పుష్ప విలాపం | Flower ball farmer's difficulties | Sakshi
Sakshi News home page

పుష్ప విలాపం

Nov 26 2013 1:54 AM | Updated on Oct 4 2018 6:03 PM

నిన్న తోటలో విరిసిన బంతిపూలు నేడు రోడ్డు పక్క దుమ్ములో, ధూళిలో పొర్లాడుతున్నాయి. దేవుని కంఠాన్ని...

=బంతి పూల రైతుకు కష్టాలు, కన్నీళ్లు
 =బుట్టపూలకు రూ.5 కూడా రాని వైనం
 =ఎవరూ కొనక రోడ్డు పాలు

 
 నిన్న తోటలో విరిసిన బంతిపూలు నేడు రోడ్డు పక్క దుమ్ములో, ధూళిలో పొర్లాడుతున్నాయి. దేవుని కంఠాన్ని మాలగా అలంకరించాల్సిన సుమాలు ఎందుకూ పనికిరాకుండా మట్టిలో కలిసిపోతున్నాయి. మన్యం రైతన్నకు అంతో ఇంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టిన కుసుమాలు తమను మమకారంతో సాకిన కర్షకుడి కష్టాన్ని చూసి కన్నీరు పెడుతున్నాయి. వ్యాపారుల స్వార్థం కారణంగా కనీసం ఐదు రూపాయలైనా తెచ్చి పెట్టలేని తమ నిస్సహాయతను గుర్తు చేసుకుని బంతి పూలు బావురుమంటున్నాయి.
 
పాడేరు, న్యూస్‌లైన్: కుంకుమ రాశుల్లా, ప్రభాత కాంతుల అందాలకు ప్రతిరూపాల్లా తోటల్లో విరబూసిన పూలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. రోడ్డు పక్క రెక్కలు తెగి, ధూళి రాశుల్లా దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు రైతన్నకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయాన్ని సమకూర్చిన బంతిపూలు ఇప్పుడు మట్టిపాలై ఉసూరంటున్నాయి. కొనేవారు లేక గిరిజన రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. మన్యంలో శీతాకాలంలో బండిపూలు రాశులుగా విరబూస్తాయన్నది తెలిసిందే. పూలకు గిరాకీ ఉండడంతో రైతులు వాటిని పెద్ద ఎత్తున సాగు చేస్తారు.

పాడేరులో మైదాన ప్రాంత వ్యాపారులకు నిత్యం విక్రయిస్తారు. సోమవారం తెల్లవారుజామున కూడా వారు పాత బస్టాండ్‌లోని పూల మార్కెట్‌కు గిరిజన రైతులు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. వేకువనే లేచి, చలికి ఓర్చి, బస్సులు, ఆటోల ద్వారా బంతి పూలతో ఇక్కడికి చేరుకున్న రైతులు వ్యాపారుల కోసం ఎదురు చూశారు. నిన్నటి వరకు బుట్ట పూలు రూ.50 నుంచి రూ.70 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు సోమవారం మాట మార్చారు.
 
అంత ధర చెల్లించలేమని చెప్పేశారు. దాంతో రైతులంతా తల్లడిల్లారు. మైదాన ప్రాంతాల్లో బంతి పూలకు ధర లేదని, అక్కడ కిలో రూ.5కు మించి కొనుగోలు చేయడంలేదని వ్యాపారులు చెప్పారు. తమకు రవాణా ఖర్చులైనా రాకపోతే కష్టమని రైతులు పట్టుబట్టారు. కానీ వ్యాపారులు ఇసుమంతైనా కరగలేదు. సమయం మించిపోతూ ఉండడంతో ఎంతకైనా కొనుగోలు చేయాలని రైతులు ప్రాధేయ పడ్డారు. దీంతో కొందరు వ్యాపారులు బుట్ట పూలను రూ.5కు కొనుగోలు చేశారు.

అయినా ఎక్కువ పూలు మిగిలిపోవడంతో మరో దారిలేక రైతులంతా పూలను రైతు బజార్, పాతబస్టాండ్, ఎన్జీవో భవన్ సమీపంలో రోడ్డుపై పారబోశారు. తిరిగి వెళ్లేందుకు బస్సు, ఆటో చార్జీలు కూడా లేక ఆకలితో కాలినడకనే వెనక్కు వెళ్లారు. పలువురు గిరిజన మహిళలు పూలను పారబోస్తూ కన్నీళ్లుపెట్టుకున్నారు. ఎంతో కష్టపడి పండించి, ఓ రోజంతా తోటల నుంచి పూలను కోసి, ఎముకలు కొరికే చలిలో తెల్లవారు జామునే మార్కెట్‌కు తీసుకువస్తే ఇలా అయిందని ఉసూరన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement