breaking news
Auto LPG
-
నేటి నుంచి హైదరాబాద్ ఆటో గ్యాస్ కంపెనీ ఐపీవో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆటో ఎల్పీజీ రిటైల్ సంస్థ యాక్సియం గ్యాస్ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ నేడు (శుక్రవారం) ప్రారంభమై సెప్టెంబర్ 22న ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ. 50.75 కోట్లు సమీకరిస్తోంది. షేరు ధర రూ. 54గా నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం నాడు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ. 5.77 కోట్లను కంపెనీ సమీకరించింది.ఐపీవో ద్వారా సేకరించే నిధులను రుణాల చెల్లింపు, ఎల్పీజీ స్టోరేజీ, బాట్లింగ్ ప్లాంట్ల నిర్మాణం, ఆటోమేషన్ మొదలైన అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. మరోవైపు, సెప్టెంబర్ 24న ఎ–వన్ స్టీల్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుంది. దీని ద్వారా కంపెనీ దాదాపు రూ. 355 కోట్లు సమీకరించనుంది. షేరు ధర శ్రేణి రూ. 385–405గా ఉంటుందని సంస్థ తెలిపింది. -
ఇంధన భద్రతలో ఆటో ఎల్పీజీ కీలకపాత్ర
న్యూఢిల్లీ: ఓవైపు అంతర్జాతీయంగా సహజ వాయువు ధరలు పెరుగుతుండగా, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా వ్యవస్థ సమస్యలు వెన్నాడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇంధన భద్రతను సాధించడంలో ఆటో ఎల్పీజీ కీలక పాత్ర పోషించగలదని పరిశ్రమ సమాఖ్య ఐఏసీ తెలిపింది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ తర్వాత రవాణా కోసం అత్యధికంగా ఉపయోగించే ఇంధనాల్లో ఆటో ఎల్పీజీ మూడో స్థానంలో ఉందని వివరించింది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అవకాశాలు చాలా తక్కువని ఐఏసీ పేర్కొంది. కరోనా కారణంగా అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండటం, ఇంధన ఎగుమతిలో కీలకంగా ఉంటున్న ఒక దేశం పూర్తి స్థాయి యుద్ధంలో నిమగ్నమై ఉండటం తదితర అంశాల కారణంగా ఇంధన భద్రత సాధించడం మరింత కీలకంగా మారిందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా ఆటో ఎల్పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలా కాకుండా వాటికి తగినంత గుర్తింపునివ్వకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయశ్ గుప్తా వ్యాఖ్యానించారు. విద్యుత్‌తో పోలిస్తే ఉత్పత్తి దశ నుంచి వినియోగం వరకూ ఎల్పీజీ వల్ల వచ్చే ఉద్గారాలు చాలా తక్కువని ఆయన చెప్పారు. -
ఆటో ఎల్పీజీ విక్రయాలు జూమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటో ఎల్పీజీ విక్రయాలు దేశవ్యాప్తంగా అక్టోబరు–డిసెంబరులో రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయని ఇండియన్ ఆటో ఎల్పీజీ కోలిషన్ (ఐఏసీ) తెలిపింది. విక్రయాలు జాతీయ స్థాయిలో 16 శాతం, తెలంగాణలో 25 శాతం వృద్ధి నమోదయ్యాయని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయాష్ గుప్తా చెప్పారు. ఇంధనం ధర తగ్గడమే ఇందుకు కారణమని అన్నారు. ‘ఆటో ఎల్పీజీ పర్యావరణానికి హాని చేయని శుద్ధ ఇంధనం. పెట్రోలుతో పోలిస్తే ధర 50 శాతం తక్కువ. ఫ్యూయెల్ ట్యాంకు కారులో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. సీఎన్జీ కంటే తేలికైనవి. సీఎన్జీ కిట్ ధర రూ.30 వేలుంటే, ఆటో ఎల్పీజీ కిట్ ధర రూ.20 వేలే’ అని వివరించారు. 70 దేశాల్లో 2.6 కోట్ల వాహనాలు ఆటో ఎల్పీజీ ఇంధనంతో నడుస్తున్నాయని ఐఏసీ ప్రెసిడెంట్ వై.కె.గుప్తా తెలిపారు.


