ట్యాపింగ్ కింగ్ బాబు!

ట్యాపింగ్ కింగ్ బాబు!


ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలు

ఈ-మెయిల్స్‌ను బయటపెట్టిన వికీలీక్స్


 

హైదరాబాద్: టెలిఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీకోసం ఏపీ ప్రభుత్వం 2015 జనవరినుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు అంతర్జాతీయ ఖ్యాతిపొందిన వికీలీక్స్ వెల్లడించింది. ట్యాపింగ్‌కు వినియోగించే హార్డ్‌వేర్ ఇంటర్‌సెప్టర్ ఉపకరణాల కొనుగోలుకు ఏపీ ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ ఇటలీకి చెందిన హ్యాకింగ్‌టీమ్ సంస్థతో గత జనవరిలోనే సంప్రదింపులు జరిపినట్టు వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా రూ.7.5 కోట్లు వెచ్చించి ఈ టెక్నాలజీని కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వికీలీక్స్ ద్వారా స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే... ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్ సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని విక్రయించే సంస్థలు అంతర్జాతీయంగా అనేకం ఉన్నాయి. అందులో ఇటలీలోని మిలన్‌కు చెందిన హాకింగ్ టీమ్ ఒకటి.ఈ సంస్థకు చెందిన 10 లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఆ మెయిల్స్‌ను లోతుగా పరిశీలించినప్పుడు ట్యాపింగ్ టెక్నాలజీకోసం బాబు సర్కారు తీవ్రంగా ప్రయత్నించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఓట్లుకు కోట్లు కుంభకోణం వెలుగులోకి వచ్చాక దాన్నుంచి తప్పించుకునేందుకు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపిం చడం, కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతీ తెలిసిందే. అయితే అంతకుముందే... ఈ ఏడాది జనవరిలోనే ట్యాపింగ్ టెక్నాలజీ సమకూర్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ హ్యాకింగ్‌టీమ్‌తో ఆ మేరకు ఈమెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఓటుకు కోట్లు కుంభకోణం వెల్లడయ్యాక ఏపీ ప్రభుత్వం ఈ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అత్యవసరంగా ట్యాపింగ్ టెక్నాలజీని సమకూర్చుకునే బాధ్యతను ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగానికి అప్పగించింది.ఇంటెలిజెన్స్ విభాగం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్-7లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థను ఆశ్రయించింది. ఇంటెలిజెన్స్ విభాగం ఆర్డర్ మేరకు హ్యాకింగ్‌టీమ్.కామ్ సంస్థకు చెందిన సింగపూర్ రిప్రజెంటేటివ్ కార్యాలయం చీఫ్ డేనియల్ మగ్లీటాతోతో ఓర్టస్ డెరైక్టర్ ప్రభాకర్ కాసు జూన్ 9న బేరసారాలు ప్రారంభించారు. ట్యాపింగ్ టెక్నాలజీ పనితీరు, ధరలపై జూన్ 9 నుంచి జూలై 2 వరకూ 39 సార్లు మగ్లీటాతో సంప్రదింపులు జరిపారు. 25 నుంచి 50 సెల్‌ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు టెక్నాలజీ కావాలని హ్యాకింగ్‌టీమ్‌కు ఆర్డరు చేశారు.ఏ అవసరాలకోసం తాము దాన్ని వినియోగించాలనుకుంటున్నామో ఈమెయిల్‌కు జతచేశారు. ధర ఎంతో చెబితే.. తన క్లయింట్ (ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు)కు చెప్పి ఒప్పిస్తానంటూ డేనియల్‌కు ప్రభాకర్ చెప్పారు. హ్యాకింగ్‌టీమ్‌నుంచి ఇతర టెక్నాలజీకూడా కొనుగోలు చేసేందుకు యత్నిస్తానని హామీ ఇచ్చారు. వీరిమధ్య అనేకసార్లు ఫోన్ల ద్వారా, స్కైప్‌లో మాట్లాడినట్టు వికీలీక్స్ బయటపెట్టిన మెయిల్స్ ద్వారా తెలుస్తోంది. ప్రాథమికంగా 1 నుంచి 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.7.5కోట్లు) అవుతుందని డేనియల్ మగ్లీటా తేల్చారు. దీంతో తన క్లయింట్‌కు టెక్నాలజీ పనితీరుపై అవగాహన కల్పించడానికి (డెమాన్‌స్ట్రేషన్) హైదరాబాద్‌కు రావాలని మగ్లీటాను ప్రభాకర్ కోరారు. ఈ విషయమై జూన్ 16,17 తేదీల్లో ప్రభాకర్‌రెడ్డి, మగ్లిట్టా స్కైప్‌లో మాట్లాడుకున్నారు. ఆ మేరకు జూలై 7న తాను హైదరాబాద్‌కు రావడానికి ఏర్పాట్లు చేసుకున్నానని మగ్లీటా చెప్పారు. ‘హైదరాబాద్‌లో ఏ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నారు.. జూలై 7న ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు కలుద్దాం.. అక్కడే క్లయింట్‌కు డెమాన్‌స్ట్రేషన్ ఇవ్వవచ్చు’ అంటూ మగ్లీటాకు ప్రభాకర్ సూచించారు. ఇక్కడికి రావడానికి అవసరమైన వీసా ఏర్పాట్లపై ప్రభాకర్ వారికి సూచనలు, ఇవ్వడమే కాకుండా ఆహ్వాన పత్రం పంపించారు. ఈ మేరకు సింగపూర్‌నుంచి బయలుదేరి జూలై 6 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో ఉంటామని మగ్లీటా చెప్పారు. హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో వీరి మధ్య సంప్రదింపులకు ఏర్పాట్లు జరిగాయి. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలోని అధికారులకు హ్యాకింగ్‌టీమ్ డెమాన్స్‌స్ట్రేషన్‌కు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ సమావేశం జరిగిందా? లేదా? అన్న వివరాలు బయటకు రాలేదు. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులు కోసం ఓర్టస్ డెరైక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి హ్యాకింగ్‌టీమ్‌తో జూన్ 9 నుంచి జూలై 2 వరకు జరిపిన లావాదేవీలకు సంబంధించిన  ఈ-మెయిల్స్‌ను వికీ లీక్స్ బయటపెట్టింది. ఏమిటీ హ్యాకింగ్‌టీమ్?: ఇటలీలోని మిలన్ కేంద్రంగా హ్యాకింగ్‌టీమ్ సంస్థ పనిచేస్తోంది. తీవ్రవాదులు, ఉగ్రవాదులు సంఘవిద్రోహక శక్తుల ఆటకట్టించడానికి లా ఎన్‌ఫోర్సింగ్ ఏజెన్సీలకు, ప్రైవేటు సంస్థలకు అత్యాధునిక ట్యాపింగ్ టెక్నాలజీను ఈ సంస్థ విక్రయిస్తుంది. దీనిద్వారా ఫోన్లను ట్యాప్‌చేయడం, ఈమెయిళ్లను హాక్ చేయడంతోపాటు కంప్యూటర్లలోని మైక్రోఫోన్, కెమెరాలను రహస్యంగా యాక్టివేట్ చేయవచ్చు. ఈ సంస్థకు అమెరికాలోని అనాపోలిస్, సింగపూర్‌లో బ్రాంచీలు ఉన్నాయి. సింగపూర్ కార్యాలయానికి మగ్లీటా చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ఇచ్చే టెక్నాలజీ ద్వారా ఫోన్‌కాల్స్, ఎస్సెమ్మెస్,  ఫోటోలతోపాటు ఫేస్‌బుక్, ఈ మెయిల్స్, ట్విటర్, వ్యాట్సప్, స్పైప్... ఒకటేమిటి సమస్త సమాచారాన్ని ట్యాప్ చేయవచ్చు. వికీలీక్స్ చెప్పిన సమాచారం మేరకు ఈ సంస్థ లెబనీస్ సైన్యం, సూడాన్, బహ్రెయిన్‌లకూ ట్యాపింగ్ టెక్నాలజీని విక్రయించినట్లు స్పష్టమైంది. 

 

 ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడానికి?


 తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలను అడ్వాన్సుగా ఇస్తోన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని మే 30న తెలంగాణ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాక... ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తమ ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలున్నాయని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అదేసమయంలో అలాంటి టెక్నాలజీ కోసం అగమేఘాలపై సంప్రదింపులు జరపడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం సెల్యూలార్ ఇంటర్‌సెప్షన్ హార్డ్‌వేర్ సొల్యూషన్స్ సమకూర్చుకోవడం ద్వారా ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడానికి కుట్ర పన్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఓటుకు నోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పడ్డుపడిన తర్వాత కాలంలో ఈ ఆధునిక టెక్నాలజీ సమకూర్చుకోవడానికి ప్రయత్నించడం గమనిస్తే తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఫోన్లపై నిఘా పెట్టడానికా? లేక వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ సంభాషణల్లో అక్కడక్కడా చెబుతున్నట్టు సొంత రాష్ట్రంలో నిఘా కోసమైతే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సెల్యులార్ ఇంటర్‌సెప్షన్ హార్డ్‌వేర్ సొల్యూషన్స్ సమకూర్చమని కోరుతూనే మరోవైపు తక్షణ అవసరం కింద కీలకమైన ఒక మొబైల్ ఫోన్ ట్రాక్ చేయాలని, ప్రాధాన్యతా క్రమంలో 25 నుంచి 50 మొబైల్ లెసైన్సులను ట్రాక్ చేయాల్సి ఉంటుందని హ్యాకింగ్‌టీమ్‌కు ప్రభాకర్ పంపిన ఈ మెయిల్స్‌లో పేర్కొన్న విషయం మరింత సంచనం రేపుతోంది.

 

హ్యాకింగ్ టీమ్‌ను సంప్రదించిన ఇన్‌స్పెక్టర్

హైదరాబాద్: ట్యాపింగ్‌కు వినియోగించే హార్డ్‌వేర్ ఇంటర్‌సెప్టర్ ఉపకరణాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ గత జనవరిలోనే సంప్రదింపులు జరిపినట్టు వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ ‘రిమోట్ కంట్రోల్ సిస్టమ్’ కోసం హ్యాకింగ్ టీమ్‌ను గతంలోనే సంప్రదించినట్టు తెలుస్తోంది. ‘మేము భారత ప్రభుత్వ ఇంటలిజెన్స్ ఏజెన్సీకి చెందినవారం. రిమోట్ కంట్రోల్ సిస్టమ్‌వంటి సొల్యూషన్స్ కోసం చూస్తున్నాం. దానికి సంబంధించిన సమాచారం, దాన్ని అందించడానికయ్యే ఖర్చెంతో వివరాలు పంపండి’... అని కోరుతూ దుర్గాప్రసాద్ హ్యాకింగ్ టీమ్ సీఈవోకు ఈ-మెయిల్ పంపారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అయిన దుర్గాప్రసాద్ ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక నిఘా విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్‌లో టెక్నికల్ వింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ముష్కర మూకలపై నిఘాకు అవసరమైన సాంకేతిక పరికరాలు, ఉపకరణాలు కొనుగోలు చేయడం ఈ టెక్నికల్ వింగ్ ప్రధాన విధి. సుదీర్ఘకాలంలో సీఐ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్న దుర్గాప్రసాద్‌కు దేశవ్యాప్తంగా ఉన్న పలు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సంస్థలతో పరిచయాలు ఉన్నాయని అధికారులు ధ్రువీకరించారు. కేంద్ర హోం శాఖ అనుమతి తప్పనిసరి

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీదు చేయాలని భావించిన హార్డ్‌వేర్ ఇంటర్‌సెప్షన్ ఉపకరణం ‘సెప్టయ్యర్’ రకానికి చెందినది. ఈ తరహాకు చెందినవి ప్రస్తుతం దేశంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఆధీనంలో ఒకటి, ముంబైలోకి యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) వద్ద ఒకటి మాత్రమే ఉన్నాయి. వీటిని అధికారికంగా కొనుగోలు చేయాలంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి, ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమతిని కచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాకాకుండా కొనుగోలు చేస్తే కేంద్రం తీవ్రంగా పరిగణిస్తుంది. దేశ సరిహద్దులో నిఘా ఉంచే మిలటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎంఐబీ) కొన్నేళ్ళ కిందట జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులపై, మిలటరీలో ఉన్న ‘ఇంటి దొంగలపై’ నిఘా ఉంచడానికి హార్డ్‌వేర్ ఇంటర్‌సెప్షన్ ఉపకరణాలు అవసరమని భావించింది. కేంద్రం అనుమతి లేకుండా వాహనంలో ఉంచి ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఆయా పరిధిల్లో ఉన్న సెల్‌ఫోన్లను ట్రాక్ చేయడానికి, ఇంటర్‌సెప్ట్ చేయడానికి ఉపకరించే హార్డ్‌వేర్ ఇంటర్‌సెప్టర్ మాదిరి ఫేక్ బేస్‌స్టేషన్‌ను ఖరీదు చేసింది. ఏడాదిన్నర తరవాత ఈ విషయం గుర్తించిన సర్వీసు ప్రొవైడర్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం ద్వారా కేంద్ర హోం శాఖ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం అప్పటి జనరల్‌తోపాటు పలువురిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు సిబ్బందితోపాటు జనరల్ స్థాయి అధికారిపైనా చర్యలకు సిఫార్సు చేసింది.

 

కుట్రమయ సర్కారులకు సింహస్వప్నం!

ప్రపంచదేశాల దౌత్యసంబంధాల్లో నెలకొని ఉన్న కుట్రలు, కుయుక్తులు, అమానవీయ కార్యకలాపాలను, హక్కుల హననాలను బహిర్గతం చేసిన సంచలనం వికీలీక్స్. ప్రధానంగా అమెరికా ప్రభుత్వం అనుసరించిన కుట్రపూరిత, దుర్మార్గపు విధానాలను ధ్రువపరిచే పత్రాలను బయటపెట్టడం వికీలీక్స్ ఘనత. ప్రజాస్వామ్య యోధుడుగా పేరుపొందిన ‘జూలియన్ అసాంజ్’ ఆధ్వర్యంలోని వికీలీక్స్ భారతదేశానికి సంబంధించిన అంతర్జాతీయ వ్యవహారాలను అనేకం వెలుగులోకి తీసుకొచ్చింది. అనేక అంతర్జాతీయ ప్రముఖ పత్రికలు, వార్తాసంస్థలతోపాటు.. దేశీయంగా ‘ది హిందూ’ వంటి ఆంగ్ల దినపత్రికలు కూడా వికీలీక్స్ విడుదల చేసిన కేబుల్స్‌ను విలువైనవిగా భావించి ప్రాధాన్యతనివ్వడం తెలిసిందే. 2006లో ప్రారంభమైన వికీలీక్స్ యూరప్, ఆస్ట్రేలియా, తైవాన్, దక్షిణాఫ్రికా, అమెరికాతోపాటు వివిధ దేశాలకు చెందిన సాంకేతిక నిపుణుల, జర్నలిస్టుల, ప్రభుత్వ అధికారుల రహస్యసహకారంతో నడుస్తోంది. వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజ్ మూడేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలోనే రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు.

 

 వికీలీక్స్ కథనాలు పూర్తిగా అవాస్తవాలు: యనమల


 సాక్షి,హైదరాబాద్: వికీలీక్స్ వెల్లడించినట్లుగా కొన్ని చానళ్లలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవాలు, నిరాధారాలని ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు సింగపూర్ హ్యాకింగ్ టీమ్‌కు బాధ్యతలు అప్పగించినట్లుగా జరుగుతున్నది దుష్ర్పచారంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే కొందరు సొంత చానళ్లను అడ్డం పెట్టుకుని ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top