ఆస్ట్రేలియా బోగస్ వీసాలపై అప్రమత్తంగా ఉండాలి | Australia Trs president kasarla nagendarreddy expains about fake visas | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా బోగస్ వీసాలపై అప్రమత్తంగా ఉండాలి

Aug 5 2017 5:01 PM | Updated on Sep 11 2017 11:21 PM

ఆస్ట్రేలియా బోగస్ వీసాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి సూచించారు.



సిడ్నీ: ఆస్ట్రేలియా బోగస్ వీసాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి సూచించారు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగాలతోపాటు విద్య, ఉపాధి అవకాశాలు ఆస్ట్రేలియాలో ఘననీయంగా ఉన్నాయన్నారు. ఈ కారణంగా నెలకొన్న డిమాండ్ ని సొమ్ము చేసుకోవాలని కొందరు నకిలీ ఏజెంట్లు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వర్క్ పర్మిట్ ల పేరుతో నకిలీ పత్రాలతో విచ్చలవిడిగా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల పరిసర ప్రాంతాల్లో కొందరు నకిలీ ఏజెంట్లు ఆస్ట్రేలియా వీసాలు, వర్క్ పర్మిట్ ల పేరున మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియాలోని వివిధ కంపెనీల పేరుమీద సొంతంగా జాబ్ ఆఫర్ లెటర్ లు ముద్రించి ఉపాధి కోసం యత్నిస్తున్న యువకుల్ని లక్ష్యంగా చేసుకొని లక్షల్లో డబ్బులు వసూలు చేసి, కుంటి సాకులు చూపిస్తున్నారని తెలిపారు. నెలలు గడుస్తున్నా, ఏ విధమైన పురోగతి లేకుండా వారి ఆఫీసుల వెంబడి తిప్పుకుంటారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆస్ట్రేలియాలోని సదరు కంపెనీలను సంప్రదించగా ఇవ్వన్నీ ఫేక్ ఆఫర్ లెటర్లని తెలిసిందని, యాజమాన్యాలకు తెలియజేసి వారి వెబ్ సైట్ లో ఇలాంటి బూటకపు ప్రకటనలను, ఏజెంట్లను నమ్మవద్దని ఒక సందేశాన్ని కూడా పొందుపరిచేలా ఏర్పాటు చేశామన్నారు.

ఒక ముఠాగా ఏర్పడిన కొందరు నకిలీ ఏజెంట్లు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దందా జరుగుతుందన్నారు. పూర్వపు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో తమ ఏజెంట్ల ద్వారా నకిలీ ఆఫర్ లెటర్లు చూయించి ఒక్కొక్కరి నుంచి విడదల వారీగా దాదాపు ఆరు లక్షల రూపాయలు వసూలు చేసి, వారిని నమ‍్మించేందుకు పాసుపోర్టు జిరాక్సులు తీసుకొని, ప్రక్రియ మొదలైందని మాయమాటలు చెప్తూ కాలం వెల్లదీస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పంపిస్తున్నామని కొందరిని నమ్మించి సముద్రమార్గం ద్వారా మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాలకు పంపి కొన్ని నెలలపాటు నివాసయోగ్యం కాని ఇరుకు గదుల్లో ఉంచుతారని తెలిపారు. చివరకు చేతి ఖర్చులకు సైతం తెచ్చుకున్న డబ్బును సైతం స్వాహా చేస్తే పరాయి దేశాల్లో ఫుట్ పాత్ లపై జీవనం సాగించి, జైలు జీవితం గడిపి అష్టకష్టాలు పడి చివరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి ఇంటికి చేరుకున్న సందర్భాలున్నాయని వివరించారు.

ఆస్ట్రేలియాతోపాటు అన్ని ముఖ్యమైన యూరప్ దేశాలకు కూడా ఇలాంటి నకిలీ వీసాల ఆశ చూయించి మోసాలకు పాల్పడుతున్నారని ఆస్ట్రేలియా టీఆర్ఎస్ బృందం వెల్లడించింది. నైపుణ్యం కలిగిన వృత్తి, విద్య కోర్సుల ద్వారా గాని, ఉన్నత చదువుల కోసం గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలకు అప్లయ్ చేసుకోసుకుని పొందిన వీసాల ద్వారానే నిభందనలమేరకు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంతే కానీ ఇలా పాసుపోర్టు జిరాక్సుల ద్వారా వీసాలు పొందే ప్రక్రియ అసలే లేదని, అలాంటి నకిలీ ఏజెంట్ల మోసాలకు బలై డబ్బుతో పాటు ప్రాణాలకు హాని తెచ్చుకోవద్దని కాసర్ల నాగేందర్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement