breaking news
Bigbang
-
Joe Biden, NASA: కాలపు తొలి క్షణాల్లోకి తొంగిచూసిన వేళ...
వాషింగ్టన్: కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న ఈ దృశ్యాలు ఎప్పటివో తెలుసా? ఈ అనంత విశ్వం దాదాపుగా పొత్తిళ్ల పాపాయిగా ఉన్నప్పటివి! ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలే గనుక నిజమయ్యే పక్షంలో ఏకంగా ఈ విశ్వం పురుడు పోసుకున్నప్పటివి!! ఇంతటి అద్భుతమైన ఈ దృశ్యాలను నాసాకు చెందిన అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మన కళ్ల ముందుంచింది. ఇందుకోసం కాలంతో పాటు దూరంలోనూ ఏకంగా 1,300 కోట్ల సంవత్సరాలు వెనక్కు వెళ్లి, అత్యంత సుదూర గతంలోకి తొంగి చూసి మరీ ఈ అద్భుతమైన ఫొటోలను క్లిక్‌మనిపించింది. లెక్కలేనన్ని తారలు, తారా సమూహాలు, అత్యంత సుదూరాల్లో నింపాదిగా, భారంగా పలు ఆకృతుల్లో ఊపిరి పోసుకుంటున్న భారీ, అతి భారీ పాలపుంతలు తదితరాలతో నమ్మశక్యం కానంత రమణీయంగా సాగిన విశ్వరూప విన్యాసాన్ని కళ్లకు కట్టింది. అంతరిక్షంలో అటు కాలంలోనూ, ఇటు దూరంలోనూ ఇంతటి గతంలోకి దృష్టి సారించడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి. విశ్వావిర్భావానికి కారణంగా విశ్వసిస్తున్న బిగ్‌బ్యాంగ్ (మహావిస్ఫోటం) 1,380 కోట్ల ఏళ్ల క్రితం జరిగిందని చెబుతుంటారు. వెలుగుజిలుగుల మధ్య నక్షత్ర మండలాల సమూహం విశ్వాంతరాళానికి సంబంధించి నాసా సరికొత్త జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ క్లిక్‌మనిపించిన తొలి ఫొటోలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా వైట్‌హౌస్‌లో విడుదల చేశారు. ఇవి ఏకంగా 1,300 కోట్ల ఏళ్ల నాటి విశ్వాన్ని కళ్లకు కడుతున్నాయన్నది నమ్మశక్యం కాని వాస్తవమంటూ ఈ సందర్భంగా కాసేపు అబ్బురపాటుకు లోనయ్యారు. మానవాళి శాస్త్ర సాంకేతికతలో ఇది చరిత్రాత్మక క్షణమన్నారు. ఆయనే కాదు, అంతరిక్ష పరిశోధనల్లో తలపండిన నాసా శాస్త్రవేత్తలే ఈ ఫొటోలను చూసిన తొలి క్షణాల్లో చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యారట. దీన్ని ప్రస్తుతానికి స్మాక్స్ 0723గా పిలుస్తున్నారు. శక్తి నశించి క్రమంగా అంతర్ధానమవుతున్న నెబ్యులా తాలూకు భిన్న దశలు వీటిలో తెలుపు, పసుపు, ఎరుపు తదితర రంగుల్లో కనువిందు చేస్తున్న అపార తారా సమూహపు భారీ విన్యాస పరంపర నిజానికి అనంత విశ్వానికి సంబంధించిన అతి చిన్న భాగం మాత్రమేనని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అన్నారు. దీనికి కొనసాగింపుగా జేమ్స్ వెబ్ తీసిన మరో నాలుగు ఆసక్తికరమైన ఫొటోలను నేడు విడుదల చేయనున్నట్టు నాటో ప్రకటించింది. మన సౌరవ్యవస్థకు కొద్దిగా ఆవల ఉన్న ఓ భారీ వాయుగ్రహం, పుడుతూ, గిడుతూన్న నక్షత్రాలతో కూడిన అతి మనోహరమైన నెబ్యులాలు, ఒకదాని చుట్టూ ఒకటి నాట్యం చేస్తున్నట్టుగా కన్పిస్తున్న ఐదు నక్షత్ర మండలాలు తదితరాలు వాటిలో ఉన్నాయట. ఇంతకూ జేమ్స్ వెబ్ తీసిన తొలి ఫొటోలోని విశ్వం వయసు ఎంత అయ్యుండొచ్చు? అంతరిక్ష పరిశోధకులు కొన్నాళ్ల పాటు రకరకాల లెక్కలతో కుస్తీ పడితే గానీ ఇది తేలదట! జేమ్స్ వెబ్ త్వరలోనే విశ్వంలో ఇంతకంటే ఇంకా లోలోతులకు దృష్టి సారించి ఫొటోలు తీస్తుందని నాసా చెబుతోంది. జేమ్స్... హబుల్ వారసుడు జేమ్స్ వెబ్ ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత శక్తిమంతమైన స్పేస్ టెలిస్కోప్. దీన్ని వయసు మళ్లిన హబుల్ టెలిస్కోప్‌కు వారసునిగా 10 బిలియన్ డాలర్ల భారీ ఖర్చుతో నాసా నిర్మించింది. ఇందుకు ఏకంగా 30 ఏళ్లు పట్టింది. 2021 డిసెంబర్లో దీన్ని అంతరిక్షంలోకి పంపింది. తర్వాత సుదీర్ఘ ప్రక్రియ ద్వారా దాని అద్దాలు, పరారుణ డిటెక్టర్లు తదితరాలను సరైన కోణాల్లో బిగించి సిద్ధం చేశారు. దీని చల్లదనాన్ని నిరంతరం పరిరక్షించేందుకు దానిపైన టెన్నిస్ కోర్టు సైజులో సన్‌షేడ్ ఏర్పాటు చేశారు. దీని సాయంతో మన సౌరకుటుంబంతో పాటు విశ్వంలోని సుదూరాలకు, విశ్వం పుట్టినప్పటి కాలంలోకి దృష్టి సారించి అనేకానేక రహస్యాలను శోధించనున్నారు. -
