ఫలించని ప్రధాని ప్రయత్నం

ఫలించని ప్రధాని ప్రయత్నం


సాధ్వి వ్యాఖ్యలపై కొనసాగిన నిరసనలు

లోక్‌సభలో ప్రధాని ప్రకటన

బహిరంగంగా మాట్లాడేటపుడు పరిధులు తెలుసుకోవాలి

కాంగ్రెస్ వాకౌట్

 

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో నిరసనల పరంపర కొనసాగింది. లోక్‌సభలో ప్రతిపక్షాలతో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంధి ప్రయత్నాలూ ఫలించలేదు. ఆయన సభలో ప్రకటన చేసినా ప్రతిపక్షాలు సంతృప్తి చెందక శుక్రవారమూ  నిరసనను కొనసాగించాయి. లోక్‌సభలో ప్రధాని మాట్లాడుతూ..  బహిరంగంగా మాట్లాడేటపుడు ప్రతి ఒక్కరు తమ పరిధులు తెలుసుకోవాలని చెప్పారు.

 

 ఎవరూ ఆమె వ్యాఖ్యల్ని సమర్థించరని, అలాంటి పదాలు వాడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తమ సభ్యులకు గట్టిగా చెప్పాననన్నారు. మంత్రి క్షమాపణలు చెప్పిన తర్వాత ఆ విషయాన్ని ముగించి, జాతి ప్రయోజనాల దృష్ట్యా సభ సజావుగా కొనసాగేలా చూడాలని కోరారు.  జ్యోతి గ్రామీణ నేపథ్యాన్నీ దృష్టి పెట్టుకోవాలన్నారు. ప్రధాని ప్రకటనతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ నేతలు నోటికి నల్లగుడ్డ కట్టుకుని నిరసన తెలిపారు. ప్రధాని ప్రసంగం తర్వాత వాకౌట్ చేశారు.

 

 తర్వాత మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఎవరిపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తున్నారని, వాళ్లు చేసే పనులు వాళ్లకే తిరిగి తగులుతాయని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అంతకుముందు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. తాము వ్యక్తులకు వ్యతిరేకం కాదన్నారు. రాజ్యసభలో కూడా నాలుగోరోజు ప్రతిష్టంభన కొనసాగింది. నిరసనల మధ్య నాలుగు సార్లు వాయిదా పడింది.  ప్రభుత్వం, ప్రతిపక్షాలు చర్చించి సోమవారంలోగా ప్రతిష్టంభన తొలగించాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సూచించారు.  కాగా, జ్యోతిని అభిశంసిస్తూ ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించాలని రాజ్యసభలో 9 విపక్షాలు శుక్రవారం ప్రతిపాదించాయి. ఆమెను  మంత్రిపదవినుంచి తక్షణం తొలగించవలసిన అవసరం ఉందని  పేర్కొన్న ఉమ్మడి ప్రకటనపై  కాంగ్రెస్, సమాజవాదీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ నేతలు సంతకాలు చేశారు.   

 

 పార్లమెంట్ ఆవరణలో నిరసనలు

 పార్లమెంట్ వేదికగా శుక్రవారం అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీ నిరసనలు చేపట్టాయి. పార్లమెంట్ కార్యకలాపాలకు ముందు కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, ఆమ్‌ఆద్మీ, ఆర్‌జేడీ, సీపీఐ సభ్యులు మంత్రి సాధ్వీ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలపై పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష ఎంపీలంతా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ప్రదర్శన నిర్వహించారు.



జ్యోతిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విపక్షాల గొంతు నొక్కాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు నిరసనగా దీన్ని చేపట్టినట్టు రాహుల్ చెప్పారు. మరోవైప  బీజేపీ సభ్యులు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఇందులో ఐదుగురు కేంద్ర మంత్రులు సదానంద గౌడ, అనంత్‌కుమార్, తావర్‌చంద్ గెహ్లట్, పాస్వాన్, నఖ్వీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top