Baahubali: The conclusion
-
ఎన్నేసి ఫెస్టివల్లో బాహుబలి: ద ఎటర్నల్ వార్
‘బాహుబలి: ది బిగినింగ్’ (2015), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (2017) చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా దక్కిన ఆదరణ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో 2025 అక్టోబరు 31న రిలీజ్ చేశారు. తాజాగా ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి రానున్న సరికొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’. ఈ మూవీకి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇషాన్ శుక్లా దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఈ చిత్రం ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఎన్నేసి యానిమేషన్ ఫెస్టివల్ 2026’లోని ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు రాజమౌళి. ‘‘ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యానిమేషన్ వేదికపై ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’ని ప్రదర్శించే అవకాశం రావడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇది మన భారతీయ సినిమాకి దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
ముందే బాహుబలి-2 చూడనున్న బ్రిటన్‌రాణి!
హైదరాబాద్: విడుదలకు ముందే బాహుబలి-2 గొప్ప ఖ్యాతిని దక్కించుకోనుంది. ఈ చిత్రాన్ని బ్రిటన్ రాణి ఎలిజెబెత్ వీక్షించనున్నారు. అది కూడా మనందరికంటే ముందుగా.. ఆ చిత్ర యూనిట్ ప్లాన్ చేసిన విడుదల తేది ఏప్రిల్ 28కంటే ఒక రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 27నే ఆమె ఈ సినిమాను చూసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో బ్రిటన్-భారత్‌ల మధ్య కొన్ని కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగాంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ భారతీయ చిత్రాలను ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రదర్శించనుంది. అందులో బాహుబలి: ది కన్‌క్లూజన్ కూడా చేర్చారట. వాస్తవానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కానుంది. అయితే, ఏప్రిల్ 27నే ఈ చిత్రాన్ని ప్రీమియర్ షోగా అక్కడ ప్రదర్శించనున్నారంట. ఆ రోజు ఈ చిత్రాన్ని బ్రిటన్ రాణి ఎలిజెబెత్తోపాటు ప్రధాని నరేంద్రమోదీ కూడా వీక్షిస్తారని ఓ మీడియా వర్గాల సమాచారం. అయితే, చిత్ర నిర్మాణ వ్యక్తులు, సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ వార్తను ఖండించడంగానీ, అంగీకరించడంగానీ జరగలేదు. చిత్ర విడుదలకు ముందే దాదాపు రూ.500 కోట్ల బిజినెస్‌ను బాహుబలి-2చేసినట్లు చిత్ర వర్గాల అంచనా. తొలి పార్ట్ కంటే గొప్పగా ఈ చిత్రం ఉండబోతుందని ఇప్పటికే టాలీవుడ్లో విస్తృత ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. -
యుద్ధం ఎవరు చేస్తున్నారు?
హిమాలయాలను తలపించే ఎల్తైన పర్వతాలు ఓ పక్క... సమయం చూసి సమరానికి దిగిన శత్రువులు మరోపక్క... ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘బాహుబలి’ వీరోచితంగా యుద్ధం చేస్తున్నాడు. ఈ వారం రోజులూ యుద్ధం చేయక తప్పదు. ఎందుకంటే... ఈ వారంలో ఎట్టకేలకు షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేస్తారట! ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా తదితరుల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’. ‘బాహుబలి’కి సెకండ్ పార్ట్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీస్తున్న వార్ సీక్వెన్స్‌లో తండ్రి అమరేంద్ర బాహుబలి యుద్ధం చేస్తున్నాడా? కుమారుడు మహేంద్ర బాహుబలి చేస్తున్నాడా అనేది రాజమౌళి చెబితేనే తెలుస్తుంది. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ క్వారీలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రభాస్ తదితర పాత్రధారులతో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ వారంతో చిత్రీకరణ అంతా పూర్తవుతుందని సమాచారం. అంటే, మూడేళ్లుగా ‘బాహుబలి’ పాత్రకు అంకితమైన ప్రభాస్ ఇక ఫ్రీ కానున్నారు. ఆల్రెడీ ‘బాహుబలి–2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఎప్పుడో ప్రారంభమయ్యాయి. ఈ ఏప్రిల్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


