breaking news
BCs reservations
-
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చెల్లవు
సాక్షి, అమరావతి: అనుకున్నదే అయింది. న్యాయస్థానం ముందు నిలబడవని తెలిసి కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మొక్కుబడిగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చట్టం ముందు నిలబడవని తేల్చి చెప్పింది. 34 శాతం రిజర్వేషన్ల వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్లపై పునః పరిశీలన చేసి, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వికాస్ కిషన్‌రావు గవాలి, జన్హిత్ అభియాన్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా డేటా సేకరణ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తరువాతనే బీసీలకు 50 శాతానికి మించి రిజర్వేషన్ కల్పించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీలకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడానికి, ప్రభుత్వం సమర్పించిన ‘యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ద్వారా సేకరించిన ప్రాతిపదిక డేటా (యంపరికల్ డేటా) చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.వికాస్ కిషన్ రావు గవాలి, జన్హిత్ అభియాన్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పుల ప్రకారం... రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన సరైన, శాస్త్రీయమైన ప్రాతిపదిక డేటా ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. బీసీ రిజర్వేషన్ల ప్రకటనకు ప్రాతిపదికగా నిలవలేని ‘యునిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ద్వారా సేకరించిన ప్రాతిపదిక డేటాపై రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోందని ఆక్షేపించింది. ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించండి... రాష్ట్రంలో పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పాలక వర్గాల కాల పరిమితి ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌లో ముగిసిందని, అందువల్ల వెంటనే స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)పై ఉందంది. ఎన్నికలు నిర్వహించడం, అవసరమైన ఎన్నికల పూర్వ ప్రక్రియను సకాలంలో చేపట్టడమన్నది ఎన్నికల కమిషన్, రాష్ట్రప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత అని తెలిపింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను నేటి నుంచి ఆరు వారాల్లోపు ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు సర్ అడ్డంకి కాదు... స్థానిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ఎంత మాత్రం అడ్డంకి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. సర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, దాని కోసం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘అర్హత తేదీన ఉనికిలో ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరుపుకోవచ్చు. సర్ కారణంగా పాత ఓటర్ల జాబితాను పక్కన పెట్టలేమని ‘లక్ష్మీ చరణ్ సేన్ వర్సెస్ ఎ.కె.ఎం. హసన్ ఉజ్జమాన్’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.అంతేకాకుండా, 1994 నాటి ఏపీ పంచాయతీ రాజ్ చట్టం (సెక్షన్ 11), ఏపీ మున్సిపాలిటీల చట్టం1965, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం1955 (సెక్షన్ 12) నిబంధనలను పూర్తిగా పాటిస్తే చాలని, తాము ఎన్నికలను అడ్డుకోవాలనుకోవడం లేదని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, అడ్వకేట్ జనరల్ కూడా ఈ నిబంధనలను పాటిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితులన్నింటి దృష్ట్యా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించకుండా లేదా నోటిఫై చేయకుండా ఎన్నికల కమిషన్‌ను, ప్రభుత్వాన్ని ఆదేశించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు. ’అని హైకోర్టు స్పష్టం చేసింది. రాజీవ్ రంజన్ కమిషన్ చట్టబద్ధత జోలికి వెళ్లడం లేదు... బీసీ రిజర్వేషన్ల ఖరారు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ కమిషన్ చట్టబద్ధతను పిటిషనర్ సవాలు చేయలేదని, అందువల్ల తాము ఆ అంశం జోలికి వెళ్లడం లేదంది. బీసీ జనగణన చేసిన తరువాతనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. బీసీ ఉపవర్గీకరణ ప్రభుత్వ పరిధిలోనిది.. మేం ఆదేశాలివ్వలేం... అలాగే బీసీల ఉప వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా ధర్మాసనం కొట్టేసింది. ఉపవర్గీకరణ చేపట్టే విషయంలో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసేందుకు తగిన కారణాలేవీ కనిపించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ‘ఇ.