అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
* అయిదు రోజుల పాటు వర్షాలు
* వాతావరణ శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో అయిదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని సోమవారం హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు.
ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జగిత్యాలలో 95.1 మి.మీ, పెగడపల్లిలో 65.2, ఖమ్మం జిల్లా కొయిడాలో 81.4, కొత్తగూడెంలో 78.8, చండ్రుగొండలో 69.4 మి.మీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలో మొగుళ్లపల్లి, నర్సంపేట, ఖానాపూర్, ఆత్మకూర్ కేంద్రాల్లో 30 మి.మీ.కుపైగా వర్షపాతం నమోదైంది.
అడుగంటిన కృష్ణా... ఎండిన గోదావరి
గత ఏడాది ఇదే రోజున కృష్ణా బేసిన్‌లోని అన్ని రిజర్వాయర్లలో 340.8 టీఎంసీల నీరు నిల్వ ఉంటే సోమవారం ఉదయం నీటి పారుదల శాఖ లెక్కల ప్రకారం 167.7 టీఎంసీల నీరు ఉంది. గోదావరి బేసిన్‌లో నిరుడు ఇదే సమయంలో 40.8 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే ప్రస్తుతం 6.9 టీఎంసీలు నిల్వ ఉండటం గమనార్హం.