
అత్యాచార బాధిత పురుషుల కోసం...
స్వీడన్ లోని ఓ ఆస్పత్రి రాత్రికి రాత్రి పతాక శీర్షికలకు ఎక్కింది.
స్టాక్ హోమ్: స్వీడన్ లోని ఓ ఆస్పత్రి రాత్రికి రాత్రి పతాక శీర్షికలకు ఎక్కింది. అత్యాచార బాధిత పురుషుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు ప్రకటించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటన వెలువడగానే సదరు ఆస్పత్రిపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. రేప్ బాధిత పురుషులకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా అత్యవసర విభాగం ఏర్పాటు చేసినట్టు స్టాక్ హోమ్ లోని సోడర్స్ జఖుసెట్ ఆస్పత్రి ప్రకటించింది. వైద్యంతో పాటు న్యాయసేవలు, కౌన్సెలింగ్ కూడా అందిస్తామని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని తెలిపింది. అత్యాచార మహిళా బాధితుల కోసం ఇటువంటి సేవలను ఈ ఆస్పత్రిలో ఇప్పటికే అందిస్తున్నారు.
లింగవివక్ష లేకుండా వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ వార్డు ఏర్పాటు చేసినట్టు లిబరల్ పార్టీ అధికారప్రతినిధి రస్మస్ జొనలండ్ తెలిపారు. ఈ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. రేప్ బాధిత పురుషుల కోసం ప్రత్యేక వైద్య విభాగం నెలకొల్పడం స్వీడన్ ఇదే ప్రథమం అని... బహుశా ప్రపంచంలోనే మొదటిదని రస్మస్ చెప్పారు.
కాగా, లైంగిక వేధింపులకు గురైన పురుషులు వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతవుతున్నారని స్వీడిష్ నేషనల్ కౌన్సిల్ ఫర్ క్రైమ్ ప్రివెన్షన్ నిర్వహించిన సర్వేలో వెల్లడింది. గతేడాది స్వీడన్ లో 370 మంది పురుషులు లైంగిక వేధింపులకు గురైనట్టు కేసులు నమోదయ్యాయి. పైకి చెప్పుకోని బాధితులు ఇంకా ఎంతో మంది ఉన్నారని, వీరిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరగనుంది.
అత్యాచార బాధిత పురుషుల కోసం ప్రత్యేక వార్డు ప్రారంభించారన్న ప్రకటనపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మొదటి గంటలోనే 4 వేల కామెంట్లు వచ్చాయి. మగాడు అత్యాచారానికి గురవుతాడా అంటూ కొందరు సందేహం వ్యక్తం చేశారు. లైంగికవేధింపుల బారిన పడిన మగాళ్ల కోసం ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటు చేసినందుకు మరికొందరు ధన్యవాదాలు తెలిపారు.