జెన్‌కోకు ట్రాన్స్ కో షాక్! | Tansco again shocked to Jenco | Sakshi
Sakshi News home page

జెన్‌కోకు ట్రాన్స్ కో షాక్!

Nov 30 2013 1:40 AM | Updated on Oct 22 2018 8:31 PM

జెన్‌కోకు ట్రాన్స్‌కో మరోసారి షాక్ ఇచ్చింది. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ఏర్పాటు చేయతలపెట్టిన 20 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంటుకు విద్యుత్ సరఫరా లైన్లను (నెట్‌వర్క్) సమకూర్చలేమని తేల్చి చెప్పింది.

సాక్షి, హైదరాబాద్: జెన్‌కోకు ట్రాన్స్‌కో మరోసారి షాక్ ఇచ్చింది. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ఏర్పాటు చేయతలపెట్టిన 20 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంటుకు విద్యుత్ సరఫరా లైన్లను (నెట్‌వర్క్) సమకూర్చలేమని తేల్చి చెప్పింది. దీంతో సోలార్ విద్యుత్ ప్లాంటు ప్రతిపాదనను జెన్‌కో విరమించుకున్నట్టు సమాచారం. ఈ జిల్లాలో ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేయనున్న పవన, సోలార్ విద్యుత్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా లైన్లను ఇచ్చేందుకే జెన్‌కోను పక్కన పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో మొదటి నుంచీ జెన్‌కోను పక్కన పెడుతూనే ఉన్నారు. ట్రాన్స్‌కో నిర్వహించిన సోలార్ విద్యుత్ టెండర్లలో జెన్‌కోను పాల్గొనకుండా ప్రభుత్వ పెద్దలే ఒత్తిడి తెచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
 
  దీంతో ట్రాన్స్‌కో నిర్వహించిన సోలార్ టెండర్లలో ప్రైవేట్ సంస్థలు మాత్రమే పాల్గొన్నాయి. ఇప్పుడు వైఎస్సార్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వచ్చిన జెన్‌కోను నెట్‌వర్క్ సాకుతో మరోసారి పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దనూరులో 1,050 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ ప్లాంటును జెన్‌కో ఇప్పటికే ఏర్పాటు చేసింది. అక్కడే 20 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నెట్‌వర్క్ లేదనే పేరుతో దీనికి కూడా ట్రాన్స్‌కో ద్వారా ప్రభుత్వ పెద్దలే మోకాలడ్డారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం కేవలం ప్రైవేట్ సంస్థల లబ్ధి కోసమే నడుస్తోందని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement