కొత్త మంత్రులు.. వీరే! | new central ministers brief profile | Sakshi
Sakshi News home page

కొత్త మంత్రులు.. వీరే!

Sep 3 2017 8:19 AM | Updated on Apr 6 2019 9:38 PM

కేంద్ర మంత్రిమండలి పునర్య్వవస్థీకరణలో తొమ్మిదిమంది కొత్త మంత్రులకు చోటు లభించింది

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా చేపట్టబోతున్న కేంద్ర మంత్రిమండలి పునర్య్వవస్థీకరణలో తొమ్మిదిమంది కొత్తవారికి చోటు లభించింది. వీరితో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. 9మంది కొత్త మంత్రుల గురించి క్తుప్తంగా వివరాలివి..


అనంత్‌కుమార్‌ హెగ్డే
కర్ణాటకలోని ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఐదోసారి ఎన్నికయ్యారు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణారోగ్యం, స్వయం సహాయక సంఘాలు తదితర రంగాల్లో సేవలందించే ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.

శివ ప్రతాప్‌ శుక్లా
ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన ఆ రాష్ట్రంలో గతంలో 8 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. గ్రామీణాభివృద్ధి, విద్య, జైళ్ల శాఖల్లో సంస్కరణలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యునిగా ఉన్నారు.

సత్యపాల్‌ సింగ్‌
మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన సింగ్‌ ప్రస్తుతం యూపీలోని బాగ్‌పత్‌ నుంచి ఎంపీగా ఉన్నారు. హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా, లాభదాయక పదవుల సంయుక్త కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏపీ, మధ్యప్రదేశ్‌లలో నక్సలైట్ల నియంత్రణకు కృషిచేసినందుకు 1990లో ప్రత్యేక సేవా పతకాన్ని అందుకున్నారు. 1990ల్లో ముంబైలో వ్యవస్థీకృత నేర వ్యవస్థ నడ్డి విరిచినందుకు ప్రశంసలందుకున్నారు. ముంబై, పుణె నగరాల పోలీస్‌ కమిషనర్‌గానూ పనిచేశారు.

అశ్వినీ కుమార్‌ చౌబే
బిహార్‌లోని బక్సర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర జౌళి మండలిలో సభ్యుడైన చౌబే గతంలో బిహార్‌ శాసనసభకు వరసగా ఐదు సార్లు ఎన్నికయ్యారు. 1974–75లో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నేతృత్వంలో వచ్చిన బిహార్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లపాటు పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యం తదితర మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.

రాజ్‌కుమార్‌ సింగ్‌
మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన రాజ్‌కుమార్‌ ప్రస్తుతం బిహార్‌లోని ఆరా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సిబ్బంది, పింఛన్లు, ప్రజా ఫిర్యాదులపై ఏర్పాటైన వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా ఉన్నారు. గతంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు.

వీరేంద్ర కుమార్‌
మధ్యప్రదేశ్‌లోని టికంగఢ్‌ ఎంపీ అయిన వీరేంద్ర ప్రస్తుతం కార్మిక సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడు. ఇప్పటికి ఆరు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ, బాల కార్మికులపై పీహెచ్‌డీ చేసిన ఆయన గతంలోనూ పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు.

హర్‌దీప్‌ సింగ్‌ పూరి
పంజాబ్‌కు చెందిన మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన హర్‌దీప్‌ సింగ్‌కు విదేశాంగ వ్యవహారాలపై మంచి పట్టుంది. ప్రస్తుతం ఆయన అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన ఆర్‌ఐఎస్‌ అనే మేధో సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో న్యూయార్క్‌లోని అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

గజేంద్ర సింగ్‌ షెకావత్‌
ప్రస్తుతం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా, ఫెలోషిప్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు చేరువగా ఉంటారు. బాస్కెట్‌బాల్‌లో జాతీయ స్థాయి పోటీల్లో ఆడారు. ప్రస్తుతం భారత బాస్కెట్‌బాల్‌ ఆటగాళ్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

ఆల్ఫోన్స్‌ కణ్ణాంథనం
కేరళకు చెందిన ఆల్ఫోన్స్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి. ఢిల్లీ అభివృద్ధి సంస్థ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో 15 వేల అక్రమ నిర్మాణాలను కూల్చేసి పేరు తెచ్చుకున్నారు. తద్వారా 1994లో టైమ్స్‌ మేగజీన్‌ ప్రచురించిన 100 ప్రపంచ యువ నాయకుల జాబితాలో చోటు సంపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement