ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్
అద్దంకి నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు
2022లో నా దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌తో చర్చలు
అప్పట్లోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సూత్రప్రాయ అంగీకారం
అప్పుడే గ్రీన్‌కోలో రూ.4800 కోట్లు మిట్టల్ పెట్టుబడులు
ఎస్సార్ కొనుగోలు, విస్తరణ కూడా అప్పుడే
ఆ తర్వాతే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆహ్వానం.. మూడు ప్రదేశాలు చూపిస్తే ఎన్నికలకు ముందే నక్కపల్లి ఎంపిక
ఇవన్నీ చెప్పకుండా అంతా తన ఘనతే అనేలా క్రెడిట్ దోపిడీ చేస్తున్న చంద్రబాబు
అదే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్ట్ ఏమైంది?.. కావాలనే భూ వివాదాన్ని సృష్టించి పనులు ఆపేశారు
నియోజకవర్గాల పెంపు గుడ్ న్యూస్. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు హర్షణీయం. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సీట్లు గణనీయంగా పెరుగుతాయి. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు వల్ల కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుంది. ఉత్సాహం, పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం ఇస్తాం. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం.
పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. వంట నూనె లీటరు రూ.40 పెరిగింది. పప్పులు కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఉచిత గ్యాస్‌కు దిక్కులేదు. మరోవైపు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బ్లాక్‌లో అమ్ముతున్నారు. సిలిండర్ రూ.2 వేలు, రూ.3 వేలకు అమ్ముతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఈ పెద్దమనిషి కిరోసిన్ ఇస్తానంటున్నాడు. లీటరు కిరోసిన్ ఇస్తాడంట. పండగ చేసుకోమంటున్నాడు. అసలు కిరోసిన్ స్టవ్‌లు ఎక్కడున్నాయి? చివరకు గుడ్ల ధర కూడా పడిపోయింది. మొక్కజొన్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.2,400 అయితే రూ.1,400కు కూడా అడిగే వాడు లేడు. కోకో, అరటి, శనగ, టమాటా.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల పరిస్థితి అగమ్యగోచరం.
-వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: చంద్రబాబు క్రెడిట్ చోరీ కాకుండా, ఏకంగా క్రెడిట్ దోపిడీ చేస్తున్నారని.. ఆ దిశలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నిజానికి 2022లో తన దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌ను కలిశానని, రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అప్పుడే దాదాపు అవగాహన కుదిరిందని చెప్పారు. తగిన భూమి ఇచ్చేందుకు కూడా అంగీకరించామని, అంతే కాకుండా అప్పుడే ఆ కంపెనీ కర్నూలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌కో ప్రాజెక్టులోనూ రూ.4,800 కోట్ల పెట్టుబడికి అవగాహన కుదుర్చుకుందని వెల్లడించారు.
అలా తాము తెచ్చిన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తూ అంతా తన ఘనతేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎత్తి చూపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్ధల పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో మనం 151 సీట్లు గెల్చుకున్నా, అద్దంకిలో గెలవలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో మంత్రిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబుకన్నా ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఇప్పటి మంత్రిపై ఉందన్నారు.
అద్దంకి నియోజకవర్గంలో డాక్టర్ అశోక్‌కుమార్‌ను తీసుకొచ్చామని.. ఆయన మంచి డాక్టర్ అన్నారు. రాక్షస రాజ్యంలో ఉన్నాం కాబట్టి, చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుందని తెలిసినా, అశోక్ ముందుకొచ్చి, ఐదేళ్ల పోరాటానికి సిద్ధమయ్యారని.. కార్యకర్తలకు తోడుగా నిలబడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
కోటలు దాటుతున్న బాబు మాటలు
⇒ ‘చంద్రబాబు పాలనంతా వైఫల్యం. కానీ, మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలుండవు. ఆయన చేస్తున్న దాన్ని క్రెడిట్ చోరీ కాకుండా క్రెడిట్ దోపిడీ అనాలేమో. చంద్రబాబు ఇటీవలి క్రెడిట్ దోపిడీ గురించి చెప్పాల్సి వస్తే.. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను తాను తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ.. ఆర్భాటంగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు క్రెడిట్ దోపిడీకి కనీసం హద్దు ఉండాలి. ఆదిత్య మిట్టల్‌ను 2022లో నేను దావోస్‌లో కలిశాను. అప్పట్లోనే ఇక్కడి గ్రీన్‌కో ప్రాజెక్టులో పెట్టుబడికి కూడా రెడీ అయ్యారు. రూ.4,800 కోట్ల పెట్టుబడితో ఆ ప్రాజెక్టులో వారు భాగస్వాములయ్యారు. కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌లో ఆ పెట్టుబడి పెట్టారు.
⇒ ఇంకా అప్పట్లోనే ఎస్సార్ స్టీల్‌ని వారు కొనుగోలు చేసి, రూ.1,000 కోట్ల పెట్టుబడితో విస్తరణకు రెడీ అయ్యారు. ఆ మేరకు అగ్రిమెంట్లు కూడా జరిగాయి. అవే కాకుండా, ఇక్కడ కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఆహ్వానించి, వారికి తగిన భూములు చూపాలని అధికారులను ఆదేశించాను. దాంతో అధికారులు కాకినాడ సెజ్‌లో, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపితే, వారికి నక్కపల్లి నచ్చింది. అక్కడ మనకు ఏపీఐఐసీ భూములుంటే, వాటిలో 2,200 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ఆలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. దాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తూ.. ఒక జూమ్ కాల్‌తో మిట్టల్ కంపెనీ వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు.
⇒ అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. విశాఖలో అదానీ డేటా సెంటర్ కూడా అంతే. అది మన హయాంలోనే వచ్చింది. అది కూడా తానే తెచ్చినట్లు చంద్రబాబు ప్రచారం. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం. అదే నక్కపల్లిలో 2023లో బల్క్ డ్రగ్ పార్కును 13 రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చాం. కేంద్రం రూ.1,000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కానీ, చంద్రబాబు వచ్చాక, ఆ బల్క్ డ్రగ్ పార్క్ పనులు జరగడం లేదు. అడుగులు ముందుకు పడడం లేదు. దాని వల్ల రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలూ వస్తాయి. అయినా భూముల పేరుతో వివాదాస్పదం చేశారు. దాంతో ఆ పనులు నిల్చిపోయాయి. అలా కొన్ని ప్రాజెక్టులు పని చేయడం లేదు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశానికి హాజరైన అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు
పోర్టుల్లో పనుల నిలిపివేత
⇒ నాడు మన ప్రభుత్వంలో మూడు పోర్టుల పనులు వేగంగా చేశాం. నిధుల సమీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. రామాయపట్నం పోర్టు దాదాపు 80 శాతం పూర్తి చేశాం. మూలపేట పోర్టు పనులు 30 శాతం పూర్తి చేశాం. మచిలీపట్నం పోర్టు 30 శాతం మన హయాంలోనే పూర్తి చేశాం. కానీ, ఈ మూడింటి పనులు ఆగిపోయాయి. ఎందుకంటే, జగన్‌కు పేరు రాకూడదని పనులు ఆపారు.
⇒ ఇప్పుడు ఆ చుట్టుపక్కల భూములను చంద్రబాబు తన వారితో కొనిపిస్తున్నాడు. అప్పటి వరకు పోర్టుల పనులు ఆపేశారు. ఇప్పటికే భూములు ఇచ్చామని, ఇంకా భూములు లేవని మచిలీపట్నం పోర్టు వద్ద అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా ప్రతి అడుగులోనూ నాకేమిటి అంటూ చంద్రబాబు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆ దిశలోనే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి వాతావరణంలో రేపు 2029 ఎన్నికలు జరగబోతున్నాయి.
అంతా దగా.. పచ్చి మోసం
⇒ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు.. ఆ తర్వాత ఏం చేస్తున్నాడన్నది అందరికీ తెలుసు. జగన్ ఇస్తున్నవన్నీ అలాగే అమలు చేయడమే కాకుండా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా ఇస్తానన్నాడు. ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు.
⇒ ఇప్పుడు మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇంకా మిగిలినవి కేవలం రెండు మాత్రమే. కానీ ఏ పథకం అమలు చేయడం లేదు. జగన్ ఇచ్చినవన్నీ పోయాయి. అన్నీ ఎగ్గొట్టాడు. చివరకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా మోసాలయ్యాయి. బిర్యానీ కథ దేవుడెరుగు.. ఉన్న పలావు పోయింది. దీని గురించి ప్రజలు ఇంటింటా చర్చించుకుంటున్నారు.
జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం
⇒ గుడ్‌న్యూస్ ఏమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సీట్లు పెరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కు, పార్లమెంటు నియోజకవర్గాలు 25 నుంచి 38కి పెరగనున్నాయి. అలాగే వాటిలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33 శాతం చొప్పున అసెంబ్లీలో 88 సీట్లు, 13 ఎంపీ సీట్లు దక్కనున్నాయి. నాడు మన ప్రభుత్వ హయాంలో మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఇచ్చాం. అందుకోసం చట్టం కూడా చేశాం. ఆ విధంగా మహిళలకు సాధికారత కల్పించాం.
⇒ 2029లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరగడం వల్ల కార్యకర్తలు లీడర్లుగా ఎదుగుతారు. నాయకత్వ పటిమ చూపే వారందరికీ జగన్ న్యాయం చేస్తాడు. ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. నాడు మన హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల కార్యకర్తలపై దృష్టి పెట్టలేకపోయాం. పాలన, బటన్ నొక్కడంపై ఎక్కువగా ధ్యాస పెట్టాల్సి వచ్చింది. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ప్రజలకు ఇంకా మంచి చేయడమే కాకుండా, కార్యకర్తలకు కూడా మంచి జరుగుతుంది.
⇒ జగన్ 2.0లో ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి, రాబోయేవి చాలా మంచి రోజులు. ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. అందులో చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను. దాంతో మొత్తం పార్టీ ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగుతుంది. అప్పుడు చంద్రబాబుకు సినిమా చూపిస్తాం. చంద్రబాబు చేసే రెడ్‌బుక్ పాలన, అన్యాయాలకు టైమ్ దగ్గరకొచ్చింది. ఇంకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
⇒ ఈ సమావేశంలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్, నియోజకవర్గంలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
అంతా దోచుకో.. పంచుకో.. తినుకో..
⇒ మన హయాంలో ఆ ఐదేళ్లలో దాదాపు రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా బదిలీ చేశాం. ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలతో సహా ఎవరికి, ఎంతిచ్చామో చెప్పగలం. కానీ రెండేళ్లు కూడా కాకముందే చంద్రబాబు చేసిన మొత్తం అప్పులు రూ.3.37 లక్షల కోట్లు దాటాయి. కానీ, జగన్ ఇచ్చిన పథకాలు లేవు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా లేవు. మరి నాడు జగన్ ఎలా చేశాడు.. మరి ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎందుకు చేయడం లేదు.. అన్నదానిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.
⇒ చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదంటే.. ఇప్పుడంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అదంతా చంద్రబాబు, ఆయన బినావీులు, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ప్రతి చోటా దోపిడీ. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. వేలం పాటలు నిర్వహించి, బెల్టు షాపులు నడుపుతున్నారు. మద్యం ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. అంతా మాఫియాకు చేరుతోంది.
⇒ ఇసుక, మట్టి, ల్యాటరైట్.. దేన్నీ వదలడం లేదు. మరోవైపు అధిక ధరలకు పీపీఏలతో అవినీతికి పాల్పడుతున్నారు. మనం యూనిట్ విద్యుత్ రూ.2.49కే పీపీఏ చేసుకుంటే, ఇప్పుడు రూ.4.60కి చేసుకుంటున్నారు. మనం రైతులకు ఉచిత విద్యుత్ 25 ఏళ్లు ఇవ్వాలని సంకల్పించి, యూనిట్ విద్యుత్‌ను రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటే విమర్శించారు. కానీ వీరు ఏకంగా యూనిట్ విద్యుత్‌ను రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు.
⇒ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాల్లోనే చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేలతో ఫైవ్ స్టార్ లెవెల్‌లో కట్టొచ్చు. కానీ ఇక్కడ ఏకంగా అదే చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. భూములనైతే శనక్కాయలు, బెల్లానికి ఇస్తున్నారు. చంద్రబాబు బంధువు, బాలకృష్ణ అల్లుడికి రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచి పెడుతున్నారు. ఈ రకంగా రాష్ట్ర ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు.
పరిపాలన లేదు.. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి
⇒ చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పరిపాలన అనేది లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక, పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది విద్యా దీవెన, వసతి దీవెనకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలి. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్టింది రూ.2,600 కోట్లు మాత్రమే. ఆరోగ్యశ్రీకి రూ.3,150 కోట్లు బకాయి పెట్టారు. దీంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల పథకం కింద వైద్యం చేయడం లేదు.
⇒ నాడు–నేడు మనబడి లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్దలో క్వాలిటీ లేదు. చదువులు పూర్తిగా తిరోగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతున్నాయి. విద్య, వైద్యం పరిస్థితి ఇలా ఉంటే.. రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంత దారుణంగా వ్యవసాయం ఉంది. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు.


