పేదలపాలిట సంజీవని | rajiv arogya sri details in andhra pradesh state | Sakshi
Sakshi News home page

పేదలపాలిట సంజీవని

Jul 17 2015 9:58 AM | Updated on Jul 7 2018 2:52 PM

పేదలపాలిట సంజీవని - Sakshi

పేదలపాలిట సంజీవని

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు పేదరికం కారణంగా చికిత్సకు నోచుకోని వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

2007లో ప్రారంభమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ
ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
తెలంగాణలో మరో 700 జబ్బులకు
ఉచితంగా చికిత్సలు

 
సాక్షి: తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు పేదరికం కారణంగా చికిత్సకు నోచుకోని వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గుండె, ఊపిరితిత్తులు, క్యాన్సర్, మెదడు సంబంధిత శస్త్ర చికిత్సలు ఎంతో ఖరీదైనవి. అంత స్థోమత లేక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి వాటికి చికిత్స విస్తారంగా అందుబాటులో లేదు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్నప్పటికీ అవి సంపన్న వర్గాలకే పరిమితమవుతున్నాయి. ఈ తరుణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువచేయాలనే ఉద్దేశంతో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజనాంతరం ఇరు రాష్ట్రాలు వేరువేరుగా సేవలు అందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరో 700 రకాల రోగాలకు చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకం గురించి తెలుసుకుందాం...

ప్రారంభం..
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. సీఎం అధ్యక్షతన ‘ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు. బీమా, వైద్య రంగాల్లో నిపుణులతో పథకాన్ని రూపొందించారు. బీమా సౌకర్యం కల్పించేందుకు స్టార్ అండ్ ఎలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ని ఎంపిక చేశారు. దీనికి ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. మహబూబ్‌నగర్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. అక్కడ విజయవంతం కావడంతో అన్ని జిల్లాలకూ విస్తరించారు. ఈ పథకం అనతి కాలంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు దాదాపు 30 ల క్షల మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. 108 సర్వీసులు, 104 , హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఆరోగ్య బీమా పథకాలను ఇందులో విలీనం చేశారు. అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలతో పాటు రవాణా, భోజన, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తారు.

కార్పొరేట్ వైద్యం
ఈ పథకం కింద 1,038 జబ్బులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల వరకు ఉచితంగా సేవలందిస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదవారికి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేస్తుంది. పథకం కింద సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు(నె ట్‌వర్క్) ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్ల మంది ఈ పథకంలో సభ్యులుగా ఉన్నారు. గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 104 సర్వీసులున్నాయి. అన్‌లైన్ సౌకర్యంతో ‘క్లినిక ల్ లేబొరేటరీ’ వసతులతో 104 మొబైల్ క్లినిక్స్ పనిచేస్తాయి.

ఆన్‌లైన్‌లో ఆసుపత్రుల ఎంపిక
ఈ పథకంలో భాగస్వాములు కావాలనుకునే ప్రైవేటు ఆసుపత్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం కనీసం 50 పడకలైనా ఉండాలి. వసతులకు సంబంధించిన ఫొటోలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు, బీమా సంస్థ ప్రతినిధుల బృందం పరిశీలించి నివేదిక రూపొందించి సంబంధిత అధికారులకు పంపిస్తుంది. అన్ని నిబంధనలు సరిగా ఉంటే ఆ ఆసుపత్రిని జాబితాలో చేరుస్తారు. వాటిలో బీమా సంస్థ ‘ఆరోగ్యమిత్ర’ల నియామకం, కియోస్క్‌ల కేటాయింపు పనుల్ని చేపడతారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య, శిబిర సమన్వయకర్తలు ఆసుపత్రి యాజమాన్యంతో సమావేశం నిర్వహిస్తారు. మార్గదర్శకాలు, ప్యాకేజీ వివరాలు తెలియజేస్తారు. యాక్సెస్ కోడ్ కేటాయిస్తారు. పథకం అమలు చేయడానికి కావాల్సిన పుస్తకాలు, సామగ్రి అందజేస్తారు. అమలులో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల్ని ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు.
 
గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు
నెట్‌వర్క్ ఆసుపత్రులు ఏడాది పొడవునా ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తాయి. ప్రాథమిక పరీక్షల అనంతరం రోగికి ఆపరేషన్ అవసరమని వైద్యులు నిర్ణయిస్తే రెఫరల్ కార్డు ఇస్తారు. దీని సాయంతో నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఎక్కడైన ఉచితంగా సేవలు పొందవచ్చు. ఈ శిబిరాలకు సంబంధించి సమాచారం ఆరోగ్యమిత్ర వద్ద ఉంటుంది. పథకం పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ట్రస్టు నిర్విహ స్తుంది.
 
ప్రపంచ బ్యాంకు కితాబు
ఆరోగ్యశ్రీ పథకంపై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర జనాభాలో దాదాపు 75 శాతం మంది ఒక ఆరోగ్య పథకంలో ఉచిత సేవలు పొందడం మొదటిసారని కితాబిచ్చింది. రోగులను ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోనే ప్రక్రియలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పకడ్బందీగా వ్యవహరిస్తోందనీ, కేవలం 12 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే వ్యవస్థ ఏర్పాటు చేసిందని హర్షం వ్యక్తం చేసింది. ఈ పథకాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలూ అమలు చేసేందుకు ఆసక్తి కనబరిచాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement