breaking news
Bhiknoor
-
భిక్కనూరులో కరోనా కలకలం
‘‘మా బంధువు మర్కజ్‌కు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేదు.. అతడిని చూసేందుకు హైదరాబాద్‌కు వెళ్లి వచ్చాను’’ అన్న ఆ కార్మికుడి మాటలు భిక్కనూరులో కలకలం రేపాయి. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపేలా చేశాయి. అధికారులు అతడి కుటుంబాన్ని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. సాక్షి, భిక్కనూరు : భిక్కనూరుకు చెందిన ఓ వ్యక్తి మండల కేంద్రానికి సమీపంలోకి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతడు 25 రోజులుగా విధులకు హజరుకావడం లేదు. శనివారం ఫ్యాక్టరీకి వెళ్లాడు. ఇన్ని రోజులు ఎందుకు రాలేదని ఫ్యాక్టరీ ఇన్చార్జి ప్రశ్నించారు. దీంతో తన బంధువు మర్కజ్‌కు వెళ్లి కరోనా బారినపడ్డాడని, అతడిని చూసేందుకు హైదరాబాద్‌కు వెళ్లి లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయానని తెలిపాడు. ఫ్యాక్టరీ ప్రతినిధులు వెంటనే ఆవరణను సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయించారు. ఈ విషయం దావానలంలా మండలమంతా వ్యాపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. భిక్కనూరు సర్పంచ్ వేణు వెంటనే ప్రభుత్వ వైద్యుడు రవీందర్, ఎస్సై నవీన్‌కుమార్‌లకు సమాచారం అందించారు. ప్రభుత్వ వైద్యుడు రవీందర్ సదరు కార్మికుడి కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని అంబులెన్స్‌లో తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో ఉన్న క్వారంటైన్ సెంటర్‌కు పంపించారు. నలుగురి రక్తనమూనాలను కరోనా పరీక్షకు పంపిస్తామని వైద్యుడు రవీందర్ తెలిపారు. -
ఒకటే పని.. రెండు ప్రారంభోత్సవాలు
భిక్కనూరు, న్యూస్‌లైన్ : అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ సమస్య తలెత్తుతోంది. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తేదీలను ముందుగా ఖరారు చేసి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పిలవాల్సిన అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. దీంతో భిక్కనూరు మండలంలో ఇటీవల జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలోనూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంటోంది. తాజాగా ఆదివారం భిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో ఈ సమస్య పునరావృతం అయ్యింది. బాగిర్తిపల్లిలో బీటీ రోడ్డు మరమ్మతుకు రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. వీటి పనులను ప్రారంభించడానికి ఆదివారం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని నిధులు మంజూరు చేయించింది తమ నాయకుడు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అంటూ వాదనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు పార్టీల నాయకులు బాహాబాహీకి సిద్ధమయ్యారు. ఎస్ఐ గంగాధర్ అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతపరిచారు. ఘర్షణ సద్దుమణిగాక కాంగ్రెస్ నాయకుడు, స్థానిక సర్పంచ్ శ్రీశైలం రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరోవైపు ఇదే రోడ్డు పనులను ప్రారంభించారు. అసలు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించే కార్యక్రమంలో అధికారులెవరూ పాల్గొనకపోవడం గమనార్హం. అధికారులు రోడ్డు ప్రారంభ పనులకు ముహూర్తం నిర్ణయించి ప్రజాప్రతినిధులను పిలిచి ఉంటే ప్రొటోకాల్ సమస్య తలెత్తేది కాదని పలువురు పేర్కొంటున్నారు. గతంలో బస్వాపూర్, గుర్జకుంట గ్రామాల్లోనూ ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. ప్రొటోకాల్ పాటించలేదంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రచారాలకు వేదిక చేసుకునేందుకు ఇరు పార్టీలు యత్నిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయ విభేదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ప్రతి వేదికనూ తమ రాజకీయాలకు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ప్రారంభోత్సవాల సందర్భంగా ఉన్నతాధికారులనుంచి అనుమతి తీసుకోకపోవడం, ఆదరాబాదరగా వ్యవహరించడంలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉంది.