ఇక ఒకటే గుర్తింపు సంఘం! | Teacher unions On Sarkar Focus | Sakshi
Sakshi News home page

ఇక ఒకటే గుర్తింపు సంఘం!

Aug 10 2015 1:23 AM | Updated on Sep 3 2017 7:07 AM

ఇక ఒకటే గుర్తింపు సంఘం!

ఇక ఒకటే గుర్తింపు సంఘం!

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడంలో ముందుండాల్సిన ఉపాధ్యాయ సంఘాల నేతలే పాఠశాలలకు దూరమయ్యారు.

ఉపాధ్యాయ సంఘాలపై సర్కార్ దృష్టి
బడులను వదిలి కార్యాలయాల చుట్టూ నేతల ప్రదక్షిణలు
విద్యా శాఖలోనే ఇన్ని సంఘాలు ఎందుకు?   
తగ్గించే యోచనలో ప్రభుత్వం
ఆర్టీసీ తరహా గుర్తింపు సంఘం విధానం తెద్దామా?

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సంఘాలే ప్రాతినిధ్యం వహించేలా చేద్దామా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడంలో ముందుండాల్సిన ఉపాధ్యాయ సంఘాల నేతలే పాఠశాలలకు దూరమయ్యారు.

కొన్ని సంఘాల నేతలు రాష్ట్ర స్థాయిలో ఆన్‌డ్యూటీ సదుపాయంతో విద్యారంగ సమస్యలపై తిరుగుతుంటే.. ఆన్‌డ్యూటీ సదుపాయం లేని వారు కూడా మేము సైతం అంటూ డెరైక్టరేట్ బాట పట్టారు. ఎలాగూ పర్యవేక్షణ అధికారులు లేరు. సంఘాలకు పట్టదు. దీంతో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకునే వారు లేకుండాపోయారు. జిల్లాలు, మండల కేంద్రాల్లో మరీ దారుణం. స్కూళ్లలో తమ పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్న సంఘాల నేతలు తక్కువేనన్న అపవాదును ఉపాధ్యాయులు మూటగట్టుకోవాల్సి వస్తోంది.

సంఘాల నేతల పేరుతో దాదాపు వందల మంది టీచర్లు బడిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వమూ దీనిపై దృష్టి సారించింది. సంఘాలను కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తోంది.
 
ఇప్పటికే దృష్టిసారించిన సర్కారు...
ఉపాధ్యాయ సంఘాలపై ఇదివరకే ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంఘాల లెక్క తేల్చే కసరత్తు చేస్తోంది. 42 ఉపాధ్యాయ సంఘాలు అవసరమా? ఆర్టీసీ తరహాలో ఒక గుర్తింపు సంఘం ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల వరంగల్‌లో మరోసారి స్పష్టం చేశారు. ఇది కుదరకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని మూడు నాలుగు సంఘాలు మాత్రమే ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం చేసేలా కట్టడి చేసేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? అన్న అంశాలపై లోతైన పరిశీలన చేస్తోంది.
 
ఏయే సంఘాల్లో ఎందరు?
ప్రస్తుతం రాష్ట్రంలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు? ఏయే సంఘంలో ఎంత మంది సభ్యత్వం తీసుకున్నారన్న లెక్కలను తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఒకే ఉపాధ్యాయుడు ఐదారు సంఘాల్లో ఉండటంతో తాము ఎక్కువ సభ్యత్వం కలిగి ఉన్నామంటే తామే ఎక్కువ సభ్యత్వం కలిగి ఉన్నామంటూ చెబుతుండటం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అంటూ పాఠశాలలను వదిలి విద్యా డెరైక్టరేట్, డీఈఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

పైగా విద్యా హ క్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుడు బడి బయట ఉండటానికి వీల్లేదు. ఎలాంటి డిప్యుటేషన్లలో కొనసాగడానికి వీల్లేదు. అయినా అలా జరుగుతూనే ఉంది. అందుకే సంఘాల పేరుతో తిరుగుతున్న ఉపాధ్యాయుల విషయంలో ఓ స్పష్టమైన విధానాన్ని తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయ సంఘాల బైలాస్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒక సంఘంలోని సభ్యుడు మరో సంఘంలో ఉండకుండా కట్టడి చేసేందుకు సభ్యత్వ నమోదుకు ఆధార్ కార్డు లింకు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.
 
రాష్ట్రంలో 42 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇన్ని అవసరమా? ఇన్ని ఉండటం వల్లే సంఘాల గౌరవం ప్రశ్నార్థకం అవుతోంది.. అందుకే గుర్తింపు సంఘం ఒకటే ఉండే అంశంపై ఆలోచిస్తాం.    
- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement