
చిరుత పులితో వేటకు...
ప్రపంచంలో ఆదివాసీలు సాధు జంతువులను మచ్చిక చేసుకోవడం, వాటి సహాయంతో వేట సాగించడం మనకు తెల్సిందే.
ప్రపంచంలో ఆదివాసీలు సాధు జంతువులను మచ్చిక చేసుకోవడం, వాటి సహాయంతో వేట సాగించడం మనకు తెల్సిందే. వారు క్రూర జంతువులను మచ్చిక చేసుకోవడం పాత రాతి యుగం నుంచి కూడా మనకు చరిత్రలో ఎక్కడా కనిపించదు. కానీ ఈశాన్య ఆఫ్రికా దేశమైన నమీబియాలో అలాంటి దృశ్యాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. అక్కడ స్యాన్తెగకు చెందిన ఆదివాసీలు ఆహారం కోసం విల్లంబులు ధరించి చిన్న జంతువుల కోసం వేటాడుతుంటే వారి పక్కనే మసలుతూ వారి వేటను చిరుత పులి ఆసక్తిగా తిలకించడాన్ని లండన్‌కు చెందిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ జాక్ సోమర్‌విల్లే ఇటీవల తన కెమేరాలో బంధించారు.
నమీబియాలోని నాంకుస్ వైల్డ్‌లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్‌కు వెళ్లిన ఫొటోగ్రాఫర్ జాక్ తన కెమేరాతో తీసిన ఆరుదైన దృశ్యాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. స్యాన్ తెగకు చెందిన ఈ ఆదివాసీలు దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలతోపాటు స్పాన్ బోట్స్‌వానా, అంగోలా, జాంబియా, జింబాబ్వే సరిహద్దు అడవుల్లో నివసిస్తున్నారు. వారి జీవన శైలిని అధ్యయనం చేయడానికి నమీబియా వెళ్లిన జాక్ వారి నాగరికత గురించి వెల్లడించారు. వారు అవసరానికి మించి వేటాడరని, భూ మండలంపై ప్రతి జంతువుకు తమకంటూ కొంత స్థలం ఉంటుందని గాఢంగా నమ్ముతారని చెప్పారు. తమ ఆకలికి ఆ పూటకు అవసరమైన జంతువులను మినహా మరే ఇతర వన్య ప్రాణులకు వారు ఎలాంటి హాని తలపెట్టరని, అందుకే వారి వెంట చిరుత పులి సైతం మచ్చిక జంతువులా తిరుగుతోందని తెలిపారు.