రేటింగ్ గండం! | S and P says it may cut India's sovereign rating after Lok Sabha polls | Sakshi
Sakshi News home page

రేటింగ్ గండం!

Nov 8 2013 2:05 AM | Updated on Aug 29 2018 8:56 PM

రేటింగ్ గండం! - Sakshi

రేటింగ్ గండం!

కొత్త ప్రభుత్వం వృద్ధికి తోడ్పడే ప్రణాళిక ప్రకటించకపోతే భారత రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయాల్సి వస్తుందని సాండర్డ్ అండ్ పూర్స్ హెచ్చరించింది

న్యూఢిల్లీ: ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం వృద్ధికి తోడ్పడేలా విశ్వసనీయమైన ప్రణాళిక ప్రకటించకపోతే భారత సార్వభౌమ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయాల్సి వస్తుందని రేటింగ్స్ ఏజెన్సీ సాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) హెచ్చరించింది. ఆర్థిక పరిస్థితులు అసాధారణంగా దిగజారితే తప్ప తదుపరి రేటింగ్‌ను.. ఎన్నికలైన తర్వాత కొత్త ప్రభుత్వ విధానాలను బట్టి సమీక్షిస్తామని పేర్కొంది. భారత్‌కు ‘బీబీబీమైనస్’ స్థాయిని నెగటివ్ అంచనాలతో యథాతథంగా కొనసాగిస్తున్నట్లు గురువారం వెల్లడించిన సందర్భంగా ఎస్‌అండ్‌పీ ఈ అంశాలు తెలిపింది. పెట్టుబడులకు సంబంధించి బీబీబీ రేటింగ్ కనిష్ట స్థాయి గ్రేడ్. ఇంతకన్నా డౌన్‌గ్రేడ్ చేస్తే అధమ స్థాయికి పడిపోయినట్లవుతుంది. కార్పొరేట్లు రుణాలు తీసుకోవాలంటే మరింత అధిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు, ఎస్‌అండ్‌పీ రేటింగ్ సమీక్ష అంశం సాధారణమైనదేనని, ఆందోళన చెందాల్సినదేమీ కాదని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం చెప్పారు.
 
గతేడాది ఏప్రిల్‌లో భారత రేటింగ్ అంచనాలను నెగటివ్ స్థాయికి కుదించిన ఎస్‌అండ్‌పీ తాజాగా..ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి స్పెక్యులేటివ్ గ్రేడ్‌కి దీన్ని తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ కొత్త ప్రభుత్వం వృద్ధి, సంస్కరణలు ఊతమిచ్చే చర్యలు తీసుకుంటే అప్‌గ్రేడింగ్‌కి కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్టమైన 4.4 శాతంగా నమోదైన నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉంటాయని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. డీజిల్ సబ్సిడీలను ఎత్తివేయడం, ఇతరత్రా సబ్సిడీలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, జాతీయ స్థాయిలో వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) అమలు వంటి అంశాలను కొత్త ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుం దని ఎస్‌అండ్‌పీ పేర్కొంది.
 
 బలాలున్నాయ్..బలహీనతలున్నాయ్..
 రేటింగ్‌ను ప్రస్తుతానికి యథాప్రకారం కొనసాగించడానికి భారత్‌కి ఉన్న బలాలే కారణమని ఎస్‌అండ్‌పీ వివరించింది. వంద కోట్ల పైగా జనాభాతో కూడిన ప్రజాస్వామ్య వ్యవస్థ, తక్కువ విదేశీ రుణం, తగినన్ని విదేశీ మారక నిల్వలు మొదలైనవి బలాలని పేర్కొంది. అయితే, ఇదే స్థాయిలో బలహీనతలూ ఉన్నాయని వ్యాఖ్యానించింది. వ్యవస్థాగతమైన సంస్కరణల్లో పురోగతి లేకపోవడం వంటివి ఇందులో ఉన్నాయని ఎస్‌అండ్‌పీ వివరించింది. ఒకవైపు డీజిల్ ధరలను డీరెగ్యులేట్ చేయడమన్న సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మరోవైపు సబ్సిడీ భారం పెరిగిపోయేలా ఆహార భద్రత చట్టం తెచ్చి ఇన్వెస్టర్లకు మిశ్రమ సంకేతాలు పంపిందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement