breaking news
antacids
-
విందుల హోరు..యాంటాసిడ్స్ జోరు!
ఆరోగ్య సమస్య తలెత్తగానే ఆసుపత్రికో, మందుల షాపుకో పరుగు తీస్తుంటారు చాలా మంది. కోవిడ్–19 మహమ్మారి నేరి్పన పాఠాలతో జనంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. సమస్య రాక ముందే భారతీయులు ముందస్తు నివారణకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే నచ్చిన వంటకాలను ఆరగించడంలో ఏమాత్రం ఆలోచించడం లేదు. అందుకే కాబోలు శని, ఆదివారం వచ్చిందంటే చాలు యాంటాసిడ్స్ కోసం కస్టమర్లు పరుగులు తీస్తున్నారు. హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ ఫార్మ్ఈజీ తన వేదిక ద్వారా ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల అమ్మకాలు, రోగ నిర్ధారణ పరీక్షల బుకింగ్స్‌ను విశ్లేషించి హెల్త్ రిపోర్ట్–2025 రూపొందించింది. విటమిన్స్, సప్లిమెంట్స్ కొనుగోళ్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, దీర్ఘకాలిక, తీవ్ర అనారోగ్య సమస్యల పరిష్కారానికి చికిత్సలు.. కాలానుగుణంగా లేదా సంక్షోభం తలెత్తినప్పుడే కాకుండా ప్రణాళికాబద్ధంగా, ఏడాది పొడవునా అలవాట్లుగా ఉద్భవిస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ మెట్రోలకే పరిమితం కాలేదని.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ వ్యాపించిందని వివరించింది. - సాక్షి, స్పెషల్ డెస్క్పోషకాహార లోపాలకు చెక్.. మొదటిసారిగా విటమిన్స్, సప్లిమెంట్స్ అత్యధిక ఆర్డర్లు నమోదైన కేటగిరీగా మారాయని నివేదిక తెలిపింది. పోషకాహార లోపాలకు చెక్ పెట్టడంలో భాగంగా మల్టీ విటమిన్స్‌కు కస్టమర్లు జై కొట్టారు. విటమిన్–బి సప్లిమెంట్లు టాప్‌లో నిలిచాయి. ఏడాదిలో వీటి విక్రయాలు 33% పెరిగాయి. కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్–డి తరువాతి స్థానాల్లో నిలిచాయి. పోషకాహార లోపాలు, ఎముకలు, కీళ్ల ఆరోగ్యం గురించి జనంలో అవగాహన పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. ముందస్తుగా తెలుసుకోవడానికి.. రోగ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా అత్యధికులు విటమిన్–డి పరీక్షలు చేయించుకున్నారు. థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకునే టెస్టులు, రక్తంలో చక్కెర స్థాయిని కొలిచే హెచ్‌బీఏ1సీ పరీక్షలు టాప్–3లో నిలిచాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయిస్తున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడే కాకుండా.. మొత్తం ఆరోగ్యాన్ని వివరంగా చూపే కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సీబీసీ), కొవ్వు స్థాయిని తెలిపే లిపిడ్ ప్రొఫైల్స్ టెస్టులు క్రమంగా సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగమయ్యాయి. ఎప్పుడేం కొంటున్నారంటే..ఉదయం 6–9 మధ్య: విటమిన్స్, కాల్షియం, దీర్ఘకాలిక రోగాలకు మందులు. రాత్రి 10 నుంచి ఉదయం 4 వరకు: రక్తపోటు, హృదయ సంబంధ ఔషధాలు, విటమిన్–సి, కాల్షియం సప్లిమెంట్స్. వారాంతాల్లో: యాంటాసిడ్స్, స్కిన్ కేర్, సన్ కేర్, ఎనర్జీ డ్రింక్స్, ఓవర్ ద కౌంటర్‌కు మారిన కొత్త మందులు, స్పోర్ట్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, మొక్కలతో తయారైన ఉత్పత్తులు, గ్లూకోజ్, బీపీని చెక్ చేసే డిజిటల్ మెషీన్స్. ఆదివారాల్లో: నచ్చిన వంటకాలతో ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేసే రోజు. బంధువులు, స్నేహితులు తోడైతే ఇక విందు భోజనమే. అందుకే కాబోలు యాంటాసిడ్స్ కొనుగోళ్లు 14–18% పెరిగాయి. కాలాన్నిబట్టి కొనుగోళ్లు.. వర్షాకాలం: జ్వరం సంబంధ టెస్టులు, ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఫంగల్ క్రీమ్స్, దోమల నివారణ ఉత్పత్తులు. శీతాకాలం: జలుబు, దగ్గు మందులు, విటమిన్–సి, మాయిశ్చరైజర్స్. వేసవి: సన్‌్రస్కీన్స్, ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్.నివేదిక హైలైట్స్.. » 2025లో ఫార్మ్ఈజీ అమ్మకాల్లో 71% సోమ–శుక్రవారం మధ్య నమోదయ్యాయి. » కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబైలో మాస్క్‌లు, నెబ్యులైజర్స్, ఇన్హేలర్స్, ఆక్సిమీటర్స్ కొనుగోళ్లు ఎక్కువ. » ప్రతి రెండో కుటుంబం సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా జీర్ణ సంబంధ ఉత్పత్తిని కొనుగోలు చేసింది. » మధుమేహ (జీఎల్పీ–1) మందులు వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. ప్రతి నెల సేల్స్ 12% దూసుకెళ్తున్నాయి. » డయాబెటిస్ ఔషధాలు కొంటున్నవారిలో సగం మంది 25–45 ఏళ్ల మధ్య వయస్కులు. -
సీపీఆర్ చేస్తే బతికేవారేమో
కోల్‌కతా/ముంబై: గుండెపోటుతో మరణించిన ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే)కు సకాలంలో సీపీఆర్ చేసుంటే ప్రాణాలు నిలిచేవని కోల్‌కతా వైద్యులు అభిప్రాయపడ్డారు. ‘‘ఆయన గుండెలో ఎడమవైపు ధమనిలో 80 శాతం బ్లాకేజీ ఉంది. మిగతా ధమనులు, రక్తనాళాల్లోనూ చిన్నచిన్న బ్లాక్‌లున్నాయి. చాలా రోజులుగా ఈ సమస్య ఉన్నట్టుంది. దీనికి తోడు లైవ్ షోలో ఉద్విగ్నంగా గడపటంతో గుండెకు రక్తం సరిగా అందక మరణానికి దారితీసింది. స్పృహ కోల్పోగానే సీపీఆర్ చేసుంటే బతికేవారు’’ అని ఒక వైద్యుడు పీటీఐకి చెప్పారు. కేకే యాంటాసిడ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకున్నట్టు పోస్టుమార్టంలో తేలింది. గుండెనొప్పిని అజీర్తిగా భావించి వాటిని వాడి ఉంటారని వైద్యులు చెప్పారు. కోల్‌కతా నుంచి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఛాతిలో నొప్పిగా ఉందని, చేతులూ భుజాలూ లాగుతున్నాయని చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అభిమానుల కన్నీటి నడుమ కేకే అంత్యక్రియలు ముంబై వెర్సొవా హిందు శ్మశానవాటికలో గురువారం జరిగాయి. కుమారుడు నకుల్ అంతిమ సంస్కారం నిర్వహించారు. శ్రేయఘోషల్, అల్కాయాజ్ఞిక్, హరిహరన్, సలీమ్ మర్చంట్ వంటి సింగర్లు నివాళులర్పించారు. -
ఆ మాత్రలతో క్యాన్సర్ ముప్పు
లండన్ : గ్యాస్, అజీర్తి సమస్యలతో నిత్యం యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వాడితే పెనుముప్పు తప్పదని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఏడాది పాటు రోజూ ఈ మాత్రలను వాడితే పొత్తికడుపు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఐదు రెట్లు పెరుగుతాయని, మూడేళ్లు వాడితే క్యాన్సర్ ముప్పు ఎనిమిది రెట్లు పెరుగుతుందని తేలింది. క్యాన్సర్ కణాలను పెంచే గ్యాస్ర్టిన్ హార్మోన్ కారణంగా ఈ రిస్క్ పొంచిఉందని యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతంలోనూ యాంటాసిడ్స్ తరచూ తీసుకుంటే గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు, డిమెన్షియా వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని కొన్ని అథ్యయనాలు వెల్లడించాయి. హాంకాంగ్‌లో 63,000 మందిపై తాజా అథ్యయనం నిర్వహించారు. ఏడేళ్ల పాటు వీరిని గమనించగా వారానికి ఒకసారి యాంటాసిడ్ మాత్రలను తీసుకున్న వారిలో పొత్తికడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. వీటిని రోజూ వాడేవారిలో క్యాన్సర్ ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. దీర్ఘకాలం వీటిని వాడటం మంచిది కాదని, వైద్యులు సైతం దీనిపై రోగులను అప్రమత్తం చేయాలని పరిశోధకులు సూచించారు. -
యాంటాసిడ్స్ ఎక్కువైతే గుండెకు చేటు..
కాస్త అజీర్తి చేసినా, కడుపు ఉబ్బరంగానూ, ఛాతీలో మంటగానూ అనిపించినా వెంటనే యాంటాసిడ్లు వాడటం చాలామందికి అలవాటే. కొందరైతే దాదాపు ప్రతిరోజూ యాంటాసిడ్లు వాడుతుంటారు. అయితే, ఇలా ఎడాపెడా యాంటాసిడ్లను వాడటం ఏమాత్రం క్షేమం కాదని, తరచు యాంటాసిడ్లు వాడేవారు గుండెజబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమెరికన్ వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యాంటాసిడ్లను తరచూ వాడని వారితో పోలిస్తే కాస్త ఎక్కువగా యాంటాసిడ్లు వాడేవారికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు 16-21 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని స్టాన్ఫోర్డ్ వర్సిటీ పరిశోధకుడు నిగమ్ హెచ్ షా హెచ్చరిస్తున్నారు. హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ సహకారంతో నిగమ్ హెచ్ షా నేతృత్వంలో స్టాన్ఫోర్డ్ వర్సిటీ పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో తరచు యాంటాసిడ్ల వాడకం వల్ల గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధన సారాంశాన్ని పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ జర్నల్ ఇటీవల ప్రచురించింది.


