నా కథా ప్రపంచం | My story World kaluvakolanu sadhanandam | Sakshi
Sakshi News home page

నా కథా ప్రపంచం

Oct 17 2016 12:43 AM | Updated on Sep 4 2017 5:25 PM

నా కథా ప్రపంచం

నా కథా ప్రపంచం

కథ, నవల, గేయం, బాలసాహిత్యం, చిత్రలేఖనం- ఇత్యాది ప్రక్రియలలో నా రచనా వ్యాసంగం ఏభై ఏళ్లకుపైగా కొనసాగింది

అంతరంగం
కథ, నవల, గేయం, బాలసాహిత్యం, చిత్రలేఖనం- ఇత్యాది ప్రక్రియలలో నా రచనా వ్యాసంగం ఏభై ఏళ్లకుపైగా కొనసాగింది. పిల్లల కథలు పక్కనపెడితే, కథానికలు మాత్రం మంచివీ, చెత్తవీ, గొప్పవీ అన్నీ కలిపి 150 వరకూ రాశాను. వాటిలో కొన్ని ఇదివరలో సంపుటాలుగా వచ్చాయి. తొలి సంపుటి ‘రక్తయజ్ఞం’ ఎనిమిది కథలతో 1965లో, రెండవ సంపుటి ‘పైరు గాలి’ పది కథలతో 1968లో, మూడవ సంపుటి ‘నవ్వే పెదవులు, ఏడ్చేకళ్లు’ పన్నెండు కథలతో 1975లో, నాలుగో సంపుటి ‘రంగు రంగుల చీకటి’ పదహారు కథలతో 1995లో ప్రచురించబడినాయి.
 
పెద్దవీ, చిన్నవీ, చాలా చిన్నవీ, మొత్తం 20 కథలతో ఉన్న ఈ సంపుటి ఐదవది. వెనకటి నాలుగు సంపుటాలలో కనిపించని కథలివి. అనేక కథలలోంచి సామాజిక స్పృహ నిండుగా తొణికిసలాడే కొన్నిటిని ఏరి ఈ సంపుటిని కూర్చాను. నా మొట్టమొదటి కథనుండీ నేటి చిట్టచివరి కథ వరకూ కాలక్రమానుసారంగా వీటిని పేర్చాను.
 
కథ రాయటమన్నది తెలుగు రచయితకు వృత్తి కాదు. సమాజానికి హానికరం కాని ఓ ప్రవృత్తి మాత్రమే. ఆర్థిక విలువలకు తప్ప మరిదేనికీ ప్రాధాన్యతనివ్వలేని వారి దృష్టిలో రచయిత వెచ్చించే కాలమంతా వ్యర్థమైనదే! ఈ ‘యుగ’ లక్షణం తెలిసికూడా నూటికో, కోటికో ఒక్కరు సాహిత్యార్చనతో భవసాగరాన్ని ఈదేస్తున్నారు. వీళ్లే పోతన్నలు, తులసీదాస్‌లు, కబీర్‌లూ! ఆ సాధనలో వాళ్లు పొందే ఆత్మానందమే వారికి అత్యున్నత పదవులు, అత్యధిక సంపదలూ! ‘‘కథలు రాస్తే ఒరిగేదేముంది? అవి చదివితే కడుపు నిండుతుందా? కాలు నిండుతుందా?’’ అని గేలి చేసే కాంచనదాసుల్ని నేనెరుగుదును.

కడుపు నిండక పోవచ్చుగాక, మంచి కథ చదివితే కొందరికైనా మనసు పండుతుందని మనసున్నవాడు, మనిషన్నవాడు నిక్కచ్చిగా చెప్పగలడు. డబ్బుతో ఏమాత్రం పోల్చదగని చిత్త సంస్కారం అలవడటానికి గల కారణాలలో మంచి పుస్తకాలు చదవటం ప్రముఖమైనదని మేరుపర్వతమంత ఎత్తులకెదిగిన మహానుభావులే చెబుతుంటారు. కనుక, ఒకింత మంచి కథో, కవిత్వమో రాసుకోవటంలోనో, వాటిని చదువుకోవటంలోనో విలువైన కాలాన్ని ఎంతోకొంత వెచ్చించేవాళ్లందరూ ధన్యులే!
 
ఏమీ ఒరగబెట్టకపోయినా, మానవత్వం గురించీ, మంచిసమాజం గురించీ కలలు గనటానికైనా ఈ కథలు దోహదపడతాయి. ఆమాత్రం కనిష్ఠ ప్రయోజనం చాలు. కల ఏనాటికైనా ఫలిస్తుందన్న ఆశే కదా మనకు ఊపిరి!
 
(సదానంద కొత్త కథల సంపుటి ‘పరాగభూమి’  ఇటీవలే విడుదలైంది. పేజీలు: 220; వెల: 150; ప్రతులకు: పలమనేరు మిత్రసాహితి, 6-219, గుడియాత్తం రోడ్డు, పలమనేరు-517408, చిత్తూరు.)
కలువకొలను సదానంద
7799879477

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement