రైతును కరుణించని బడ్జెట్‌ | Sakshi
Sakshi News home page

రైతును కరుణించని బడ్జెట్‌

Published Wed, Feb 8 2017 3:43 AM

రైతును కరుణించని బడ్జెట్‌

విశ్లేషణ

ఈ బలవన్మరణాల పరంపరను నిరోధించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి కారణాలు, పరిష్కారాలు చెప్పిన స్వామినాథన్‌ నివేదికను అమలు చేయడం నేటి అవసరం. కాబట్టి మళ్లీ కమిటీని నియమించి, అది ఇచ్చే నివేదిక కోసం వేచి ఉండడం వ్యర్థం. మోదీ ప్రభుత్వానికి రైతాంగం పట్ల శ్రద్ధాసక్తులు ఉన్నాయి. రైతుల ఆదాయాన్ని స్థిర ధరల సూచీతో పరిగణించినప్పుడు రెట్టింపు కావాలంటే కచ్చితంగా స్వామినాథన్‌ సిఫారసుల అమలే శరణ్యం. సమస్యలతో సతమతమవుతున్న భారత రైతాంగం ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన 2017–2018 బడ్జెట్‌తో మరింత నిరాశకు గురైంది. పాలకులు పెద్ద పెద్ద మాటలతో ఊరించారు. దీనితో రైతులు తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం కార్యరూపం దాల్చడానికి అవసరమైన చర్యల గురించి బడ్జెట్‌లో ప్రతిపాదించలేదు.

మళ్లీ కొత్త కమిటీ ఎందుకు?
దేశంలో వ్యవసాయం రంగ దుస్థితికి కారణాలను, వాటిని అధిగమించడానికి మార్గాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్టు ఆ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. నిజానికి ఈ అంశాల అ«ధ్యయనం కోసమే విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ నాయత్వంలో ఒక సంఘం గతంలోనే ఏర్పాటయింది. ఆ సంఘం 2006లోనే నివేదికను కూడా ఇచ్చింది. ప్రజల ఆహార అవసరాలను తీరుస్తూ, లక్షలాది చిన్న పెద్ద పరిశ్రమలకు ముడి వస్తువులు సరఫరా చేస్తూ దేశ ప్రగతికి వ్యవసాయ రంగం ఊతమిస్తున్నా, వ్యవసాయదారుల ఆర్థిక స్థితిగతులు మాత్రం నానాటికీ తీసికట్టు అన్నట్టు తయారవుతున్నాయి. సన్నకారు, చిన్నరైతులు, కౌలు రైతులు, ఆదివాసీ రైతులు వేలాదిగా బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ వాస్తవాలను కూలంకషంగా అధ్యయనం చేసిన స్వామినాథన్‌ కమిటీ వివరణాత్మకమైన నివేదికనే సమర్పించింది.

వ్యవసాయేతర వర్గాల ప్రజల సగటు ఆదాయంతో పోలిస్తే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నవారి ఆదాయం– దీని అనుబంధ వ్యాపకాల మీద ఆధారపడిన వారి ఆదాయంతో కలిపి – రైతు కుటుంబానికి నెలకు రూ. 3,800 మాత్రమే దక్కుతున్నాయి. అప్పుల్లో పుట్టి, అప్పుల్లోనే చనిపోతున్నా రైతాంగం దుస్థితిలో మార్పు తెచ్చేందుకు ఈ కమిటీ ఆనాడే సూచనలు చేసింది. పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి ధరను నిర్ణయించాలనీ, పంట ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించే తీరు సక్రమంగా లేదనీ, విధివిధానాలను సమీక్షించాలనీ కమిటీ చేసిన రెండు ప్రధాన సిఫారసులను యూపీఏ ప్రభుత్వం అమలు చేయలేదు. కానీ 2014 ఎన్నికలలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఎన్నో రైతు సంక్షేమ పథకాల గురించి హామీ ఇచ్చారు. అవన్నీ నెరవేరతాయని భారత రైతాంగం గంపెడాశతో ఉంది. అయితే రైతుల ఆదాయాన్ని పెంచడానికి నేరుగా వీలు కల్పించే స్వామినాథన్‌ ప్రధాన సిఫారసులను అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొనడం పెద్ద దగా.  

