Ali Zafar
-
పాక్ ‘నటన’కు షాక్, నిషేధానికి గురైన నటీనటులెవరంటే,..
కళలకు హద్దుల్లేవు అంటారు. కానీ సహనానికి మాత్రం ఓ హద్దు ఉంటుంది కదా. ఓ వైపు మన దేశ వాసుల ప్రాణాలను తీస్తూ మరోవైపు అదే ప్రజల కష్టార్జితంతో తమ కళాకారులకు ప్రాణాలను పోయాలనే దుర్భుధ్దులున్న చోట... కళలకు హద్దులు ఉండాల్సిందే. అందుకే పాకిస్తానీ కళాకారులు ఇప్పుడు నిషేధాన్ని ఎదుర్కుంటున్నారు. తమ దేశం విచక్షణ మరచి ఏళ్లుగా తీవ్రవాదమూకలకు అడ్డాగా మారిన వైనానికి తమను ప్రేమతో ఆదరించిన సమాజం ముందు సిగ్గుతో తలదించుకుంటున్నారు. వాస్తవానికి ఇంకా ముందే.. అంటే గత 2016లో ఉరిలో భారత ఆర్మీపై పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉగ్ర దాడి తర్వాత, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పాకిస్తానీ కళాకారులను భారత్ విడిచిపెట్టి వెళ్ళాలని డిమాండ్ చేసింది. అప్పటి నుంచీ పాకిస్తానీ నటులు భారతీయ చిత్రాల్లో పాల్గొనడం తగ్గినా మళ్లీ ఇటీవలే కొంచెం పుంజుకుంది. అయితే దేశాన్ని తీవ్రమైన ఆవేదనకు, అదే సమయంలో తీవ్రాగ్రహావేశాలకు గురిచేసిన తాజా తీవ్రవాద దాడి నేపథ్యంలో, భారతదేశంలో పాకిస్తానీ నటులపై ఈ సారి ఏకంగా అధికారిక నిషేధం విధించారు. ఈ నిషేధం ఇప్పట్లో ఎత్తేసే పరిస్థితి కనిపించడం లేదు. భవిష్యత్తులో మళ్లీ పాక్ నటులు మన సినిమాల్లో కనిపిస్తారో లేదో... తెలీదు. ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా బాలీవుడ్లో పనిచేసిన పాకిస్తానీ నటుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే... ఫవాద్ ఖాన్ అనే పాకిస్తానీ నటుడు ’ఖూబ్ సూరత్’, ’కపూర్ అండ్ సన్స్, ’ఏ దిల్ హై ముష్కిల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. అలాగే అత్యంత పాప్యులర్ పాకిస్తానీ నటి మహీరా ఖాన్ ’రైస్’ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. ’తేరే బిన్ లాడెన్’, ’మేర్ బ్రదర్ కి దుల్హన్’, ’చష్మే బద్దూర్’, ’డియర్ జిందగీ’ వంటి చిత్రాల్లో నటించిన అలీ జఫర్ కూడా పాకిస్తానీయుడే. ’హిందీ మీడియం’ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ సరసన మరో పాకిస్తానీ..సబా ఖామర్ నటించింది. ’క్రియేచర్ 3ఇ’చిత్రంలో ఇమ్రాన్ అబ్బాస్ అనే పాకిస్తానీ నటుడు నటించాడు. ’సనం తేరీ కసమ్’ చిత్రంలో మరో పాకిస్తానీ నటుడు మావ్రా హోకేన్ కనిపించగా, ’మామ్’ చిత్రంలో శ్రీదేవి సరసన సజల్ అలీ నటించాడు. అంతేకాకుండా కొందరు పంజాబీ చిత్రాల్లో కూడా నటించారు. అలా భారతీయ పంజాబీ చిత్రాల్లో పనిచేసిన పాకిస్తానీ నటుల్లో ఇమ్రాన్ అబ్బాస్ ఉన్నాడు. ఆయన ’జీవే సోనేయా జీవే’ చిత్రంలో నటించాడు. ’లక్ లాగ్ గయి’ అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న ఫిరోజ్ ఖాన్ కూడా పాకిస్తానీయే. ‘బేబే భంగ్రా పౌండే నె’ చిత్రంలో సోహైల్ అహ్మద్ నటించాడు. నసీం వికీ – ’మా దా లడ్లా’ చిత్రంలో కనిపిస్తాడు. ఏదేమైనా వీరందరూ కోట్లాది మంది ఆదరాభిమానాలకు, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న భారతీయ సినిమాలో అవకాశాలకు దూరమయ్యారు. హద్దులెరుగని ప్రేమతో ఆదరించిన భారతీయ ప్రేక్షకులను బలితీసుకునే తమ దేశపు నీచబుద్ధికి వీరు నిరసన తెలపాల్సిన అవసరం కనీస మానవ ధర్మం. -
ఆ నటిపై రూ 100 కోట్ల పరువునష్టం దావా
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ నటి, గాయని మిసా షఫీపై గాయకుడు అలీ జఫర్ రూ 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అలీ జఫర్ తనను లైంగికంగా వేధించాడని గతంలో మిష ఆరోపించడంపై అలీ జఫర్ లాహోర్ జిల్లా కోర్టులో కేసు వేశారు. తన ప్రతిష్టను మిసా ఆరోపణలు తీవ్రంగా దెబ్బతీశాయని, తన గుడ్‌విల్‌ను మసకబార్చేలా ఉండటంతో పాటు జీవనోపాధిని దెబ్బతీసేలా ఆమె ఆరోపణలు చేశారని అలీ ఆమెకు పంపిన నోటీసులో పేర్కొన్నారు. తనను మానసికంగా వేధించినందుకు రూ 2 కోట్లు, కాంటాక్టులు కోల్పోయినందుకు రూ 8 కోట్లు, ప్రతిష్ట దెబ్బతీసినందుకు రూ 50 కోట్లు, వ్యాపార అవకాశాలు నష్టపోయినందుకు రూ 40 కోట్ల చొప్పున చెల్లించాలని నోటీసులో అలీ కోరారు. అలీ రెండు సందర్భాల్లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మీసా ఓ ఇంటర్వ్యూలో ఆరోపించిన సంగతి తెలిసిందే. తొలిసారి అలీ తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన సందర్భంలో తాను ఆ విషయం తేలిగ్గా తీసుకున్నానని, తామిద్దరం సెలబ్రిటీలు కావడంతో అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని తన భర్తకు సూచించానని చెప్పారు. మరో సందర్భంలోనూ అలీ ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు. అయితే మీసా ఆరోపణలను అలీ తోసిపుచ్చారు. న్యాయస్ధానాల్లోనే ఆమెతో తేల్చుకుంటానని మీసాపై ప్రత్యారోపణలు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. -
వీడియో లీకైంది.. నిజం నిగ్గుతేలింది
ఇస్లామాబాద్ ; నటుడు, సింగర్ అలీ జఫర్‌పై లైంగిక ఆరోపణల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సింగర్ కమ్ నటి మీషా షఫీ.. అలీ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ, అందులో అలాంటిదేం జరగకపోవటం విశేషం. అలీ తనతో రెండుసార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడని.. ఒకసారైతే ఏకంగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అందరి ముందే తనపై చేతులు వేశాడని ఆమె ఆరోపించింది. గ్రూప్ సభ్యులంతా చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ అడ్డుకోలేదని తెలిపింది. అయితే ఆమె చెప్పిన ప్రాక్టీస్ సెషన్స్ తాలుకూ వీడియోను ఎవరో ఇంటర్నెట్లో విడుదల చేశారు. జామ్ రూమ్‌లో వారిద్దరూ బృందంతో ప్రాక్టీస్ చేసిన వీడియో. ‘ఇది అలీ నిర్దోషిత్వాన్ని నిరూపించే సాక్ష్యం’ అంటూ ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. మేమూ ట్రూప్ సభ్యులమేగా... ఇక అలీపై మీషా చేసిన ఆరోపణలపై అలీ బృందంలోని సభ్యులు స్పందించారు. మేమూ ట్రూప్‌లో ఐదేళ్లుగా పని చేస్తున్నామని.. కానీ, అలీ ఏనాడూ తమతో అసభ్యంగా ప్రవర్తించలేదని ఇద్దరూ మహిళలు వెల్లడించారు. డబ్బు, పాపులారిటీ కోసమే మీషా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వారంటున్నారు. మరోపక్క పాక్ సినీ పరిశ్రమ అలీకి పెద్ద ఎత్తున్న మద్ధతు ఇస్తుండగా.. సింగర్స్ అసోషియేషన్ మాత్రం మీషా వైపు నిలిచింది. మీషా ఆరోపణలపై అలీ ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించాడు కూడా. -
లైంగిక వేధింపులు: నటికి గాయకుడి లీగల్ నోటీసులు
లాహోర్ : పాకిస్థానీ నటి మిషా షఫీ.. గాయకుడు, నటుడు ఆలీ జఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం పాక్‌లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఆమెపై ఇన్నాళ్లు విమర్శలు చేస్తూ వచ్చిన జాఫర్ తాజాగా ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు మిషా తనకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే రూపాయలు 100 మిలియన్ల (భారత కరెన్సీలో రూ. 6 కోట్ల) పరువునష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. తనకు వ్యతిరేకంగా మీషా చేసిన ట్వీట్లను తొలగించాలని, రెండు వారాల్లో తనకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆమెపై పోలీసు కేసు నమోదుచేస్తానని జాఫర్ హెచ్చరించినట్టు పాక్ మీడియా తెలిపింది. అయితే, జాఫర్ ఇచ్చిన నోటీసులు తన క్లయింట్‌కు అందలేదని మిషా లాయర్ తెలిపారు. పాక్‌లో ప్రసిద్ధ నటిగా, గాయనిగా సుపరిచితురాలైన మీషా తాను ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో వేధింపులు ఎదుర్కోలేదని, కానీ, నటిగా స్థిరపడి.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత వేధింపుల బారిన పడ్డానని తెలిపారు. గాయకుడు అలీ జాఫర్ తనను లైంగికంగా వేధించాడని, అతని వల్ల తాను ఎంతో క్షోభకు గురయ్యానని ఆమె వెల్లడించడం సంచలనం రేపింది. ఆమె వెల్లడించిన విషయాలు పాక్‌లో దుమారం రేపాయి. పలువురు బాధితులు ముందుకు వచ్చి.. తాము ఎదుర్కొన్న లైంగిక అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులు గురించి వెల్లడించారు. పలువురు మిషాకు అండగా నిలువగా.. ఇంకొందరు జాఫర్‌కు అండగా నిలిచారు. మరోవైపు తాను మిషాను లైంగికంగా వేధించలేదంటూ ఆమె ఆరోపణలను గాయకుడు జాఫర్ ఖండించారు. ఈ నేపథ్యంలోనే అతను మీషాకు లీగల్ నోటీసులు పంపాడు. -
ఆడాళ్లు పరువు హత్యలు మొదలుపెడితే...
ముంబై: వివాదస్పద మోడల్ కందిల్ బలోచ్ హత్యపై పాకిస్థాన్ కు చెందిన బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ స్పందించాడు. కందిల్ హత్యకు గురికావడం బాధ కలిగిచిందని వ్యాఖ్యానించాడు. పడుతులు పరువు హత్యలు చేయడం మొదలు పెడితే మగాళ్లలో చాలా మందికి మూడినట్టేనని అన్నాడు. 'తమ గౌరవాన్ని నిలుపుకునేందుకు మనల్ని మహిళలు మర్డర్లు చేయడం మొదలుపెడితే, మనలో చాలా మంది చావడం ఖాయమ'ని ట్వీట్ చేశాడు. అయితే పాకిస్థాన్ లో పరిస్థితులు అంత దారుణంగా లేవని చెప్పాడు. 'సినిమాల్లో రొమాంటిక్ పాత్రల్లో నటిస్తాను. అదే సమయంలో సమాజంలో జరుగుతున్న వాటి గురించి స్పందిస్తాను. నేను ఆశావాదిని. పాకిస్థాన్ లో అంతా చెడే జరగడం లేదు. పాక్ సినిమా పరిశ్రమ వృద్ధి చెందుతోంది. అక్కడ అద్భుత ప్రతిభ కలిగిన కళాకారులున్నారు. పాక్ యువత కూడా చాలా ప్రొయాక్టివ్ గా ఉంటున్నారు. ఇది శుభపరిణామ'ని అలీ జాఫర్ పేర్కొన్నాడు. If women started killing us to protect their honour, a lot of us would be dead! — Ali Zafar (@AliZafarsays) 16 July 2016 -
సినిమాలంటే భయం లేదు
సినిమాలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని, అయితే వాటికి భయపడేదాన్ని మాత్రం కాదని చెబుతోంది యామీ గౌతమ్. మొదటి సినిమా వికీ డోనర్ విజయం సాధించడంతో ఈ బ్యూటీకి అవకాశాలు బాగానే వస్తున్నా తొందరపడడం లేదు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ‘నా మనసు చెప్పింది చేయడమే నాకిష్టం. ఒక సినిమా భారీ హిట్ కాగానే తరువాతి వాటిని ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే నాకు సినిమా కుటుంబం లేదు. ముంబై యువతినీ కాదు కాబట్టి రెండో అవకాశం రావడం కాస్త కష్టమే. అయితే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అంతమాత్రాన నేను భయపడ్డట్టు కాదు’ అని యామీ వివరించింది. తాజా సినిమా టోటల్ సియప్పా తనకు మనసుకు నచ్చిన కథ అని తెలిపింది. ‘నాకు అవకాశాలు చాలా వచ్చాయి. వద్దనుకున్న సినిమాల గురించి మాట్లాడడం ఇష్టముండదు’ అని చెప్పింది. అయితే నీరజ్ పాండే నిర్మిస్తున్న టోటల్ సియప్పా ప్రాజెక్టుపై సంతకం చేయడానికి కూడా ఈమె చాలా సమయమే తీసుకుంది. ‘భిన్న నేపథ్యాలున్న కథ ఇది. హాస్యం, ఉద్వేగం, కోపం వంటి అంశాలూ ఉంటాయి. ఇందులో అవకాశం ఇచ్చిన నీరజ్ పాండేకు ఎంతో కృతజ్ఞురాలిని. సినిమా కథ గంభీరమైనదే అయినా ప్రేక్షకులు దీనిని పూర్తిగా ఆస్వాదించవచ్చు’ అని యామీ వివరించింది. టోటల్ సియప్పాకు నీరజ్ కథ కూడా అందించగా, ఈశ్వర్ నివాస్ దర్శకత్వం వహించాడు. దీనిని వచ్చే నెల ఏడున విడుదల చేస్తున్నారు. పాకిస్థానీ నటుడు, గాయకుడు అలీ జఫర్, యామీ, అనుపమ్ ఖేర్, ఆయన సతీమణి కిరణ్ ఖేర్ తదితరులు ఇందులో కనిపిస్తారు. వికీ డోనర్ తీసిన జాన్అబ్రహం, షూజిత్ సర్కార్ తాజాగా రూపొందించే సినిమాలోనూ అవకాశం దక్కిందంటూ వచ్చిన వార్తలను యామీ గౌతమ్ తోసిపుచ్చింది.