breaking news
ADDANKI constituency
-
క్రెడిట్ చోరీ కాదు.. క్రెడిట్ దోపిడీ: వైఎస్ జగన్
నియోజకవర్గాల పెంపు గుడ్ న్యూస్. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు హర్షణీయం. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సీట్లు గణనీయంగా పెరుగుతాయి. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు వల్ల కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుంది. ఉత్సాహం, పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం ఇస్తాం. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. వంట నూనె లీటరు రూ.40 పెరిగింది. పప్పులు కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఉచిత గ్యాస్‌కు దిక్కులేదు. మరోవైపు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బ్లాక్‌లో అమ్ముతున్నారు. సిలిండర్ రూ.2 వేలు, రూ.3 వేలకు అమ్ముతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఈ పెద్దమనిషి కిరోసిన్ ఇస్తానంటున్నాడు. లీటరు కిరోసిన్ ఇస్తాడంట. పండగ చేసుకోమంటున్నాడు. అసలు కిరోసిన్ స్టవ్‌లు ఎక్కడున్నాయి? చివరకు గుడ్ల ధర కూడా పడిపోయింది. మొక్కజొన్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.2,400 అయితే రూ.1,400కు కూడా అడిగే వాడు లేడు. కోకో, అరటి, శనగ, టమాటా.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల పరిస్థితి అగమ్యగోచరం. -వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: చంద్రబాబు క్రెడిట్ చోరీ కాకుండా, ఏకంగా క్రెడిట్ దోపిడీ చేస్తున్నారని.. ఆ దిశలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. నిజానికి 2022లో తన దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌ను కలిశానని, రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అప్పుడే దాదాపు అవగాహన కుదిరిందని చెప్పారు. తగిన భూమి ఇచ్చేందుకు కూడా అంగీకరించామని, అంతే కాకుండా అప్పుడే ఆ కంపెనీ కర్నూలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గ్రీన్కో ప్రాజెక్టులోనూ రూ.4,800 కోట్ల పెట్టుబడికి అవగాహన కుదుర్చుకుందని వెల్లడించారు. అలా తాము తెచ్చిన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తూ అంతా తన ఘనతేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎత్తి చూపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్ధల పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో మనం 151 సీట్లు గెల్చుకున్నా, అద్దంకిలో గెలవలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో మంత్రిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబుకన్నా ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఇప్పటి మంత్రిపై ఉందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో డాక్టర్ అశోక్‌కుమార్‌ను తీసుకొచ్చామని.. ఆయన మంచి డాక్టర్ అన్నారు. రాక్షస రాజ్యంలో ఉన్నాం కాబట్టి, చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుందని తెలిసినా, అశోక్ ముందుకొచ్చి, ఐదేళ్ల పోరాటానికి సిద్ధమయ్యారని.. కార్యకర్తలకు తోడుగా నిలబడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. కోటలు దాటుతున్న బాబు మాటలు⇒ ‘చంద్రబాబు పాలనంతా వైఫల్యం. కానీ, మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలుండవు. ఆయన చేస్తున్న దాన్ని క్రెడిట్ చోరీ కాకుండా క్రెడిట్ దోపిడీ అనాలేమో. చంద్రబాబు ఇటీవలి క్రెడిట్ దోపిడీ గురించి చెప్పాల్సి వస్తే.. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను తాను తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ.. ఆర్భాటంగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు క్రెడిట్ దోపిడీకి కనీసం హద్దు ఉండాలి. ఆదిత్య మిట్టల్‌ను 2022లో నేను దావోస్‌లో కలిశాను. అప్పట్లోనే ఇక్కడి గ్రీన్కో ప్రాజెక్టులో పెట్టుబడికి కూడా రెడీ అయ్యారు. రూ.4,800 కోట్ల పెట్టుబడితో ఆ ప్రాజెక్టులో వారు భాగస్వాములయ్యారు. కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌లో ఆ పెట్టుబడి పెట్టారు. ⇒ ఇంకా అప్పట్లోనే ఎస్సార్ స్టీల్‌ని వారు కొనుగోలు చేసి, రూ.1,000 కోట్ల పెట్టుబడితో విస్తరణకు రెడీ అయ్యారు. ఆ మేరకు అగ్రిమెంట్లు కూడా జరిగాయి. అవే కాకుండా, ఇక్కడ కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఆహ్వానించి, వారికి తగిన భూములు చూపాలని అధికారులను ఆదేశించాను. దాంతో అధికారులు కాకినాడ సెజ్‌లో, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపితే, వారికి నక్కపల్లి నచ్చింది. అక్కడ మనకు ఏపీఐఐసీ భూములుంటే, వాటిలో 2,200 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ఆలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. దాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తూ.. ఒక జూమ్ కాల్‌తో మిట్టల్ కంపెనీ వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ⇒ అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. విశాఖలో అదానీ డేటా సెంటర్ కూడా అంతే. అది మన హయాంలోనే వచ్చింది. అది కూడా తానే తెచ్చినట్లు చంద్రబాబు ప్రచారం. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం. అదే నక్కపల్లిలో 2023లో బల్క్ డ్రగ్ పార్కును 13 రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చాం. కేంద్రం రూ.1,000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కానీ, చంద్రబాబు వచ్చాక, ఆ బల్క్ డ్రగ్ పార్క్ పనులు జరగడం లేదు. అడుగులు ముందుకు పడడం లేదు. దాని వల్ల రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలూ వస్తాయి. అయినా భూముల పేరుతో వివాదాస్పదం చేశారు. దాంతో ఆ పనులు నిల్చిపోయాయి. అలా కొన్ని ప్రాజెక్టులు పని చేయడం లేదు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశానికి హాజరైన అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు పోర్టుల్లో పనుల నిలిపివేత⇒ నాడు మన ప్రభుత్వంలో మూడు పోర్టుల పనులు వేగంగా చేశాం. నిధుల సమీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. రామాయపట్నం పోర్టు దాదాపు 80 శాతం పూర్తి చేశాం. మూలపేట పోర్టు పనులు 30 శాతం పూర్తి చేశాం. మచిలీపట్నం పోర్టు 30 శాతం మన హయాంలోనే పూర్తి చేశాం. కానీ, ఈ మూడింటి పనులు ఆగిపోయాయి. ఎందుకంటే, జగన్‌కు పేరు రాకూడదని పనులు ఆపారు. ⇒ ఇప్పుడు ఆ చుట్టుపక్కల భూములను చంద్రబాబు తన వారితో కొనిపిస్తున్నాడు. అప్పటి వరకు పోర్టుల పనులు ఆపేశారు. ఇప్పటికే భూములు ఇచ్చామని, ఇంకా భూములు లేవని మచిలీపట్నం పోర్టు వద్ద అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా ప్రతి అడుగులోనూ నాకేమిటి అంటూ చంద్రబాబు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆ దిశలోనే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి వాతావరణంలో రేపు 2029 ఎన్నికలు జరగబోతున్నాయి.అంతా దగా.. పచ్చి మోసం⇒ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు.. ఆ తర్వాత ఏం చేస్తున్నాడన్నది అందరికీ తెలుసు. జగన్ ఇస్తున్నవన్నీ అలాగే అమలు చేయడమే కాకుండా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా ఇస్తానన్నాడు. ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. ⇒ ఇప్పుడు మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇంకా మిగిలినవి కేవలం రెండు మాత్రమే. కానీ ఏ పథకం అమలు చేయడం లేదు. జగన్ ఇచ్చినవన్నీ పోయాయి. అన్నీ ఎగ్గొట్టాడు. చివరకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా మోసాలయ్యాయి. బిర్యానీ కథ దేవుడెరుగు.. ఉన్న పలావు పోయింది. దీని గురించి ప్రజలు ఇంటింటా చర్చించుకుంటున్నారు.జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం⇒ గుడ్‌న్యూస్ ఏమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సీట్లు పెరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కు, పార్లమెంటు నియోజకవర్గాలు 25 నుంచి 38కి పెరగనున్నాయి. అలాగే వాటిలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33 శాతం చొప్పున అసెంబ్లీలో 88 సీట్లు, 13 ఎంపీ సీట్లు దక్కనున్నాయి. నాడు మన ప్రభుత్వ హయాంలో మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఇచ్చాం. అందుకోసం చట్టం కూడా చేశాం. ఆ విధంగా మహిళలకు సాధికారత కల్పించాం.⇒ 2029లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరగడం వల్ల కార్యకర్తలు లీడర్లుగా ఎదుగుతారు. నాయకత్వ పటిమ చూపే వారందరికీ జగన్ న్యాయం చేస్తాడు. ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. నాడు మన హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల కార్యకర్తలపై దృష్టి పెట్టలేకపోయాం. పాలన, బటన్ నొక్కడంపై ఎక్కువగా ధ్యాస పెట్టాల్సి వచ్చింది. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ప్రజలకు ఇంకా మంచి చేయడమే కాకుండా, కార్యకర్తలకు కూడా మంచి జరుగుతుంది.⇒ జగన్ 2.0లో ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి, రాబోయేవి చాలా మంచి రోజులు. ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. అందులో చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను. దాంతో మొత్తం పార్టీ ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగుతుంది. అప్పుడు చంద్రబాబుకు సినిమా చూపిస్తాం. చంద్రబాబు చేసే రెడ్‌బుక్ పాలన, అన్యాయాలకు టైమ్ దగ్గరకొచ్చింది. ఇంకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.⇒ ఈ సమావేశంలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్, నియోజకవర్గంలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.అంతా దోచుకో.. పంచుకో.. తినుకో..⇒ మన హయాంలో ఆ ఐదేళ్లలో దాదాపు రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా బదిలీ చేశాం. ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలతో సహా ఎవరికి, ఎంతిచ్చామో చెప్పగలం. కానీ రెండేళ్లు కూడా కాకముందే చంద్రబాబు చేసిన మొత్తం అప్పులు రూ.3.37 లక్షల కోట్లు దాటాయి. కానీ, జగన్ ఇచ్చిన పథకాలు లేవు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా లేవు. మరి నాడు జగన్ ఎలా చేశాడు.. మరి ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎందుకు చేయడం లేదు.. అన్నదానిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.⇒ చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదంటే.. ఇప్పుడంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అదంతా చంద్రబాబు, ఆయన బినావీులు, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ప్రతి చోటా దోపిడీ. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. వేలం పాటలు నిర్వహించి, బెల్టు షాపులు నడుపుతున్నారు. మద్యం ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. అంతా మాఫియాకు చేరుతోంది.⇒ ఇసుక, మట్టి, ల్యాటరైట్.. దేన్నీ వదలడం లేదు. మరోవైపు అధిక ధరలకు పీపీఏలతో అవినీతికి పాల్పడుతున్నారు. మనం యూనిట్ విద్యుత్ రూ.2.49కే పీపీఏ చేసుకుంటే, ఇప్పుడు రూ.4.60కి చేసుకుంటున్నారు. మనం రైతులకు ఉచిత విద్యుత్ 25 ఏళ్లు ఇవ్వాలని సంకల్పించి, యూనిట్ విద్యుత్‌ను రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటే విమర్శించారు. కానీ వీరు ఏకంగా యూనిట్ విద్యుత్‌ను రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు.⇒ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాల్లోనే చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేలతో ఫైవ్ స్టార్ లెవెల్లో కట్టొచ్చు. కానీ ఇక్కడ ఏకంగా అదే చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. భూములనైతే శనక్కాయలు, బెల్లానికి ఇస్తున్నారు. చంద్రబాబు బంధువు, బాలకృష్ణ అల్లుడికి రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచి పెడుతున్నారు. ఈ రకంగా రాష్ట్ర ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు.పరిపాలన లేదు.. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి⇒ చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పరిపాలన అనేది లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లేక, పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది విద్యా దీవెన, వసతి దీవెనకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలి. కానీ ఈ ఏడాది బడ్జెట్లో పెట్టింది రూ.2,600 కోట్లు మాత్రమే. ఆరోగ్యశ్రీకి రూ.3,150 కోట్లు బకాయి పెట్టారు. దీంతో నెట్వర్క్ ఆస్పత్రుల పథకం కింద వైద్యం చేయడం లేదు.⇒ నాడు–నేడు మనబడి లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్దలో క్వాలిటీ లేదు. చదువులు పూర్తిగా తిరోగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతున్నాయి. విద్య, వైద్యం పరిస్థితి ఇలా ఉంటే.. రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంత దారుణంగా వ్యవసాయం ఉంది. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. -
నేడు అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. -
అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ
-
అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి న్యూస్, అమరావతి: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 19 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై వేసే ప్రతి అడుగూ ఎన్నికల దిశగా ఉండాలని నియోజకవర్గ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన పనులు, సంక్షేమ పథకాల వివరాలను గణాంకాలతో సహా వివరించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే… ►నియోజకవర్గంలో టీడీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, నియోజకవర్గంలో కచ్చితంగా మార్పు వస్తుంది. డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేశాం, ఈ నియోజక వర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081కోట్లు ఇచ్చాం, 93,124కుటుంబాలకు మేలు చేశాం. 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి పట్టాలు ఇచ్చాం. 47,123 మందికి బియ్యంకార్డులు మంజూరు చేశాం. ►ఈ స్థాయిలో ఇంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా చేశాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీకూడా, ఏ ఒక్కరికీ మిస్‌కాకుండా ఆయా కుటుంబాలకు మంచిచేశాం, బటన్‌నొక్కి వారి ఖాతాల్లోకి జమచేశాం. చేసిన మంచి ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ వివరిస్తూ, వారికి లేఖలు ఇస్తూ గడపగడపకూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ►మన ప్రతినిధిగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఇంట్లో జరిగిన మంచిని ఆయా కుటుంబాలకు వివరిస్తున్నారు. ఎక్కడైనా పొరపాటున అర్హత ఉండికూడా రాని పరిస్థితి ఉంటే… అటువంటి వాళ్లకీ మళ్లీ మంచిచేయాలన్నదే ఈ గడపగడపకూ కార్యక్రమం ఉద్దేశం.అందరికీ మంచి చేయాలన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు ఇచ్చాం. ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు ఈ నిధులు కేటాయిస్తాం. ►ప్రతి సచివాలయంలో కనీసం రెండు రోజులు గడపగడపకూ కార్యక్రమం చేపట్టాలని, కనీసం రోజుకు 6 గంటలు ఉండాలని, అంటే రెండు రోజుల్లో 12 గంటల పాటు ఆ సచివాలయంలో తిరగాలని చెప్పాం. దీనివల్ల ప్రాధాన్యతగా చేపట్టాల్సిన పనులను గుర్తించగలుగుతాం. ►అన్నిరకాలుగా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే, ఎన్నికలకు దాదాపుగా రెండేళ్లకు ముందే నాయకులను ఈ విధంగా తిప్పిన కార్యక్రమం గతంలో ఎన్నడూ లేదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి సాధకబాధకాలు ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి. ►ఒకరికి ఒకరు తోడుగా ఉంటేనే, అందరం కలిసికట్టుగా ఉంటేనే మనం మంచి విజయాలు సాధిస్తాం. ముఖ్యమంత్రిగా నేను డీబీటీ ఇవ్వడం అయితేనేమి, స్కూళ్లు బాగుచేయడం అయితేనేం, ఆస్పత్రులు బాగుచేయడం అయితేనేం, వ్యవసాయం బాగుండేలా చూడ్డం అయితేనేం.. ఇలా నేను చేయాల్సింది నేను చేయాలి. అదే సమయంలో మీరు చేయాల్సింది మీరు చేయాలి: ►నేను, మీరు కలిస్తేనే.. 175కి 175 సీట్లు సాధించగలుగుతాం, ఇదేమీ కష్టం కాదు, అసాధ్యం కానేకాదు. ప్రతినియోజకవర్గంలో గ్రామం ఒక యూనిట్, ఆ గ్రామంలో 87శాతం కుటుంబాలకు మేలు జరిగినప్పుడు, అందరి కంటికి కనిపించినట్టుగా గ్రామ, వార్డు సచివాలయాలు, ఇంగ్లిషు మీడియం, విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు, వ్యవసాయం చేసే తీరు మారుతున్నప్పుడు.. ఆ గ్రామంలో మెజార్టీ రావడం ఎందుకు సాధ్యంకాదు. ►గ్రామంలో వచ్చినప్పుడు నియోజకవర్గంలో ఎందుకు రాదు? నియోజకవర్గాల్లో వచ్చినప్పుడు 175కి 175 ఎందుకు రావు. కుప్పంలోనే కాదు అద్దంకిలో కూడా మొత్తం 5కి 5జడ్పీటీసీలు, ఎంపీపీలు ఐదింటికి ఐదు, ఇక మున్సిపాలిటీ, 103 గ్రామ పంచాయతీల్లో 87 సర్పంచి స్థానాలు గెలిచాం. ►దేవుడి దయతో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. 151 సీట్లు గతంలో వస్తే..ఇలాంటి మంచి పనులు జరిగినప్పుడు, ఇప్పుడు 175కి 175 సీట్ల సాధించగలుగుతాం. ఏమైనా సమస్యలు ఉంటే.. కుటుంబంగా వాటిని పరిష్కారం చేసుకుని ముందుకు నడవాలి, అందరం ఒక్కటై కష్టపడదాం, 175కి 175 సీట్లు సాధిద్దాం. అద్దంకిలో మునుపెన్నడూలేని విజయాన్ని నమోదు చేద్దాం. ఇదీ చదవండి: CM YS Jagan: అంగన్వాడీలపై సమీక్ష.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు -
అద్దంకి నియోజకవర్గ ఇంచార్జిగా బాచిన కృష్ణ చైతన్య
సాక్షి, ప్రకాశం : గత టీడీపీ హయాంలో నియోజకవర్గానికి కనీసం తాగు నీరు కూడా ఇవ్వలేకపోయారని మంత్రి బాలినేని శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలకు మేరకు అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జిగా బాచిన కృష్ణ చైతన్యను నియమించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గరటయ్య తరఫున ఆయన కుమారుడు కృష్ణచైతన్య కీలకంగా వ్యవహరించారు. తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఈయన నియామకం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి బాలినేని మాట్లాడుతూ.. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒంగోలుకి మంచి నీటి సమస్య లేకుండా చూస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో కేవలం కమీషన్లు మాత్రమే రాజ్యమేలేవని, కానీ నేడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం చెప్పటిన జీ ప్లస్ ఇళ్ల నిర్మాణం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నేతృత్వంలో పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు' మంత్రి తెలిపారు. -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
గొట్టిపాటి రవికుమార్‌కు భద్రత పెంచండి డీజీపీకి వైఎస్సార్సీపీ శాసనసభ్యుల వినతి సానుకూలంగా స్పందించిన జేవీ రాముడు హైదరాబాద్: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు డీజీపీ జేవీ రాముడికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు డీజీపీని కలిశారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో రవికుమార్‌పై దౌర్జన్యం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనకు భద్రత పెంచాలని కోరారు. ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. మాజీ ఎంపీ కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ నేతృత్వంలోనే.. వారి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. జిల్లాలో బలరామ్, వెంకటేష్‌ల వరుస దౌర్జన్యాలను వివరించారు. గొట్టిపాటి రవిపై దాడి జరగడం ఇది మూడోసారని, ఆయనకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుని, నిత్యం ఆయన వెంట ముగ్గురు అంగరక్షకులు ఉండేలా (3+3) భద్రత కల్పించాలని కోరారు. తమ విజ్ఞప్తులపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, తక్షణం అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు తెలిపారు. రవికుమార్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆదిమూలం సురేష్ (సంతనూతలపాడు), ఎం.అశోక్‌రెడ్డి (గిద్దలూరు), పాలపర్తి డేవిడ్‌రాజు (యరగొండపాలెం), జంకె వెంకట్‌రెడ్డి (మార్కాపురం), పోతుల రామారావు (కందుకూరు)లు డీజీపీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సురేష్ మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు, మాజీ శాసనసభ్యులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమే కాకుండా పదేపదే దాడులకు దిగుతున్నారని చెప్పారు. తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీ, జిల్లా సమావేశాల్లో వారి సమస్యల్ని లేవనెత్తుతున్నామని, ఇవి టీడీపీ వారికి కంటగింపుగా మారి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తనపై దాడి గురించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ నిందితులను అరెస్టు చేయలేదని రవికుమార్ తెలిపారు. తన నియోజకవర్గంలో అత్యంత సమస్యాత్మకమైన గ్రామాలు చాలా ఉన్నాయని, రాజకీయ ప్రత్యర్ధుల నుంచి తన ప్రాణాలకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన వివరించారు. తమ కుటుంబం చేతిలో మూడుసార్లు ఓడిపోయినవారు అక్కసుతో ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రతిపక్షం గొంతునొక్కడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజల పక్షాన పోరాడుతున్నందుకే గతంలో తన సోదరుడు గొట్టిపాటి కిశోర్ ను హతమార్చారని వివరించారు. పదేపదే దాడులు ఉపేక్షించబోమని, పార్టీ కార్యకర్తల రక్షణకు, వారి ఆత్మస్థైర్యం కోసం పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో గుండ్లకమ్మపై సమీక్ష సమావేశం సందర్భంగా మంత్రులు, శాసనసభ్యుల సమక్షంలోనే ఈ దాడులు జరగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలే దాడి చేశారని, గతంలోనూ ఇలానే జరిగినట్లుగా తమ విచారణలో తేలిందని డీజీపీ సైతం అంగీకరించినట్లు తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో జరిగిన అధికారిక సమావేశానికి ఎమ్మెల్యేలు కాని వారినీ అనుమతిస్తూ టీడీపీ ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కుతోందని డేవిడ్ రాజు ధ్వజమెత్తారు. కరణం బలరామ్, కరణం వెంకటేష్‌ల నేతృత్వంలోనే సోమవారం నాటి దాడి జరిగిందని పునరుద్ఘాటించారు. టీడీపీ గూండా రాజకీయాలు, దౌర్జన్యాలకు వైఎస్సార్ సీపీ భయపడదని, వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల కోసం, వారి సమస్యలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. జగన్‌తో భేటీ డీజీపీని కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. టీడీపీ నేతల దాడి, రవికుమార్ కారును ధ్వంసం చేయడానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. అధికార పార్టీ ఆగడాలపై జగన్ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అద్దంకిలో 144వ సెక్షన్ మరోవైపు సోమవారం నాటి దాడి నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో గొడవలు జరుగుతాయనే అనుమానంతో 144 సెక్షన్ విధించారు. ఈ కేసు నిందితులలో ఒకరిద్దరిని అదుపులోకి తీసుకున్నా ప్రధాన నిందితుల జోలికి మాత్రం పోలేదు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులున్నా అరెస్టు చేయలేదు. కరణం బలరామ్ మంగళవారం ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ పోలీసులు బందోబస్తుకే పరిమితమయ్యారు.