ఎవరికీ పట్టని రైతన్న గోడు
కొత్త బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించినది రూ. 51,026 కోట్లు. పెరిగిన 7 శాతం ద్రవ్యోల్బణాన్ని గమనంలో ఉంచుకుని, 2016–17 సవరించిన అంచనాలు రూ. 48,072 కోట్ల కంటే ఇది 6.14 శాతం మాత్రమే ఎక్కువ. ఇక మొత్తం బడ్జెట్‌ కేటాయింపులలో ఇది 2.3 శాతం మాత్రమే. వ్యవసాయ రంగానికి రూ. 10 లక్షల కోట్ల మేరకు రుణ వితరణను ఆర్థికమంత్రి లక్ష్యంగా ప్రకటించారు. వ్యవసాయంలో ధర తరువాత కీలకపాత్ర రుణానిదే. 2005లో రూ. లక్ష కోట్ల నుంచి 2015–2016లో రూ. 8.5 లక్షల కోట్లకు వ్యవసాయ రుణాల కేటాయింపు కొనసాగినా ఇందులో సన్నకారు, చిన్న రైతులకు చేరింది స్వల్పం. కౌలు రైతులకు, ఆదివాసీ రైతులకు చేరింది అతి స్వల్పం. మొత్తం వ్యవసాయ రుణాల ఖాతాలలో రూ. 2లక్షలకు లోపు ప్రత్యక్ష రైతు రుణ ఖాతాలు 68 శాతం ఉండగా 2013 నాటికి 44 శాతానికి తగ్గిపోయాయి. రూ. 10లక్షల లోపు, పైన రైతు రుణ ఖాతాలు అదే సమయంలో 21 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగాయి. కొద్దికాలం క్రితం వరకు ప్రాధాన్యతా రంగంలోని వ్యవసాయ రంగానికి 18 శాతం కేటాయింపులు ఉండగా అందులో సన్నకారు, చిన్న రైతులకు 8 శాతం ఇవ్వవలసి ఉంది. కానీ ఆచరణలో వారికి దక్కినది సుమారు 5 శాతం మాత్రమే.  వ్యవసాయ ఆధారిత చక్కెర ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్‌ మిల్లులు, నూనె మిల్లులు మున్నగు ప్రాసెసింగ్‌ యూనిట్లకు వాటిని సరఫరా చే సే పంపిణీదారులకూ, వ్యాపారవేత్తలకూ అందజేస్తున్న రుణాలను పరోక్ష వ్యవసాయ రుణాలుగా పేర్కొంటూ వేలకువేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు.  2013 నుంచి 2 కోట్ల రూపాయల లోపు కార్పొరేట్లకు, పార్టనర్‌షిప్‌ ఫారమ్స్‌కు, ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌లకు ఇచ్చే రుణాలను కూడా ప్రత్యక్ష వ్యవసాయ రుణం క్రింద చూపించడం పరిపాటైంది.

తాజాగా నీతి ఆయోగ్‌ సిఫార్సును అనుసరించి రిజర్వుబ్యాంక్‌ ప్రత్యక్ష, పరోక్ష వ్యవసాయ రుణాల మధ్య విభజన రేఖను చెరిపి వేసింది. పర్యవసానంగా సన్నకారు, చిన్నరైతులు, కౌలు రైతులకు రుణాలు అందటం భవిష్యత్తులో మరింత కష్టమవుతుంది. కౌలు రైతులకు, సన్న చిన్నకారు రైతులకు రుణాలు అందిం^è డానికి రైతుమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ అర్హత కార్డులను కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించినా బ్యాంకులు కుంటిసాకులు చెబుతూ రుణాలు అందించేందుకు తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో 16.5 లక్షల కౌలు రైతులు ఉండగా, ఇప్పటికి 5 లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చి, కేవలం రూ. 240 కోట్లను లక్ష మంది కౌలు రైతులకు బ్యాంకులు ఇచ్చాయి. వాటన్నింటి పర్యవసానంగానే మొత్తం వ్యవసాయ రుణాలలో వడ్డీ వ్యాపారుల నుంచి పొందిన రుణ శాతం 1992లో 17.5 శాతం ఉండగా 2013 నాటికి 29.6 శాతానికి పెరిగింది. దేశ వ్యాప్తంగా అందించిన వ్యవసాయ రుణాలలో 25 శాతం పట్టణాలు, మెట్రోపాలిటన్‌ నగరాలలో ఉన్న బ్రాంచిల ద్వారా ఇస్తున్నారు. అలాగే నేరుగా సన్న, చిన్న రైతులతో సహా సాధారణ రైతులు, కౌలు రైతులకు వ్యవసాయ అనుబంధ వ్యాపకాల కోసం ఇవ్వవలసి ఉన్న ప్రత్యక్ష వ్యవసాయ రుణాలలో 22 శాతం నగరాలు, పట్టణాలలోని బ్రాంచిల ద్వారా బట్వాడా అవుతున్నాయంటే ఎక్కువ భాగం బ్యాంకు రుణాలు గ్రామాలలోని సాధారణ రైతాంగానికి అందటం లేదన్నది సుస్పష్టం. ఫలితంగానే 1992 నుంచి 2011 వరకు 20 సంవత్సరాలలో దాదాపు 150 లక్షల మంది రైతులు వ్యవసాయ రంగాన్ని వదిలిపోయారు. దేశ వ్యాప్తంగా సగటున వంద రైతు కుటుంబాలలో 52 శాతం రుణభారంతో ఉండగా, తెలంగాణ 89, ఆంధ్రప్రదేశ్‌ 92 శాతాలతో అగ్రభాగాన ఉన్నాయన్న విషయం మరిచిపోరాదు.

దేశవ్యాప్తంగా (బ్యాంకులు, సహకార బ్యాంకులు) ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 43.7 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగం నుంచి వస్తూ ఉండగా, 56.3 శాతం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తీసుకోవలసి వస్తుందన్నది యధార్థం. అందువలన బడ్జెట్‌లో రూ. 10 లక్షల కోట్లకు పెంచినట్లు ప్రకటిస్తే సరిపోదు. కచ్చితంగా బ్యాంకు గడప ఎక్కే ప్రతి ఒక్క రైతుకు నూటికి నూరుపాళ్లు అతని ఆధార్‌ సమాచారంతో సాగు వివరణలను పరిగణనలో ఉంచుకొని, వ్యవసాయ అనుబంధ వ్యాపకాలను సకాలంలో స్వల్పకాలిక పంట రుణాలను, మధ్య–దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలను అందించవలసిన బాధ్యత ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది. అలాగే అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది.

కొనసాగుతున్న బలవన్మరణాలు
వ్యవసాయం ‘రిస్క్‌’తో కూడుకున్నది కాబట్టి రైతులకు రుణాలు ఇవ్వడంలో స్థానిక బ్యాంకు శాఖలు చూపుతున్న అలక్ష్య ధోరణికి రిజర్వుబ్యాంక్‌ అడ్డుకట్ట వేయాలి. కొన్ని ప్రముఖ  పారిశ్రామిక–వాణిజ్య సంస్థల ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేవని తెలిసినా వందల, వేల కోట్ల రూపాయలు నూతనంగా మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలో చిక్కుకుని అధిక వడ్డీలతో తలదాకా మునిగిపోతున్న లక్షలాది మంది రైతులకు ఆ రుణాలను బ్యాంకులకు బదలీ చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా (2014లో) మహారాష్ట్రలో 4,004, తెలం గాణలో 1,347, మధ్యప్రదేశ్‌లో 1,198, ఛత్తీస్‌గఢ్‌లో 954, ఆంధ్రప్రదేశ్‌లో 916, తమిళనాడులో 606 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. దేశ వ్యాప్తంగా 12,601 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్‌ బ్యూరో వెల్లడించింది.

ఈ బలవన్మరణాల పరంపరను నిరోధించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి కారణాలు, పరిష్కారాలు చెప్పిన స్వామినాథన్‌ నివేదికను అమలు చేయడం నేటి అవసరం. కాబట్టి మళ్లీ కమిటీని నియమించి, అది ఇచ్చే నివేదిక కోసం వేచి ఉండడం వ్యర్థం. మోదీ ప్రభుత్వానికి రైతాంగం పట్ల శ్రద్ధాసక్తులు ఉన్నాయి. రైతుల ఆదాయాన్ని స్థిర ధరల సూచీతో పరిగణించినప్పుడు రెట్టింపు కావాలంటే కచ్చితంగా స్వామినాథన్‌ సిఫారసుల అమలే శరణ్యం. 1970 నాటి ధరలతో పోలిస్తే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇప్పటికి 22 రెట్లు మాత్రమే పెరిగాయి. అదే ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు సుమారు 150 రెట్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయుల వేతనాలు దాదాపు 125 నుంచి 175 రెట్లు పెరిగిన వాస్తవాలు కళ్ల ముందు ఉన్నాయి. ఇక పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు తమకు లభించే జీతభత్యాలను, ఇతర సౌకర్యాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. అయినా సమాజంలో ముఖ్య భాగమైన రైతులపట్ల చూపుతున్న అశాస్త్రీయ, అన్యాయ పూరితమైన వివక్షను భారత రైతాంగం ఇంకా సహిస్తూ మిన్నకుండలేదన్న వాస్తవాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి.

వడ్డే శోభనాద్రీశ్వరరావు
(వ్యాసకర్త మాజీ వ్యవసాయ మంత్రి)   ఈమెయిల్‌: vaddesrao@yahoo.com


 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement