
జోరు తగ్గిన జెండాల వ్యాపారం
నగరంలో ఎన్నికల మూడ్ కనిపించడం లేదు. ప్రతిసారి జెండాలు, బ్యానర్లు, టోపీలు. స్కార్ప్‌లు, స్టిక్కర్లు, మాస్క్‌లతో హోరెత్తించే వివిధ పార్టీల నాయకులు ఈసారి వాటి జోలికి పెద్దగా వెళ్లడం లేదు
నగరంలో ఎన్నికల మూడ్ కనిపించడం లేదు. ప్రతిసారి జెండాలు, బ్యానర్లు, టోపీలు. స్కార్ప్‌లు, స్టిక్కర్లు, మాస్క్‌లతో హోరెత్తించే వివిధ పార్టీల నాయకులు ఈసారి వాటి జోలికి పెద్దగా వెళ్లడం లేదు. దీంతో ఎన్నికల ప్రచార సామగ్రి వ్యాపారం చేసేవారిలో నైరాశ్యం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్‌పీ తదితర పార్టీల జెండాలు, బ్యానర్ల నమూనాలతో ఈ దుకాణాలు నిండి ఉన్నప్పటికీ ఆర్డర్లిచ్చే వారు కనిపించడం లేదు. ఎన్నికల తేదీ సమీపిస్తున్నా బేరసారాలు ఊపందుకోలేదని దుకాణదారులు అన్నారు. ఇందుకు కారణం అభ్యర్థుల వ్యయంపై ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలని వారు చెప్పారు. ఎన్నికలనగానే బ్యానర్లు, జెండాల కోసం తమ దగ్గరకు పరుగెత్తుకు వచ్చే రాజకీయ నేతలు ఈసారి మాత్రం ఆర్డర్లు జారీచేయడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసినా పెద్ద రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎవరూ తమకు ఇంత వరకు భారీ ఆర్డరు జారీ చేయలేదన్నారు.
పాతికేళ్లలో ఈ పరిస్థితి చూడలేదు
పాతికేళ్ల వ్యాపారానుభవంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని , ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నా వ్యాపారం మందకొడిగా సాగుతోందని ఆల్ ఇండియా ఎలక్షన్ మెటీరియల్ ట్రేడర్స్ అసోసియేషన్ చైర్మన్ గుల్షన్ చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సదర్ బజార్ నుంచి ప్రచార సామగ్రి వెళుతుందని , కానీ ఈసారి మాత్రం పొరుగు రాష్ట్రాల మాట అటుంచినా, ఢిల్లీ నేతల నుంచి కూడా ఆర్డర్లు రావడం లేదని ఆయన చెప్పారు. గతంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు సగానికి తగ్గాయని తెలిపారు. గతంలో ఎన్నికలు వచ్చినప్పడల్లా షీలా దీక్షిత్, యోగానంద శాస్త్రి, హరూన్ యూసఫ్, విజయ్ గోయల్‌తో పాటు పలువురు నేతలు ప్రచార సామగ్రి కోసం తమ ఫ్యాక్టరీకే ఆర్డర్లు ఇచ్చేవారని చెప్పారు. గతంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు సగానికి తగ్గాయన్నారు. ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలతో పాటు టెక్నాలజీ విస్తృత వినియోగం వల్ల తమ బేరాలు తగ్గాయని సురేష్ అనే మరో వ్యాపారి వాపోయారు. రేడియో, సామాజిక అనుసంధాన వేదికల ద్వారా ఓటర్లను ముఖ్యంగా యువతను ఆకట్టుకోవచ్చుననే విషయాన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు గుర్తించారని, దీంతో బ్యానర్లు, జెండాల వంటి ప్రచార సామగ్రి వాడకం తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రచార సామగ్రిని తానే తయారు చేసుకుంటోందని తెలిపారు.