అమ్మాయిలకు జాగ్రత్తలు అవసరం | Be Careful This New Year's Eve | Sakshi
Sakshi News home page

కొత్త వత్సర వేడుక.. కారాదు విషాదం

Dec 31 2017 7:51 AM | Updated on Oct 17 2018 4:29 PM

Be Careful This New Year's Eve - Sakshi

నిడమర్రు:  నూతన సంవత్సర ఆరంభ వేడుకలకు  అందరూ సిద్ధమవుతున్నారు. తెలుగు వారికి ఉగాది నుంచే కొత్త ఏడాది ప్రారంభమంటూ ప్రభుత్వం కూడా ప్రచారం చేసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసినా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జనం వెనుకడుగు వేయడం లేదు. ప్రధానంగా యువత, విద్యార్థులు ఎంతో ప్రత్యేకంగా చేయాలని ఉత్సాహపడుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటారు. మద్యం తాగి వాహనాలను నడుపుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు.

అర్ధరాత్రి నుంచీ..
యువత, విద్యార్థులు నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోవాలని రెండు, మూడు రోజుల నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు.  మందు, విందు, వాహనం తదితర అంశాలకు సంబంధించి నగదు, ఇతరత్రా సామగ్రి సమకూర్చుకుంటున్నారు. తమకు అనువైన ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నారు.  మద్యం తాగి రాత్రి 12 గంటలు దాటిన వెంటనే ద్వి చక్ర వాహనాలపై రోడ్డు ఎక్కుతారు. మితిమీరిన వేగంతో రోడ్లపై దూసుకుపోతారు. ఒక్కో వాహనంపై ముగ్గురు లేదా నలుగురు ప్రయాణిస్తూ   ర్యాలీలు చేస్తారు.   ఎంత ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవాలని ప్రణాళిక వేసుకుంటారో.. ప్రమాదాల నివారణలోనూ అంతే అప్రమత్తంగా ఉండాలని మరవొద్దు. 

తల్లిదండ్రులకూ బాధ్యత
డిసెంబర్‌ 31వస్తుందంటే ముందుగానే పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. లేదా కుంటుంబ సభ్యుల మధ్యలో వేడుకలు జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలి.  వీలైనంత వరకూ ద్విచక్రవాహనాను ఇవ్వకుండా ఉండాలి.  టీనేజీ యువతపై ఓ కంట కనిపెట్టాలి. రాత్రి 12లోపు పిల్లలు ఇంటికి చేరుకునేలా హెచ్చరించాల్సిన బాధ్యత తల్లిండ్రులదే.

అమ్మాయిలకు జాగ్రత్తలు అవసరం
అమ్మాయిలు, ఉద్యోగినులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వేడుకల కోసం వెళ్లేటపుడు ఎక్కడకు వెళుతున్నామో ఎప్పటికి వస్తామో కుటుంబ సభ్యులకు చెప్పండి. ఏ వాహనంలో ఎవరితో వెళుతున్నారో ముందుగా తెలపండి. ఆటో, క్యాబ్‌ వంటి ప్రైవేటు వాహనాల్లో ఎక్కాక సామాజిక మాధ్యమాల్లో మునిగిపోవద్దు, డ్రైవర్‌ను, పరిసరాలను గమనిస్తూ ఉండాలి.

పోలీసుల హెచ్చరికలు
♦ జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాష్‌ జిల్లాలోని నూతన సంవత్సర వేడుకల్లో ఎటుంవటి విషాదాలకు తావు లేకుండా పలు నిబంధనలు జారీ చేశారు. 

♦ నూతన సంవత్సర వేడుకల్లో  లౌడ్‌ స్పీకర్లు కోసం పోలీసుల ముందస్తు అనుమతి పొందాలి.

♦ వేడుకలు రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే జరుపుకోవాలి, లేకపోతే చట్ట ప్రకారం తీసుకునే చర్యలకు గురవుతారు. 

♦ ’న్యూస్‌ పేపర్లు, మేగజైన్లు,  హోర్డింగ్స్‌లలో అశ్లీలత కల్గిన పోస్టర్లు గానీ, ప్రకటనలు గాని చేయరాదు. 

♦ వేడుకల్లో అశ్లీల నృత్యాలు, అశ్లీల  సినిమాలు, అశ్లీల సంజ్ఞనలు అనుమతించబడవు.

♦ మద్యం అమ్మేందుకు అబ్బారీశాఖ లైసెన్సు లేనిదే అమ్మకాలు నిషిద్ధం

♦ నూతన సంవత్సర వేడుక కార్యక్రమాల వద్ద సరైన లైటింగ్, కూర్చునే సదుపాయం కల్పించాలి.

♦  ప్రజలకు ప్రమాదం కలిగించే ఎటువంటి కార్యక్రమైన, విన్యాసమైన నిషిద్ధం, ప్రేలుడు పదార్థాలు, ఫైర్‌ ఆరŠమ్స్‌ ఉపయోగించుట పూర్తిగా నిషేధం

♦ పబ్లిక్‌ తిరిగే ప్రదేశాల్లో మద్యం సేవించడం, పేకాడటం చెయ్యరాదు.

♦ మ్యూజిక్‌ సిస్టమ్స్‌ రాత్రి 10 గంటల తరువాత వాడరాదు (సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం)

♦ మద్యం సేవించి, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిపై  ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 

♦ నిందితుల వాహనాన్ని సీజ్‌ చేసి రికార్డులు స్వాధీనం చేసుకుంటామన్నారు. రూ.2 వేలు జరిమానా, 6 నెలలు వరకూ జైలు శిక్ష లేదా రెండూ విధించబడునన్నారు. తాగిన వాహనం నడిపిన వారి లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు.

♦ ప్రభుత్వ అనుమతి పొందిన వైన్‌ షాపులు, బార్లు, క్లబ్బులు, ఇతర హోటల్స్‌ నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా తెరిచే ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటారు.

 వేడుకల పేరుతో మహిళలను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడును   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement