రూపాయి నెల రోజుల గరిష్టానికి | Sakshi
Sakshi News home page

రూపాయి నెల రోజుల గరిష్టానికి

Published Tue, Jan 14 2014 1:28 AM

రూపాయి నెల రోజుల గరిష్టానికి - Sakshi

ముంబై: స్టాక్ మార్కెట్ల జోరుతో దేశీ కరెన్సీ విలువ కూడా పుంజుకుంది. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ 38 పైసలు ఎగబాకి 61.52 వద్ద స్థిరపడింది. ఇది నెల రోజుల గరిష్టస్థాయి కావడం గమనార్హం. ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్లను భారీగా విక్రయించడం కూడా రూపాయికి బలాన్నిచ్చిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికాలో ఇటీవల వెలువడిన ఉద్యోగ గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటంతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపనల ఉపసంహరణ(ట్యాపరింగ్) జోరును తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ బలహీనపడేందుకు దారితీసిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. క్రితం ముగింపు 61.90తో పోలిస్తే పటిష్టంగా 61.52 వద్ద సోమవారం రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరకు 0.61 శాతం లాభంతో 61.52 వద్ద స్థిరపడింది. డిసెంబర్ 11 తర్వాత(61.25) రూపాయి మళ్లీ ఈస్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 376 పాయింట్లు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement