విలువలు వదిలేసిన విద్యా శాఖ | Sakshi
Sakshi News home page

విలువలు వదిలేసిన విద్యా శాఖ

Published Fri, Oct 7 2016 1:34 AM

Educational department has no values of education

 అభిప్రాయం
రెండు తెలుగు రాష్ట్రాల విద్యాశాఖలు తమ, తమ విధ్యుక్త ధర్మ నిర్వహణలో ఘోరంగా విఫలం చెందుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను సహితం ఆచరణలో పెట్టలేక, ప్రైవేటు విద్యా సంస్థలతో ఉన్న అవినాభావ అనుబంధంతో వారిని ఏమీ అనలేక ప్రజల దృష్టిలో విద్యాశాఖ చేతగాని, చేవలేని శాఖగా మిగిలి పోతూందంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురిస్తే, సగటు పౌరుల జీవనం అస్తవ్యస్తమైనప్పుడు విద్యాశాఖతో పని లేకుం  డానే ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేస్తూ రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఖచ్చితంగా అమలు చేయమని ఆదేశించింది.
 
 ఈ ఆదేశాలను మాధ్యమాల్లో చూసి సెలవు ఇచ్చిన విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు పాటించాయే తప్ప విద్యా శాఖను ఏమాత్రం లెక్క చేయని విద్యా సంస్థలు నడుము లోతు నీళ్ళలో సహితం పాఠశాలలు నడిపించపూనుకున్నాయి. ఏకంగా ఓ పాఠశాల అయితే స్కూలు బస్సును ప్రవాహంలాంటి నీళ్లలో 40మంది పిల్లల్ని రవాణా చేయబూనుకుంది. కాలనీవాసులు అడ్డుకోవడంతో పిల్లల ప్రాణాలకు ముప్పు తప్పింది కానీ, విద్యాశాఖ మాత్రం అచేతనంగా మారింది.
 
 ఇక ఏకంగా పాలక పార్టీ శాసనమండలి సభ్యుడు తన పాఠశాలను యథేచ్ఛగా నడిపిస్తుంటే పిల్లల హక్కుల సంస్థలు ఆధారాలతో విద్యాశాఖకు ఫిర్యాదు చేసినా అతడి స్కూలు వైపు చూసిన పాపాన పోలేదు. ఇక కార్పొరేటు స్కూళ్లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నా తెలంగాణా ప్రాంతంలో ఆ స్కూళ్లను పాలకపార్టీ ముఖ్య నేత ఒకరు సొంతం చేసుకుంటున్నారనే వదంతి ఉండ టంతో ఆ పాఠశాలలో పిల్లల హక్కుల ఉల్లంఘన జరు గుతున్నా, పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, లైంగిక వేధింపులకు గురౌతున్నా మన విద్యాశాఖ కళ్లు మూసుకొని కూర్చుందే తప్ప ఏమీ అనలేకపోయింది.
 
 పాలక రాజకీయ పార్టీలకే పాఠశాలలు, కళాశాలలు అధికంగా ఉండటంతో ఏమంటే ఏం ముంచుకోస్తుందో మనకెందుకులే అనే విధానాన్ని పాటిస్తున్న విద్యాశాఖ కళ్లున్నా చూడలేని, చెవులున్నా వినలేని, కాళ్లున్నా నడవలేని, చేతులున్నా చేతగాని వ్యవస్థగా మారింది. పాఠశాలల్లో పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో స్కూలు భవనాలు, ఫైర్ మొదలు కొని ఎలాంటి రక్షణా కరువైన పాఠశాలల నిర్వహణ, విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి బదిలీ సర్టిఫికేట్లు ఇవ్వడం, ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం ప్రవేశ పరీక్షలు, టాలెంట్ టెస్ట్‌లు నిర్వహించడం విద్యా శాఖ నిర్లిప్తతకు, చేవలేనితనానికి అద్దం పడుతోంది.
 
ఇలా విద్యాశాఖ  నామమాత్రపు శాఖగా మారిపో యినపుడు, అధికారగణం, ఉద్యోగులు, కార్యాలయాలు హంగూ, ఆర్భాటాలు అన్నీ అలంకారప్రాయంగానే మారి, విద్యాశాఖ మనుగడే ప్రశ్నార్థకంగా, మారక ముందే అధికారులు మేల్కొంటే విద్యార్థులకు కొంత మేలు జరగవచ్చు.
 - అచ్యుతరావు
 వ్యాసకర్త రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు  
 మొబైల్ : 93910 24242

Advertisement
Advertisement