ఖండాంతర క్షిపణి ద్వారా ‘ఆంత్రాక్స్‌’

Kim Jong-un is testing new warheads loaded with ANTHRAX for his intercontinental ballistic missiles - Sakshi

సియోల్‌ : అణు సాయుధ సంపత్తి కోసం ఆరాటపడి, పలు ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆందోళనలకు గురి ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌.. రసాయన ఆయుధాలను తయారు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)లకు ఆంత్రాక్స్‌ బాక్టీరియాను అమర్చి శత్రు దేశాలపై ప్రయోగించాలని కిమ్‌ యోచన చేస్తున్నట్లు జపాన్‌ పత్రిక ‘అసాహీ’ బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది.

అమెరికా ప్రభుత్వానికి ఈ విషయంపై సమాచారం కూడా ఉందని వెల్లడించింది. ఖండాంతర క్షిపణికి ప్రయోగం వల్ల వెలువడే ఉష్ణానికి ఆంత్రాక్స్‌ బాక్టీరియా బ్రతుకుతుందా? లేదా? అనే అంశాన్ని నిర్ధారించుకునేందుకు కిమ్‌ దేశం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. 

‘ఆంత్రాక్స్‌’అంటే ఏంటి?
‘బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌’ అనే బ్యాక్టీరియా వల్ల ఆంత్రాక్స్‌ వ్యాధి సోకుతుంది. ఆంత్రాక్స్‌ను మిలటరీ ఆయుధాలకు(బాంబులు, క్షిపణులు, రాకెట్లు) జోడించి ప్రయోగించడానికి అవకాశం ఉంది. ఆంత్రాక్స్‌ అణువులను ఎంచుకున్న ప్రాంతంలో విమానాల ద్వారా కూడా వెదజల్లవచ్చు. దీనివల్ల దశాబ్దాల పాటు ఆ ప్రాంతంలోని జీవులకు ఆంత్రాక్స్‌ వ్యాధి సోకుతూనే ఉంటుంది.
 
ఆంత్రాక్స్‌ సోకిన తొలి దశలో రెండు నుంచి మూడు రోజుల పాటు ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం తీవ్ర జ్వరం, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోలేకపోవటం, షాక్‌కు గురవడం వంటి లక్షణాలు ప్రారంభమవుతాయి. మూడు దశకు చేరుకున్న రెండు రోజుల్లో వ్యాధి సోకిన వ్యక్తి లేదా జీవికి మరణం తప్పదు.

1932 నుంచి 1945ల మధ్యకాలంలో చైనా జపాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. జపాన్‌ను దురాక్రమించేందుకు యత్నించిన చైనా ‘ఆంత్రాక్స్‌’ను ఆయుధాల్లో వినియోగించింది.

ఖండించిన ఉత్తరకొరియా
రసాయన ఆయుధాల తయారీ చేపడుతున్నట్లు వస్తున్న వార్తలను ఉత్తరకొరియా ఖండిచింది. ఈ మేరకు ఆ దేశ మీడియాలో ఓ అధికారిక ప్రకటన ప్రసారమైంది. రసాయన ఆయుధాలతో తమకు ఎలాంటి సంబంధం లేకపోయిన తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న అమెరికాను విడిచిపెట్టబోమని హెచ్చరించింది.

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top