మరో వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా బోలెడన్ని సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. అలా భద్రకాళి, కిష్కింధపురి, ఓజీ, మిరాజ్ లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఈ శుక్రవారం (అక్టోబర్ 24) పలు తెలుగు చిత్రాలు సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ ఆ కొత్త మూవీస్ ఏంటి? ఎందులో చూడొచ్చు?
కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే జానర్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ చక్రవర్తి'. ఆగస్టు 29న థియేటర్లలో ఈ చిత్రం రిలీజైంది. డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ స్టార్స్ ఎవరూ లేకపోవడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. అలా వచ్చిన రెండు మూడు రోజులకే బిగ్ స్క్రీన్ పై నుంచి కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాకు విక్రాంత్ రుద్ర దర్శకుడు కాగా విజయ్ రామరాజు, షిజా రోజ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'గ్యాంబ్లర్స్'. ఈ ఏడాది జూన్ తొలివారం థియేటర్లలోకి వచ్చింది. స్టోరీ పరంగా మరీ తీసికట్టుగా ఉండేసరికి ప్రేక్షకులు దీన్ని తిరస్కరించేశారు. ఆగస్టులో ఇది సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాగా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. రెండింటిలోనూ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
దివంగత నటుడు శ్రీహరి ఫ్యామిలీ నుంచి ఇదివరకే ఆయన కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఒకటి రెండు సినిమాలు చేశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు శ్రీహరి మేనల్లుడు ధనుష్ కూడా టాలీవుడ్‌లోకి పరిచయమయ్యాడు. 'థ్యాంక్యూ డియర్' పేరుతో మూవీ తీశాడు. ఆగస్టు 01న ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియనంతలా మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. తోట శ్రీకాంత్ కుమార్ దర్శకుడు కాగా ధనుష్ సరసన హెబ్బా పటేల్ నటించింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా)


