తొలి అడుగుకు వేళాయె..

Parliament Members Sworn Is Today - Sakshi

పార్లమెంట్‌లో నేడు అడుగుపెట్టనున్న ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు

ప్రమాణ స్వీకారం కూడా నేడే

సాక్షి, విశాఖపట్నం: ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ, అరకు, అనకాపల్లి ఎంపీలుగా ఎన్నికైన ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, భీశెట్టి సత్యవతిలు తొలిసారిగా సోమవారం లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. అనంతరం పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారణ చేస్తారు. రాష్ట్రంలో 22 ఎంపీ స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా.. విశాఖ జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాల్లో కూడా ఆపార్టీ సభ్యులే విజయకేతనం ఎగురవేశారు. దేశంలోనే 50 శాతం ఓట్లు..86 శాతం సీట్లతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. విశాఖ జిల్లాలో మూడు లోక్‌సభ, 11 అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయాలతో ప్రజల మన్ననలు చూరగొంటూ దూసుకుపోతున్నారు. జగన్‌ కేబినెట్‌లో జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కగా.. మరొకరికి విప్‌ హోదా దక్కింది. జిల్లా నుంచి ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయగా... ఎంపీలుగా ఎన్నికైన మాధవి, సత్యవతి, సత్యనారాయణలు నేడు పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మొదటి వ్యక్తిగా మాధవి ప్రమాణం
సోమవారం నాడు పార్లమెంట్‌లో జరిగే తొలిసెషన్‌లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి ఎంపీగా అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి ప్రమాణ స్వీకారం చేయనుండగా.. నాలుగో వ్యక్తిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేస్తారు.

శ్రేణుల్లో ఆనందం
లోక్‌సభలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీలకు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు.

మరువలేని రోజు 
దేశంలో ఎందరో మహోన్నత వ్యక్తులు అడుగుపెట్టినటువంటి పార్లమెంట్‌లో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా జన్మలో ఎప్పటికీ మరువలేని రోజుగా గుర్తుంచుకోవాలి. తాను పార్లమెంట్‌లో అడుగుపెట్టడానికి కారణమైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అనకాపల్లి పార్లమెంట్‌ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. స్థానిక సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తి వాటిపై పోరాడుతా. మా నాయుకుడు చెప్పిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యలను తీర్చుతా.–భీశెట్టి సత్యవతి, అనకాపల్లి ఎంపీ

ప్రత్యేకహోదా కోసం పోరాడతాం..
తొలిసారి ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నందుకు చాలా గర్వంగా ఉంది. తొలి సెషన్‌లో మాట్లాడే అవకాశం వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నా మొదటి గళం కేంద్ర ప్రభుత్వానికి వినిపిస్తాను. నాన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన తాను ప్రజల సమస్యలను లోక్‌సభలో వినిపిస్తాను. మా నాయకుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విధంగా లోక్‌సభలో ఏపీ హక్కుల కోసం పోరాడతా. తాను పార్లమెంటులో అడుగుపెడతానని కలలో కూడా అనుకోలేదు. మా నేత జగన్‌మోహన్‌రెడ్డి తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ ప్రాంత ప్రజల వాణిని లోక్‌సభలో వినిపిస్తా –గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ.

సంతోషంగా ఉంది
 అభివృద్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని విశాఖ ప్రజలు భావించి 
ఎంపీగా నన్ను గెలిపించారు. వారికి  కృతజ్ఞతలు. సోమవారం నేను లోక్‌సభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయనున్నాను. ప్రశ్నోత్తర సమయంలో విశాఖ సమస్యలను ప్రస్తావించడంతో పాటు విశాఖకు రావాల్సిన ప్రాజెక్టుల సాధన కోసం గళం విప్పుతాను.  –ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top