మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ప్రారంభం | Voting begins in Madhya Pradesh, Mizoram | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ప్రారంభం

Nov 25 2013 8:47 AM | Updated on Oct 8 2018 3:17 PM

మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ప్రారంభం - Sakshi

మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ప్రారంభం

2014 సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని భావిస్తున్న మధ్యప్రదేశ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ప్రారంభమయ్యాయి.

న్యూఢిల్లీ : 2014 సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని భావిస్తున్న మధ్యప్రదేశ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో  270 అసెంబ్లీ స్థానాల కోసం పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు రెండు రాష్ట్రాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని 51 జిల్లాల్లో మొత్తం 2,583 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 4,64,57,724 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధ్నీ, విదిష స్థానాల నుంచి బరిలోకి దిగారు. ఆయన నాయకత్వంలో ‘అభివృద్ధి’ మంత్రంతో బీజేపీ హ్యాట్రిక్ సాధించి రికార్డు నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో సీఎల్పీ నేత అజయ్ సింగ్ కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు.  ఆయన చుర్హత్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధ్నీలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


కాగా మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాల నుంచి మొత్తం 142 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష కూటమి అయిన ఎండీఏ మొత్తం 40 స్థానాల నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. రాష్ట్రంలో 1,126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 6,90,860 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 
 తొలిసారి ప్రింట్ అవుట్ విధానం...
 దేశంలోనే తొలిసారిగా మిజోరంలోని 10 నియోజకవర్గాల్లో వీవీపీఏటీ(ఈవీఎం ప్రింట్ అవుట్) విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఫలితంగా ఈవీఎంకు అమర్చిన వీవీపీఏటీ మిషన్ల ద్వారా ఓటరుకు తాను వేసిన ఓటుకు సంబంధించి ఓ ముద్రిత ప్రతి అందుతుంది. తద్వారా తాను వేసిన ఓటు సరిగా పడిందో లేదో అప్పటికప్పుడే పరిశీలించుకునే సౌలభ్యం సంబంధిత ఓటరుకు కలుగుతుంది. నాగాలాండ్‌లో సెప్టెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన ఈసీ ఇప్పుడు మిజోరంలో అమల్లోకి తెస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement