breaking news
Bantipulu
-
బంతి సాగు భలే బాగు
ఖమ్మం వ్యవసాయం: బంతిపూలకు మార్కెట్లో మాంచి గిరాకీ ఉంది. రైతులు బంతి సాగును ఎంచుకుంటే లాభాలు గడించే అవకాశం ఉంది. ప్రస్తుతం కిలో బంతిపూలు రూ.80కి పైగానే పలుకుతున్నాయి. జిల్లాలో రఘునాథపాలెం, కూసుమంచి, ఖమ్మం అర్బన్, రూరల్, కొణిజర్ల, ఎర్రుపాలెం, బోనకల్లు, తల్లాడ, కొత్తగూడెం, జూలూరుపాడు మండలాల్లో బంతి ఎక్కువగా సాగు చేస్తున్నారు. వాతావరణం: బంతి పెరుగుదల, పూలదిగుబడికి ఎక్కువ తారతమ్యాలు లేని వాతావరణం అనుకూలం. వాతావరణ పరిస్థితులను బట్టి జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకోవచ్చు. నేలలు: నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం ఉన్నవి, సారవంతమైన గరప నేలలు బంతికి అనుకూలం. రకాలు: ఆఫ్రికన్ బంతి: ఇది ఎత్తుగా పెరిగే దృఢమైన మొక్క. దీనిలో ఒంటి రెక్క నుంచి ముద్దగా, పెద్దగా ఉండే రకాలు ఉన్నాయి. పూలు నిమ్మరంగు నుంచి పసుపు, బంగారు వర్ణం నుంచి నారింజరంగు వరకు అనేక వర్ణాలు ఉన్నాయి. ఫ్రెంచ్ మేరీగోల్డ్: ఇది పొట్టిగా గుబురుగా పెరిగి ఒంటిరెక్క లేదా ముద్దగా ఉండే పూలు పూస్తాయి. పూలు పసుపు నుంచి నారింజ, ఎరుపు, గోధుమ, బంగారు పసుపు రంగులు మిళితమై ఉంటాయి. ఇవే కాకుండా మేలైన రకాలు పూసా, నారింగ గైండా, పూసా బసంతి గైండా, యూడీయూ-1 రకాలు ఉన్నాయి. విత్తన మోతాదు..విత్తే పద్ధతి: ఎకరానికి 800-1000 గ్రాముల విత్తనాన్ని ఎత్తై మడులు చేసి నాటాలి. మళ్లు తయారు చేసే సమయంలో ఒక చదరపు మీటరుకు 8-10 కిలోలు బాగా చిలికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి మొదలు ఫాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదల నుంచి రక్షించుకోవచ్చు. సాధారణంగా 5-7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. కత్తిరింపులు: కొన్ని రకాల్లో విత్తనం ఏర్పడదు. ఈ రకాలను కాండపు మొక్కలను నాటి ప్రవర్థనం చేయాలి. దీ ని కోసం కొమ్మల చివర 10 సెం.మీ. పొడవుగల భాగాన్ని కత్తిరించి, చివరి ఒకటి లేక రెండు జతల ఆకులు ఉంచి తేమగల ఇసుకలో (కుండి లేక మడుల్లో) నాటాలి. మడిలో నాటితే నీడ ఏర్పాటు చేయాలి. ఇసుకలో చెమ్మ ఆరిపోకుండా నీరు చిలకరించాలి. నాటిన 8-10 రోజుల్లో వేరు తొడగడం గమనించవచ్చు. వేరు వ్యవస్థ బాగా ఏర్పడిన తర్వాత వీటిని నాటుకోవాలి. నాటే విధానం: నెల వయసు 3-4 ఆకులున్న మొక్కలు నాటడానికి అనుకూలం. ఆఫ్రికన్ బంతి మొక్కల్ని 40-30 సెం.మీ.దూరంలో కత్తిరింపులను 20ఁ20 సెం.మీ.దూరంలో నాటితే పూల దిగుబడి బాగా ఉంటుంది. ఎరువులు: చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చిలికిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 20-40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. నాటిన 37 రోజులకు 20-40 కిలోల నత్రజని పై పాటుగా వేసి నీరు పెట్టాలి. నీటి యాజమాన్యం: నాటిన 55-60 రోజుల వరకు పూత దశలోనూ నేలలో తేమ ఉండేలా చూడాలి. పించింగ్: ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరగా పూమొగ్గ ఏర్పడుతుంది. అప్పుడే పక్క కొమ్మలు ఏర్పడతాయి. నాటిన 40వ రోజు పించింగ్ చేస్తే పూల దిగుబడి పెరుగుతుంది. పూల కోత: పూలను ఉదయం కాని సాయంత్రం కాని కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇస్తే పూలు కోత తర్వాత ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సాధారణంగా ఎకరానికి 4-5 టన్నుల వరకు పూలదిగుబడి వస్తుంది. -
పుష్ప విలాపం
=బంతి పూల రైతుకు కష్టాలు, కన్నీళ్లు =బుట్టపూలకు రూ.5 కూడా రాని వైనం =ఎవరూ కొనక రోడ్డు పాలు నిన్న తోటలో విరిసిన బంతిపూలు నేడు రోడ్డు పక్క దుమ్ములో, ధూళిలో పొర్లాడుతున్నాయి. దేవుని కంఠాన్ని మాలగా అలంకరించాల్సిన సుమాలు ఎందుకూ పనికిరాకుండా మట్టిలో కలిసిపోతున్నాయి. మన్యం రైతన్నకు అంతో ఇంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టిన కుసుమాలు తమను మమకారంతో సాకిన కర్షకుడి కష్టాన్ని చూసి కన్నీరు పెడుతున్నాయి. వ్యాపారుల స్వార్థం కారణంగా కనీసం ఐదు రూపాయలైనా తెచ్చి పెట్టలేని తమ నిస్సహాయతను గుర్తు చేసుకుని బంతి పూలు బావురుమంటున్నాయి. పాడేరు, న్యూస్‌లైన్: కుంకుమ రాశుల్లా, ప్రభాత కాంతుల అందాలకు ప్రతిరూపాల్లా తోటల్లో విరబూసిన పూలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. రోడ్డు పక్క రెక్కలు తెగి, ధూళి రాశుల్లా దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు రైతన్నకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయాన్ని సమకూర్చిన బంతిపూలు ఇప్పుడు మట్టిపాలై ఉసూరంటున్నాయి. కొనేవారు లేక గిరిజన రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. మన్యంలో శీతాకాలంలో బండిపూలు రాశులుగా విరబూస్తాయన్నది తెలిసిందే. పూలకు గిరాకీ ఉండడంతో రైతులు వాటిని పెద్ద ఎత్తున సాగు చేస్తారు. పాడేరులో మైదాన ప్రాంత వ్యాపారులకు నిత్యం విక్రయిస్తారు. సోమవారం తెల్లవారుజామున కూడా వారు పాత బస్టాండ్‌లోని పూల మార్కెట్‌కు గిరిజన రైతులు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. వేకువనే లేచి, చలికి ఓర్చి, బస్సులు, ఆటోల ద్వారా బంతి పూలతో ఇక్కడికి చేరుకున్న రైతులు వ్యాపారుల కోసం ఎదురు చూశారు. నిన్నటి వరకు బుట్ట పూలు రూ.50 నుంచి రూ.70 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు సోమవారం మాట మార్చారు. అంత ధర చెల్లించలేమని చెప్పేశారు. దాంతో రైతులంతా తల్లడిల్లారు. మైదాన ప్రాంతాల్లో బంతి పూలకు ధర లేదని, అక్కడ కిలో రూ.5కు మించి కొనుగోలు చేయడంలేదని వ్యాపారులు చెప్పారు. తమకు రవాణా ఖర్చులైనా రాకపోతే కష్టమని రైతులు పట్టుబట్టారు. కానీ వ్యాపారులు ఇసుమంతైనా కరగలేదు. సమయం మించిపోతూ ఉండడంతో ఎంతకైనా కొనుగోలు చేయాలని రైతులు ప్రాధేయ పడ్డారు. దీంతో కొందరు వ్యాపారులు బుట్ట పూలను రూ.5కు కొనుగోలు చేశారు. అయినా ఎక్కువ పూలు మిగిలిపోవడంతో మరో దారిలేక రైతులంతా పూలను రైతు బజార్, పాతబస్టాండ్, ఎన్జీవో భవన్ సమీపంలో రోడ్డుపై పారబోశారు. తిరిగి వెళ్లేందుకు బస్సు, ఆటో చార్జీలు కూడా లేక ఆకలితో కాలినడకనే వెనక్కు వెళ్లారు. పలువురు గిరిజన మహిళలు పూలను పారబోస్తూ కన్నీళ్లుపెట్టుకున్నారు. ఎంతో కష్టపడి పండించి, ఓ రోజంతా తోటల నుంచి పూలను కోసి, ఎముకలు కొరికే చలిలో తెల్లవారు జామునే మార్కెట్‌కు తీసుకువస్తే ఇలా అయిందని ఉసూరన్నారు.