జియోకి షాక్‌..‘జన’ ఉచిత డేటా ఆఫర్‌ | Sakshi
Sakshi News home page

జియోకి షాక్‌..‘జన’ ఉచిత డేటా ఆఫర్‌

Published Fri, Mar 10 2017 12:08 PM

జియోకి షాక్‌..‘జన’ ఉచిత డేటా ఆఫర్‌

ఉచిత డేటా, ఉచిత కాలింగ్‌ అంటూ జియో టెలికాం రంగంలో సంచలనం సృష్టించగా ఇపుడు మరో ఉచిత ఆఫర్ దూసుకొస్తోంది. అయితే ఈ సారి ఓ విదేశీ కంపెనీ కావడం విశేషం. అమెరికాలోని బోస్టన్‌  ఆధారిత  మొబైల్ ప్రకటనల సంస్థ 'జన'  ఉచిత డేటా ఆఫర్‌ తో ముందుకొస్తోంది.  రోజుకు 10 ఎంబీ డేటాను ఉచితంగా అందించనుంది. అంతేకాదు తమ ప్లాట్‌ ఫాంపై   ప్రకటనల ఆదాయం పెరిగే కొద్దీ  ఉచిత డేటా ఆఫర్‌ను కూడా ఆమేరకు పెంచుతుందట.

ముఖ్యంగా  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఉచిత ఆఫర్ లకు స్వస్తి పలికి బిల్లింగ్ మోడ్ లోకి  మారిపోయిన తరుణంలో, జన ఆండ్రాయిడ్‌  బ్రౌజర్ ను ప్రారంభించింది.  ప్రపంచ వ్యాప్తంగా తన ఎంసెంట్‌(mCent ) బ్రౌజర్ ను భారత్‌ సహా  ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో శుక్రవారం ప్రారంభించనున్నట్లు  ప్రకటించింది. ఈ ఆఫర్‌  ప్రారంభ దశలో, వినియోగదారులకు రోజుకు ఉచిత 10ఎంబీ డేటా (వారానికి 70ఎంబీ) అందించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు భారతి ఎయిర్‌ టెల్‌, రిలియన్స్‌ జియో లాంటి ఇతర దేశీయ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.   బిలియన్ ప్రజలకు  ఇంటర్నెట్ ఉచితంగా అందించడమే తమ తదుపరి లక్ష్యమని జన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సహ వ్యవస్థాపకుడు నాథన్ ఈగిల్ చెప్పారు.  ఎంసెంట్‌  బ్రౌజర్‌ ను ఎంసెంట్‌ యాప్‌ స్టోర్‌ నుంచి  డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఇప్పటి వరకు అధిక డేటా ఖర్చు భయంతో  వినియోగదారులు  మోర్‌ సెలెక్టివ్‌గా  ఉండడం, మొబైల్ ప్రకటనకర్తలకు సవాలుగా మారిందని అయితే, ఎంసెంట్‌ ఎంట్రీ ఇది మొత్తం మారిపోనుందని జన మేనేజర్‌, సహ వ్యవస్థాపకుడు జోనాథన్ డిసౌజా తెలిపారు. ఇది   వినియోగదారుల ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ సదుపాయం అందించడంతోపాటు,  ప్రకటనకర్తలకు మంచి అవకాశాన్ని కల్పించనుందని చెప్పారు. కాగా దాదాపు గూగుల్‌ ప్లే స్టోర్‌ను పోలిన  ఎంసెంట్‌  బ్రౌజర్‌ ను ఎంసెంట్‌ యాప్‌ స్టోర్‌ నుంచి  డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. భారతదేశం లో 2014 లో ప్రారంభించిన   ఈ యాప్ ప్రతి డౌన్‌ లోడ్‌ పై ఉచిత డేటాను ఆఫర్‌ చేసి 30 మిలియన్ల యూజర్లను ఆకర్షించింది.

Advertisement
Advertisement