవాది టి.అమర్నాథ్గౌడ్ వేర్వేరుగా దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. ఆ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతోపాటు ఇరు రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో గతవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే. దీనిని చీఫ్‌జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. గతవిచారణ సమయంలో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు నిధుల కేటాయింపు వివరాలు చెప్పేందుకు మరో వారం గడువివ్వాలన్న కేంద్రప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చుతూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.