రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సహకరిస్తామని... ఢిల్లీకే కాదు ఎక్కడికైనా వచ్చి ఎవరి కాళ్లయినా పట్టుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తాం
ప్రజెంటేషన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులపై బహిరంగ చర్చకు సిద్ధమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సహకరిస్తామని... ఢిల్లీకే కాదు ఎక్కడికైనా వచ్చి ఎవరి కాళ్లయినా పట్టుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు సమాధానంగా... ‘తెలంగాణలో వాస్తవ జలదృశ్యం’ పేరిట టీపీసీసీ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో బుధవారం మూడున్నర గంటలకుపైగా జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్‌తో పాటు టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, కార్యదర్శి ఆర్.సి.కుంతియా, ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, డి.కె.అరుణ, పి.సుదర్శన్‌రెడ్డి, ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
రీడిజైన్లలో భారీ అవినీతి: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ వెనుక భారీ అవినీతి కుట్ర ఉందని ప్రజెంటేషన్‌లో ఉత్తమ్ ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో ప్రతిపాదించారని.. ఆయకట్టు ఏమీ పెంచకుండానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అంచనాలను రూ.85వేల కోట్లకు పెంచిందని చెప్పారు. ‘‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 35 వేల కోట్లతో ప్రతిపాదించారు. దానిని జూన్‌లో రూ.47వేల కోట్లకు, జూలైలో రూ.50 వేలకోట్లకు పెంచారు. నెలకోసారి అంచనా పెరుగుతుందా? ’’ అని ఉత్తమ్ నిలదీశారు. సాగునీరివ్వడానికి ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిందేనని.. అయితే ప్రజల సొమ్మును దోపిడీ చేస్తుం టే కాంగ్రెస్ సహకరించదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు పేరు రావొద్దనే..
రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 26 నెలలైందని.. ఇప్పటిదాకా వాటికి నిధులెందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే భయంతోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి టెండర్లను ఎందుకు ఎక్సెస్ రేటుకు కట్టబెట్టిందని ఉత్తమ్ ప్రశ్నించారు.
బహిరంగచర్చకు సిద్ధమా?
ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులు, సీఎం కేసీఆర్ చెప్పిన అబద్ధాలపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధమని.. మరి సీఎం కేసీఆర్ సిద్ధమా అని ఉత్తమ్ సవాలు విసిరారు.
ప్రజెంటేషన్‌కు హాజరైన టీ జేఏసీ
బుధవారం టీపీసీసీ ఇచ్చిన ప్రజెంటేషన్‌కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తెలంగాణ, ఉద్యమ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీ జేఏసీ ప్రతినిధులు జి.రవీందర్‌రావు, పిట్టల రవీందర్, గోపాలశర్మ, భూనిర్వాసితుల పోరాట సంఘం ప్రతినిధి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ అధ్యయన వేదిక కన్వీనర్ గాదె ఇన్నయ్య, అరుణోదయ విమల, తెలంగాణ ఉద్యమ వేదిక నేతలు చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ప్రజెంటేషన్‌కు ప్రతిపక్షనేత కె.జానారెడ్డి దూరంగా ఉండడం గమనార్హం. టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన ప్రజెంటేషన్‌కు జానారెడ్డి రాకపోవడంపై పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రతో ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన
రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేసేవిధంగా ఈ నెల 23న మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్లకు కాకుండా 148 మీటర్లకు ఒప్పందం చేసుకుంటే ప్రజలు శాశ్వతంగా నష్టపోతారన్నారు. మహారాష్ట్రలో ముంపు బాధితులకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చినా ఫర్వాలేదని.. దానివల్ల తెలంగాణలో 80 వేల ఎకరాలను ముంపులేకుండా రక్షించుకోవచ్చని పేర్కొన్నారు. మహారాష్ట్రతో ఒప్పందానికి నిరసనగా 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నల్లజెండాలతో, వివిధ రూపాల్లో భారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.