సిరియాపై ముసిరిన యుద్ధ మేఘాలు తాత్కాలికంగా పక్కకు తొలగినట్టే కన్పిస్తోంది.
-
ఏడాదిలోగా రసాయన ఆయుధాల నిర్మూలన
-
అమెరికా-రష్యా ఆరు సూత్రాల ఫార్ములా
-
యుద్ధానికి తామింకా సిద్ధమేనన్న ఒబామా
-
మానవత్వంపై నేరాలకు పాల్పడ్డ అసద్
-
ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ ధ్వజం
న్యూయార్క్/జెనీవా/వాషింగ్టన్/ఐరాస: సిరియాపై ముసిరిన యుద్ధ మేఘాలు తాత్కాలికంగా పక్కకు తొలగినట్టే కన్పిస్తోంది. సిరియా వద్ద ఉన్న రసాయన ఆయుధాలను 2014 మధ్యకల్లా తొలగిం చడమో, నిర్మూలించడమో చేసే దిశగా అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా-రష్యా అంగీకరించాయి. ఈ దిశగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జాన్ కెర్రీ, సెర్గీ లావ్రోవ్ మూడు రోజులుగా జెనీవాలో జరుపుతున్న చర్చలు శనివారం ఓ కొలిక్కి వచ్చాయి. సిరియా తన వద్ద ఉన్న రసాయన ఆయుధాల పూర్తి జాబితాను వారంలోగా అంతర్జాతీయ సమాజానికి అప్పగించడం, అవి ఉన్న ప్రాంతాలకు తనిఖీదారులకు నిర్నిరోధంగా ప్రవేశం కల్పించడం వంటి ఆరు సూత్రాలతో కూడిన రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నట్టు మంత్రులిద్దరూ సంయుక్త విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అక్టోబర్‌లో సిరియాలో శాంతి సదస్సు జరుగుతుందని ప్రకటించారు. చర్చలు అత్యంత ఫలప్రదమయ్యాయని లావ్రోవ్ అన్నారు. కానీ సిరియాపై యుద్ధానికి దిగే ప్రతిపాదనను తామింకా పక్కన పెట్టలేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ‘‘చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజానికి ఒక అవకాశం ఇవ్వదలచాం. దీన్ని కాలయాపన ఎత్తుగడగా మార్చుకునే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను ఆయన హెచ్చరించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్యకు దిగేందుకు అమెరికా, అంతర్జాతీయ సమాజం సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు సిరియాపై సైనిక చర్యకు భారత్ నుంచి సమర్థన లభించడం లేదని అమెరికా అంగీకరించింది. అసద్ మానవత్వంపై క్రూర నేరాలకు పాల్పడ్డారంటూ ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ ధ్వజమెత్తారు. సిరియా రసాయన ఆయుధాలు వాడిందనేందుకు తిరుగులేని రుజువులను నిపుణుల బృందం వచ్చే వారానికల్లా తనకు అందజేస్తుందని విశ్వాసం వెలిబుచ్చారు.