
విశాఖపట్నం : సాగర జలాల్లో యుద్ధ నౌకల కవాతు.. గగన తలంలో హెలికాఫ్టర్ల పహారా.. శత్రు మూకలపై నేవీ కమాండోల కదన దూకుడు.. రివ్వున దూసుకొచ్చిన మిసైల్స్.. దానితో పోటీ పడేటట్లుగా మెరుపు వేగంతో వెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లో చక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్లు.. మొత్తంగా.. ఆర్‌కే బీచ్.. రణరంగాన్ని తలపించింది.

ఒళ్లు గగుర్పొడిచేలా నిర్వహించిన నేవీ విన్యాసాలా రిహార్సల్.. యుద్ధ వాతావరణాన్ని మించిపోయేలా చేసింది. ఉవ్వెత్తున ఎగిసిపడిన జనసంద్రం నడుమ ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని.. నింపిన నౌకాదళ విన్యాసాలలో సాగర తీరం సంభ్రమాశ్చర్యాలకు కేంద్రంగా మారింది.

శుక్రవారం నిర్వహించిన తుది రిహార్సల్స్.. గంటన్నర సేపు అలరించాయి

అంతకు మందు నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నేవీ బ్యాండ్‌తో సైలర్స్ అదరగొట్టారు.

ఆర్‌కే బీచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన నేవీ తాత్కాలిక కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు విన్యాసాలను పర్యవేక్షించారు

10న జరిగే నేవీడేకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, హాజరుకానున్నారు.



























