చంద్రబాబు.. కాలం చెల్లిన నేత
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కాలం చెల్లిందని, ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కే పరిస్థితీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, అనంతపురం ఎంపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. డీసీఎంఎస్ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించడానికి శనివారం నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కొనసాగిందన్నారు. అన్ని జిల్లాల్లోనూ మెజార్టీ స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకోనున్నారని చెప్పారు.
చంద్రబాబు చెప్పిన కల్లబొల్లి కబుర్లను జనం పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన చంద్రబాబు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని రాష్ట్ర ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో జనాన్ని మభ్యపెట్టాలన్న పాచిక పారకపోవడంతో కుదేలయ్యారని విమర్శించారు. రాష్ట్రం లో 120 నుంచి 140 అసెంబ్లీ స్థానాలు, 25 లోకసభ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుందని ఆయన జోస్యం చెప్పారు.
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటా లబ్ధి చేకూర్చాయన్నారు. అందు లో భాగంగానే ఆయన రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో నిర్ణయిం చారని తెలిపారు. వైఎస్ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచిన ప్రతిష్టాత్మక పథకా లు అమలు చేయగల సత్తా వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్నదని జనం బలంగా నమ్మి ఓట్లు వేశారని విశ్లేషించారు. 2004 ఎన్నికల్లో మాదిరిగా చంద్రబాబునాయుడు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. సీమాంధ్ర సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ జగన్ నేతృత్వంలో కృషి చేస్తామని పేర్కొన్నారు.