కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం

కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం - Sakshi


మున్సిపల్ కార్మిక నేతలకు విపక్ష నేత వైఎస్ జగన్ భరోసాఅనంతపురం: మున్సిపల్ కార్మికులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు నాలుగు రోజుల్లోగా పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తామంటూ విపక్ష నేత ఇచ్చిన అల్టిమేటమ్ అనంతరం కార్మికుల సమ్మెకు ప్రభుత్వం తలొగ్గిన నేపథ్యంలో కార్మిక జేఏసీ నేతలు ఆదివారం వైఎస్ జగన్‌ని కలసి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా గుడిబండ మండలంలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జగన్‌ను కలసి మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు.మున్సిపల్ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని, ప్రతిపక్ష నేతగా వారి పక్షాన నిలబడి అల్టిమేటం జారీ చేయడంతోనే ప్రభుత్వం దిగివచ్చిందంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నపుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే.. ‘అనంత’లో మీరు చేసిన హెచ్చరికలతో వారి సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చింది. ఇప్పుడు మున్సిపల్ కార్మికుల సమస్యలపై కూడా ‘అనంత’లో జారీ చేసిన అల్టిమేటంతోనే పరిష్కారమయ్యాయి. ‘రాష్ట్రవ్యాప్త కార్మికులు మీ మేలును మర్చిపోరు’ అని అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లు రెగ్యులరైజ్ చేయాలని విన్నవించారు. తప్పకుండా పరిశీలిస్తామని, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.ఆస్పత్రి ఏర్పాటుకు చొరవ చూపండి

‘అనంత’లో ఈఎస్‌ఐ క్లీనిక్ మాత్రమే ఉందని, అంతకుమించి ఏర్పాట్లు లేకపోవడంతో చిన్న జబ్బు వచ్చినా రూ.2-3 వేలు ఖర్చవుతోందని కార్మికులు జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అన్ని సౌకర్యాలతో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్మించేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ అందరికీ నాణ్యమైన వైద్యం అందించారని, ఇప్పుడు ఏ సాకు చూపించి రేషన్‌కార్డు తీసేస్తారో...ఆరోగ్యశ్రీ ఎక్కడ వర్తించదో అనే ఆందోళన కార్మికుల్లో ఉందని, కాబట్టి ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు చొరవ చూపించాలని విన్నవించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top