కలెక్టర్‌కు కోపమొచ్చింది..!

collector fired on officials - Sakshi

ఓడీఎఫ్‌ అమలుకాని గ్రామాల్లో ధర్నా చేపడతానని హెచ్చరిక

పనితీరు సరిగాలేని అధికారులపై చర్యలకు రంగం  సిద్ధం

జిల్లాలో పడకేసిన ‘స్వచ్ఛభారత్‌’

ఈ నెల27 ‘మాస్‌ గ్రౌండింగ్‌’కు పిలుపు

నేడు జిల్లా వెనుకబడిన మండల అధికారులతో సమీక్ష  

సాక్షి ప్రతినిధి, కడప: ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం ధర్నాలు చేయడం మనం ఇప్పటివరకు చూశాం.. ఏదైనా ప్రభుత్వ పథకం పక్కాగా అమలుకాకపోతే అధికారులపై చిందులు వేసే ఉన్నతాధికారులను చూశాం.. కానీ, జిల్లా కలెక్టర్‌ మాత్రం అందుకు భిన్నంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఓడీఎఫ్‌ పథకం 100శాతం అమలు కోసం వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు మరుగుదొడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న గ్రామాల్లో ధర్నా చేపడతానని ప్రకటించడం విశేషం. నిర్దేశిత సమయానికి లక్ష్యం పూర్తి చేయలేకపోయినా అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తికాని గ్రామాల్లో తానే స్వయంగా ధర్నా చేపట్టి.. ఆ పరిస్థితికి కారణమైన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో హడలిపోయిన అధికారులందరూ పల్లెబాట పట్టారు.

మరో వారంరోజులే గడువు..
జిల్లాను ఓడీఎఫ్‌(ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ)గా చేయాల్సిన గడువు మరో వారంరోజులతో ముగియనుంది. జనవరి నెలాఖరుకే జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా(ఓడీఎఫ్‌) చేయాలని కలెక్టర్‌ నిర్ణయించారు. ఇదేలక్ష్యంగా ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తొలుత డిసెంబర్‌ నెలాఖరులోగా లక్ష్యాలను పూర్తిచేయాలని నిర్దేశించింది. ఆ తర్వా త గడువును జనవరి చివరివరకు పెంచింది. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అన్ని ముఖ్యశాఖల అధికారులకు మరుగుదొడ్ల పనిలో నిమగ్నమయ్యారు. అయితే, పనుల పురోగతిని పరిశీలిస్తే మరో 2నెలలు సమయమిచ్చినా ఓడీఎఫ్‌ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

23 మండలాల్లో పూర్తికాని పనులు
స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాలోని 50మండలాల్లో మొత్తం 3,40,823 మరుగుదొడ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఇప్పటివరకు 2,51,431 పూర్తిచేశారు. మిగిలిన 89,392లో 83వేల వరకు వివిధ దశలో పనులు జరుగుతున్నాయి. 9వేల పైచిలుకు మాత్రం ఇప్పటివరకు నిర్మాణానికి నోచుకోలేదు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 23 మండలాల్లో జరుగుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలుత పనులు చేపట్టి పూర్తయిన కొన్ని మరుగుదొడ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చాలాచోట్ల మరుగుదొడ్లను నిర్మించుకోవడానికి ఎవరూ ముందుకురావడం లేదు.

ముద్దనూరులో 50శాతం లోపే..
సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలే లక్ష్యంగా ముద్దనూరు మండలంలో 50శాతం మరుగుదొడ్లను కూడా పూర్తి చేయలేదు. ఈ మండలంలో మొత్తం 3,095 నిర్మించాల్సి ఉండగా, 1,505 మాత్రమే పూర్తిచేశారు. పులివెందుల మండలంలోనూ 1,258 మరుగుదొడ్లను లక్ష్యంగా ఇచ్చారు. ఇప్పటివరకూ 655 మాత్రమే పూర్తిచేయగలిగారు. మిగిలిన వాటిలో కొన్నిచోట్ల ఇంకా పనులు ప్రారంభమే కాలేదు. అదేవిధంగా వల్లూరు మండలంలో మొత్తం 2,855 మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం 1,443 మాత్రమే పూర్తి చేశారు.

కలెక్టర్‌ హెచ్చరికతో ఉరుకులు పరుగులు
ఓడీఎఫ్‌ పథకం అమలులో అధికారులు విఫలమయ్యారంటూ సోమవారం కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు హడలిపోయారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా అధికారులు ఉరుకులు పరుగులు పెట్టడం కనిపించింది. పైగా 23 మండలాల్లో పనితీరు సరిగలేకపోవడంపై బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయా మండలాలకు చెందిన అధికారులు నిర్దేశించిన టార్గెట్లను చేరుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నెల 27న మాస్‌ గ్రౌండింగ్‌ లక్ష్యాన్ని కలెక్టర్‌ నిర్దేశించడంతో పనులు వేగవంతానికి అధికారులు కృషిచేస్తున్నారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top