భారత విద్యార్థుల కోసం విశ్వ రహస్యాలు
న్యూఢిల్లీ: బిగ్‌బ్యాంగ్, హిగ్స్ బోసన్ వంటి విశ్వరహస్యాలను శాస్త్రవేత్తలు భారతీయ విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇందుకు లైఫ్ ల్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నొయిడాకు చెందిన శివ్ నాడర్ స్కూల్... స్విట్జర్లాండ్– జెనివాలోని ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (సెర్న్) సంస్థతో కలసి పని చేస్తోంది. ‘హై ఎనర్జీ ఫిజిక్స్’లో చేసిన పరిశోధనలకుగాను అర్చనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘విశ్వ రహస్యాలు’అనే అంశంపై 2 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెర్న్ శాస్త్రవేత్త అర్చనాశర్మ మాట్లాడుతూ.. సీఈఆర్ఎన్లో భారత్ అసోసియేట్ మెంబర్ కావడం వల్ల ఇక్కడ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. సమావేశాల్లో మరో ప్రధానాంశం సీనియర్ శాస్త్రవేత్త, హిగ్స్ కన్వీనర్ డాక్టర్ అల్బెర్ట్ డీ రాక్తో విద్యార్థుల ఇంటరాక్టివ్ సేషన్. విశ్వం, ఫిజిక్స్ గురించి మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమాలు సాయపడతాయని శివ్ నాడర్ స్కూల్లో 12వ గ్రేడ్ విద్యార్థి ఆర్యాన్ శంకర్‌మిశ్రా చెప్పారు. -
మహా విస్ఫోటం నుంచి నేటి దాకా..
సుమారు 1,370 కోట్ల ఏళ్ల క్రితం మహా విస్ఫోటం (బిగ్‌బ్యాంగ్) అనంతరం విశ్వం ఆవిర్భవించి... అది నేటి దాకా పరిణామం చెందిన క్రమాన్ని వివరిస్తూ రూపొందించిన కంప్యూటర్ సిమ్యులేషన్ చిత్రమిది. విశ్వ పరిణామాన్ని వివరించే చిత్రాలతో ‘ఇలస్ట్రిస్’ అనే కంప్యూటర్ సిమ్యులేషన్(అనుకరణ వీడియో)ను మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. 8 వేల సీపీయూలను వినియోగించి, 1,200 కోట్ల 3డీ పిక్సెల్స్‌తో ఈ ఇలస్ట్రిస్ను ఆవిష్కరించారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం నుంచి నేటి దాకా విశ్వం ఏ కాలానికి ఎలా విస్తరించింది? కంటికి కనిపించని కృష్ణపదార్థం, కనిపించే సాధారణ పదార్థం ఎలా వ్యాపించాయి? గెలాక్సీలు, నక్షత్రాల ఆవిర్భావం తదితర వివరాలను ఈ ఇలస్ట్రిస్ తెలియజేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది విశ్వంలో ఏ కాలాన్ని అయినా చూపే టైం మెషిన్ లాంటిదన్నమాట. దీని ద్వారా నేటి నుంచి వెనక్కి.. లేదా బిగ్‌బ్యాంగ్ నుంచి నేటికి ఎలాగైనా విశ్వాంతరాలను అన్వేషించవచ్చె. చిత్రం లో నీలి రంగులో ఉన్నది కృష్ణపదార్థం, మిగతాది గెలాక్సీలు, గెలాక్సీ క్లస్టర్స్‌తో కూడిన సాధారణ పదార్థం. -
తారలకు తాత..
ఇది విశ్వంలోనే అత్యంత పురాతనమైన నక్షత్రం ఫొటో. దీని వయసు 1,370 కోట్ల ఏళ్లు. భూమికి 6 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ తారను ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బిగ్‌బ్యాంగ్ తర్వాత ఇది ఏర్పడిందని చెబుతున్నారు. తొలి తరం నక్షత్రాలను అధ్యయనం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.