వి. చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను తాము పరిశీలించామని, ఒక వర్గంలో ఉప–వర్గీకరణ లేదా వర్గీకరణ చేయడం చట్టవిరుద్ధం కాదు.అయితే అలా చేయాలంటే, ముందుగా ఆ వర్గం ’సజాతీయమైనదా లేదా అన్ని విధాలా సమానమైనదా అని తేల్చాలి. ఒకవేళ ఆ వర్గం సజాతీయమైనది అయితే, ఉప–వర్గీకరణ చేయడానికి వీలులేదు. అదే సజాతీయమైనది కాకపోతే, సాధించాలనుకున్న లక్ష్యానికి తగిన తార్కిక ప్రాతిపదికలతో ఉప–వర్గీకరణను పరిశీలించవచ్చు. పెద్ద వర్గమైన ఎస్సీ, బీసీల నుండి వేరు చేసిన నిర్దిష్ట సమూహం, కులం, అదే వర్గంలోని మిగతా వారి కంటే ఎక్కువ వెనుకబడిన స్థితిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాల్సిన అంశాలే తప్ప, ఉప–వర్గీకరణ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ’ అని హైకోర్టు తన తీర్పుల్లో పేర్కొంది. వార్డుల పునర్వీభజన అధికారం ప్రభుత్వానికి ఉంది... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్వీభజన ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లను సైతం హైకోర్టు కొట్టేసింది. వార్డుల పునర్వీభజన చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర జనాభా లెక్కల కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ వార్డుల పునర్వీభజనకు అడ్డంకి ఎంత మాత్రం కాదని తేల్చి చెప్పింది. వార్డులు పునర్వీభజన చేపట్టకూడదన్న నిషేధం ఏమీ చట్టంలో లేదని హైకోర్టు గుర్తు చేసింది. ‘భారత రాజ్యాంగంలోని పార్ట్ 9ఏ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థకు సంబంధించిన పరిపాలనా యూనిట్ మున్సిపాలిటీ అవుతుంది.అది మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు లేదా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు. జనగణన చట్టం 1948, జనగణన నిబంధనలు 1990లు మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పునర్వీభజన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకుండా నిషేధించవు. అందువల్ల 2025 ఆగస్టు 13వ తేదీన జారీ చేసిన సర్క్యులర్ ద్వారా జనగణన కోసం పరిపాలనా యూనిట్ల సరిహద్దులను ఫ్రీజ్ చేసినప్పటికీ, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో వార్డుల పునర్వీభజన ప్రక్రియను చేపట్టడానికి అది అడ్డంకి కాదు. అందువల్ల ఈ అప్పీళ్లను కొట్టేస్తున్నాం.’ అని హైకోర్టు తన తీర్పుల్లో తేల్చి చెప్పింది. వారి పదవీ కాలం ఐదేళ్లే... అంతకు మించి కొనసాగే అధికారం లేనే లేదు... రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఎన్నికైన సర్పంచులు, చైర్మన్ల పదవీ కాలం ఐదు సంవత్సరాలని, ఈ కాలం పూర్తయిన తరువాత కూడా ఆ పదవుల్లో కొనసాగడానికి వారికి ఎటువంటి హక్కు లేదని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సర్పంచ్‌లు, చైర్మన్లను కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయలేమంది. అందుకే ఆ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ‘రాజ్యాంగంలోని అధికరణ 243ఈ ప్రకారం ప్రతి పంచాయతీ తన మొదటి సమావేశ తేదీ నుండి ఐదు సంవత్సరాలు మాత్రమే కొనసాగుతుంది, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ కాలం కొనసాగరాదు. అదేవిధంగా, అధికరణ 243యు ప్రకారం మున్సిపాలిటీలు కూడా మొదటి సమావేశ తేదీ నుండి 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగడానికి వీలు లేదు. 1994 నాటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 13(1) కూడా ఎన్నికైన సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు అని స్పష్టంగా చెబుతోంది. రాజ్యాంగపరమైన ఈ స్పష్టమైన ఆదేశాన్ని ఉల్లంఘించి, 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పొడిగించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి, సర్పంచ్‌లు లేదా మున్సిపాలిటీ చైర్మన్లుగా ఎన్నికైన పిటిషనర్లకు 5 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ పదవులలో కొనసాగే హక్కు ఎంత మాత్రం లేదు.’ అని హైకోర్టు తేల్చిచెప్పింది. గ్రామాల విలీన సవరణ చట్టం సబబే... రాష్ట్రంలో పలు గ్రామాలను సమీప మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనం చేస్తూ అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2021 జూన్ 9న తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని హైకోర్టు సమర్ధించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ కొట్టేసింది. ‘ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని సమరి్ధస్తున్నాం. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 14, ఆర్టీకల్ 243క్యూ(2)లకు వ్యతిరేకం కాదు, అలాగే రాజ్యాంగంలోని 73, 74 వ సవరణలకు కూడా విరుద్ధం కాదు. ఈ సవరణ చట్టాన్ని శాసనసభ తన పరిధిని అతిక్రమించి తీసుకొచ్చినట్లుగా పరిగణించలేం.ఇది శాసనపరమైన చర్య. ఇది రాష్ట్ర శాసనసభ అధికార పరిధికి లోబడి ఉంది. గ్రామ పంచాయతీలను రద్దు చేస్తూ ఒక నోటిఫికేషన్, వాటిని మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం మరో వేరే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం గురువారం తీర్పులు వెలువరించింది. స్థానిక ఎన్నికలతో ముడిపడి ఉన్న మొత్తం 8 అంశాలపై ధర్మాసనం వేర్వేరుగా తీర్పులు ఇచ్చింది.హైకోర్టు తీర్పులిచ్చిన అంశాలివే..⇒ బీసీ జనాభా లెక్కించిన తరువాతనే రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు 2025లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ⇒ రాష్ట్రంలో స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసినా కూడా ఎన్నికలు నిర్వహించడం లేదని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2026లో పిల్ వేశారు. ⇒ స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వరకు సర్పంచ్‌లు, చైర్పర్సన్లను యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన లక్షమ్మ, ఎస్తేరమ్మలు ఈ ఏడాది పిల్ దాఖలు చేశారు.⇒ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్, కృష్ణా జిల్లాకు చెందిన పెనమకూరు వెంకట నరసింహ శర్మ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ⇒ బీసీల ఉపవర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజయనగరంకు చెందిన మూలవీసల దుర్గాప్రసాద్ 2026లో పిల్ వేశారు. ⇒ కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.⇒ ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు తదితర జిల్లాకు చెందిన పలువురు అప్పీళ్లు దాఖలు చేశారు. ⇒ రాష్ట్రంలోని పలు గ్రామాలను సమీప మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విలీనం చేస్తూ 2021లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ పలువురు 2021, 2024, 2026 సంవత్సరాల్లో పలువురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.వీటన్నింటిపై ఇటీవల సుదీర్ఘ వాదనలు విని తీర్పులు రిజర్వ్ చేసిన సీజే ధర్మాసనం గురువారం ఉదయం వాటన్నింటిలో తన నిర్ణయాన్ని వెలువరించింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ తాండవ యోగేష్, వెంకట నరసింహ శర్మ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం అనుమతించింది. సర్ ప్రక్రియ ముగిసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ పిటిషన్‌ను పలు ఆదేశాలతో పరిష్కరించింది. ఇవి తప్ప మిగిలిన అన్ని వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టేసింది. -
నేనూ బీసీ ఇంటి కోడలినే: మంత్రి రోజా
నగరి(చిత్తూరు): నేనూ బీసీ ఇంటి కోడలినే అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. సోమవారం ఆమె నగరిలోని క్యాంపు కార్యాలయంలో జయహో బీసీ మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ బీసీలను వెనుకబడిన వారిగా కాకుండా, వారే రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో నిర్వహించే జయహో బీసీ మహాసభను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా 139 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి జగనన్న బీసీల పక్షపాతిగా నిరూపించుకున్నారని చెప్పారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లోనూ 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. బీసీ వర్గాలు అంటే కేవలం ఓటు బ్యాంకుగా భావించి, ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తు తెచ్చుకునే చంద్రబాబుకు ఈ సారి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు -
బీసీల రిజర్వేషన్ల కోసం 9న చలో ఢిల్లీ
- టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం మే 9న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. పార్లమెంటు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లు చెప్పారు. మంగళవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద కృష్ణయ్య మాట్లాడారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నేతలను కలసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి అఖిలపక్షాన్ని పంపాలని డిమాండ్ చేశారు. ఏపీలో కాపులను బీసీ చేర్చాలనడం, గుజరాత్లో పటేళ్లను, హరియాణాలో జాట్లను ఇలా ప్రతీ చోట అగ్ర కులాలను చేర్చి బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు.


