‘అర్జున్ చక్రవర్తి' మూవీ రివ్యూ
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1980-96 మధ్యకాలంలో సాగుతుంది. అనాథ అయిన అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు)ని మాజీ మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య(దయానంద్ రెడ్డి) చేరదీస్తాడు. అర్జున్ తన మేనల్లుడు అని చెప్పుకుంటూ.. అతన్ని గొప్ప కబడ్డీ ప్లేయర్‌ని చేయాలని భావిస్తాడు. రంగయ్య స్పూర్తితో అర్జున్ కూడా కబడ్డీ నేర్చుకుంటాడు. జిల్లా స్థాయిలో ఆడుతున్న సమయంలో దేవకి(సిజా రోజ్)తో ప్రేమలో పడతాడు. ఓ కీలక మ్యాచ్ కోసం దేవకిని దూరం పెడతాడు. దేశం తరపున ఆడి బంగారు పతకం సైతం సాధిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ కారణంతో అతను కబడ్డీ ఆటను దూరం పెట్టి తాగుడుకు బానిసవుతాడు. కబడ్డీనే ప్రాణంగా భావించే అర్జున్.. ఆ ఆటను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? కోచ్ కులకర్ణి (అజయ్) రాకతో అర్జున్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? తన మాదిరే గ్రామీణ యువతను కబడ్డీ ఆటగాళ్లుగా తీర్చి దిద్దాలనే అర్జున్ లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఒక కబడ్డీ క్రీడాకారుడి జీవిత కథతో తెరకెక్కిన సినిమా ఇది. అనాథ అయిన ఒక కుర్రాడు.. కబడ్డీ ఆటలో గొప్ప పేరు సంపాదించా..తనలాంటి చాంపియన్లను తయారు చేయడానికి అకాడమీ నెలకొల్పాలనుకుంటాడు.కానీ అతని ప్రయత్నం ఫలించదు. ఇక తన జీవితమే ముగిసిపోయిందనుకున్న దశలో తిరిగి ఆటలోకి వచ్చి మళ్లీ ఛాంపియన్‌గా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమా కథ. మన తెలుగులో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. జెర్సీ తరహాలో ఈ కథ కూడా చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే ఆటకు సంబంధించిన సన్నివేశాలు మాత్రం ఉత్కంఠ భరితంగా రాసుకున్నా.. తెరపై మాత్రం అది అనుకున్నంతగా పండించలేకపోయారు. కొన్ని చోట్ల సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో రివర్స్ స్క్రీన్‌ప్లేతో అర్జున్ కథ, జిల్లా, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఎలా గెలిచాడు? దేవకితో ప్రేమాయణం చుట్టూ తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రభుత్వ అధికారి అర్జున్‌కి చేసిన అన్యాయం తెరపై చూస్తుంటే బాధతో పాటు కన్నీళ్లు కూడా వస్తాయి. అయితే రంగయ్య-అర్జున్ మధ్య వచ్చే సీన్లు ఎమోషనల్‌గా ఉన్నప్పటికీ..కాస్త సాగదీతగా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో హీరో మళ్లీ ఆట కోసం సిద్ధం అవ్వడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఎవరెలా చేశారంటే..అర్జున్ చక్రవర్తి పాత్రకి విజయ రామరాజు వందశాతం న్యాయం చేశాడు. ఈ పాత్ర కోసం ఆయన పడిన కష్టం అంతా తెరపై కనిపించింది. లుక్‌ని మార్చుకోవడమే కాదు.. నటన పరంగానూ మెప్పించాడు. ఇక రంగయ్యగా దయానంద్ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సిజా రోజ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. అజయ్ కోచ్ పాత్రలో పర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విఘ్నేష్ బాస్కరన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు అదనపు బలం. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్, విజువల్స్ 80,90 ల కాలానికి తగ్గట్టు బాగానే చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్ 2.75/5