మెమన్ ఉరి.. సరికాదు! | we respect Suprume court judgement on yakubs death sentence, says BJP | Sakshi
Sakshi News home page

మెమన్ ఉరి.. సరికాదు!

Jul 27 2015 2:05 AM | Updated on Mar 29 2019 9:31 PM

మెమన్ ఉరి.. సరికాదు! - Sakshi

మెమన్ ఉరి.. సరికాదు!

ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై మతరంగు పులమడం సరికాదని బీజేపీ పేర్కొంది.

ఉరిశిక్షను రద్దు చేయాలని రాష్ట్రపతికి ప్రముఖుల వినతి
♦  బలహీన సాక్ష్యాధారాలపై ఉరిశిక్ష విధించారన్న జస్టిస్ కట్జూ
♦  యాకూబ్‌ను కాదు..టైగర్ మెమన్‌ను పట్టుకుని ఉరితీయాలంటూ సల్మాన్ ఖాన్ ట్వీట్
♦  మెమన్ మరణశిక్షను వ్యతిరేకించేవారివి చిల్లర రాజకీయాలు: బీజేపీ
♦  ముంబై పేలుళ్ల దోషి ఉరిపై వేడెక్కుతున్న వాతావరణం

ముంబై/న్యూఢిల్లీ: 1993 ముంబై  పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్(53) ఉరిశిక్ష వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది.

ఒకవైపు, ఈ గురువారం(జూలై 30న) ఆయన ఉరిశిక్షకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండగా.. మరోవైపు, మెమన్‌కు మరణదండన సరికాదన్న వాదన కూడా బలపడ్తోంది. న్యాయకోవిదులు, రాజకీయ నేతలు, సినీ తారలు మెమన్ ఉరికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. మెమన్‌ను ఉరితీయడం న్యాయాన్ని అవహేళన చేయడమేనంటున్నారు. అసలు సూత్రధారి యాకూబ్   మెమన్ సోదరుడు టైగర్ మెమన్ అని, ఆయన్ను పట్టుకుని ఉరితీయడం సబబని వాదిస్తున్నారు.

ఆ తీర్పును సమీక్షించి, యూకూబ్‌కు శిక్ష తగ్గింపు అవకాశాల్ని పరిశీలించాలని కోరుతున్నారు. భారత విదేశీ నిఘా విభాగం ‘రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్)’లో కీలక బాధ్యతలు నిర్వర్తించి, యాకూబ్ భారత్ రావడానికి సంబంధించిన ‘ఆపరేషన్’ను విజయవంతంగా పర్యవేక్షించిన సీనియర్ అధికారి బి.రామన్ 2007లో రాసిన ఒక వ్యాసం తాజాగా వెలుగులోకి రావడం వారి వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. ముంబై పేలుళ్లలో యాకూబ్ పాత్ర మరణశిక్షకు అర్హమైనదే అయినప్పటికీ..

దర్యాప్తునకు ఆయన సహకరించిన విధానం, మెమన్ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులను భారత్ రప్పించేందుకు ఆయన చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని శిక్ష తగ్గింపు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే  బావుండేదని రామన్ ఆ వ్యాసంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. తనకు క్షమాభిక్ష లభించే విషయంలో న్యాయపర అవకాశాలింకా ముగిసిపోనందున, ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ యాకూబ్ మెమన్ వేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది.
 
క్షమాభిక్ష ప్రసాదించండి: రాష్ట్రపతికి ప్రముఖుల వినతి
యాకూబ్ మెమన్ ఉరిశిక్షను రద్దు చేసి, ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ పలువురు న్యాయ, రాజకీయ, సినీ ప్రముఖులు ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం ఇచ్చారు. ఉరిశిక్ష రద్దుకు అవసరమైన న్యాయపరమైన అంశాలను, అంతర్జాతీయ నిబంధనలను అందులో ఉటంకించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ కాదని, మరెవరో చేసిన నేరానికి ఇతడికి ఉరిశిక్ష విధించడం సరికాదని అందులో పేర్కొన్నారు.

రక్తాన్ని చిందించడం, మనుషుల్ని బలి తీసుకోవడం వల్ల భారతదేశ ప్రతిష్ట దిగజారుతుందని.. బదులుగా క్షమాభిక్ష ప్రసాదించడం ద్వారా దేశ ఔన్నత్యం మరింత పెరుగుతుందని వివరించారు. 20 ఏళ్లకు పైగా జైల్లో గడిపారన్న కారణాన్ని చూపి ఈ కేసులోని 10 మంది ఇతర నిందితుల మరణశిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. 21 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న యాకూబ్ మెమన్ విషయంలో మాత్రం ఈ సూత్రాన్ని పాటించలేదన్నారు.

ఆ వినతి పత్రంపై మణిశంకర్ అయ్యర్(కాంగ్రెస్ నేత), శతృఘ్నసిన్హా(బీజేపీ ఎంపీ),న్యాయకోవిదులు రామ్ జెఠ్మలానీ, కేటీఎస్ తులసి, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందాకారత్(సీపీఎం), డీ రాజా(సీపీఐ), బాలీవుడ్ ప్రముఖులు నసీరుద్దీన్ షా, మహేశ్ భట్, మాజిద్ మెమన్(ఎన్సీపీ), టీ శివ(డీఎంకే), హెచ్‌కే దువా, తుషార్ గాంధీ.. తదితరులు సంతకాలు చేశారు. కాగా, మెమన్ ఉరిని వ్యతిరేకిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది.

చట్టపరమైన ప్రక్రియను పూర్తిచేసి ఈ నిర్ణయం తీసుకున్నారని, తీర్పును అంతా గౌరవించాలని సూచించింది. మరోవైపు, ‘భారతీయ అధికారులతో ఏదైనా అవగాహన అనంతరమే యాకూబ్ మెమన్ భారత్ వచ్చారా? అదే నిజమైతే, ఆ విషయం ఆయన కోర్టుకు తెలిపారా అన్నది కీలకం’ అంటూ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీటర్లో స్పందించారు.
 
ఇది న్యాయ అధిక్షేపణ: కట్జూ
యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష విధించడంలో న్యాయం దారుణంగా అధిక్షేపణకు గురైందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కెండేయ కట్జూ వ్యాఖ్యానించారు. ‘తీర్పు ప్రతిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.. మెమన్‌ను దోషిగా నిర్ధారించడానికి ఉపయోగపడిన సాక్ష్యాధారాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇతర నిందితుల వాంగ్మూలాలను, రికవరీ చేసిన వస్తువులను సాక్ష్యాలుగా తీసుకున్నారు. మనదేశంలో చిత్రవధ చేసి నిందితుల నుంచి పోలీసులు వాంగ్మూలాలను ఎలా తీసుకుంటారో అందరికీ తెలుసు.

అలాగే రికవరీ చేసిన వస్తువులనూ వారు సృష్టిస్తారు’ అని కట్జూ వ్యాఖ్యానించారు. ‘పోలీసుల చిత్రవధ ఎంత దారుణంగా ఉంటుందంటే.. దానికి తట్టుకోలేక నిందితులు దేన్నైనా ఒప్పుకుంటారు. చిత్రహింస తట్టుకోలేక జోన్‌ఆఫ్ ఆర్క్ అంతటామెనే మంత్రగత్తెనని ఒప్పుకుంది’ అని జస్టిస్ కట్జూ పేర్కొన్నారు.
 
ఔదార్యం చూపండి: మెమన్ భార్య
స్వయంగా లొంగిపోయినందున తన భర్తపై ఔదార్యం చూపి, మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని యాకూబ్ భార్య రహీ మెమన్ ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను అభ్యర్థించారు. తన భర్త అమాయకుడని, తానే స్వయంగా భారతీయ అధికారులకు లొంగిపోయారని గుర్తు చేశారు. 1993 పేలుళ్ల కన్నా ముందే, ఈద్ పండుగ జరుపుకునేందుకే తాము దుబాయ్ వెళ్లామని, అంతేకానీ పేలుళ్ల తర్వాత దేశం విడిచిపారిపోలేదన్నారు.
 
రక్షణవలయంగా నాగ్‌పూర్ జైలు
సాక్షి, ముంబై: యాకూబ్ మెమన్‌ను 30వ తేదీన నాగపూర్ జైలులో ఉరితీయనున్న నేపథ్యంలో ఆ జైలు భద్రతను క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) తన అధీనంలోకి తీసుకుంది. భద్రతలో భాగంగా 10 మంది సాయుధులైన పోలీసులు అత్యాధునిక ఆయుధాలతో జైలు లోపల, బయట అనుక్షణం కాపలాగా ఉంటారు.

ఉగ్రవాదుల మెరుపు దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వీలుగా జైలుకు రక్షణగా ఉంటారు. ఇదిలాఉండగా, ఉరితీత ఏర్పాట్లలో జైలు పరిపాలన విభాగం నిమగ్నమైంది. ఉరి శిక్ష రద్దుచేయాలంటూ జైలులో ఖైదీలు నిరహార దీక్ష చేపట్టినట్లు సమాచారం. కాగా, ఉరి తర్వాత శాంతి భద్రతలకు ముప్పువాటిల్లే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement