నరహంతక ముఠా పరారీ | Murderers Gang escape | Sakshi
Sakshi News home page

నరహంతక ముఠా పరారీ

Aug 14 2015 12:49 AM | Updated on Aug 21 2018 5:51 PM

నరహంతక ముఠా పరారీ - Sakshi

నరహంతక ముఠా పరారీ

పసిపిల్లలను సైతం దారుణంగా హత్య చేసే నరహంతక, దొంగల ముఠా గురువారం తప్పించుకుంది.

* కోర్టు ప్రాంగణం నుంచి తప్పించుకున్న నలుగురు రిమాండ్ ఖైదీలు    
వెంబడించి ఒకరిని పట్టుకున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పసిపిల్లలను సైతం దారుణంగా హత్య చేసే నరహంతక, దొంగల ముఠా గురువారం తప్పించుకుంది. పార్ధీగ్యాంగ్‌కు చెందిన ఈ సభ్యులను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువస్తుండగా మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి పరారయ్యారు.

వీరు మహారాష్ర్ట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 31 హత్యలు, పలు దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో పార్ధీ గ్యాంగ్ లీడర్ తరుణ్ బోస్లే అలియాస్ అరుణ్ బోస్లేతో పాటు లక్ష్మణ్ బోస్లే, కైలాస్, పరమేశ్‌లు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, పరమేశ్‌ను పట్ణణంలోని సితారా సినిమా థియేటర్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు.
 
జరిగింది ఇలా..
నలుగురు పార్ధీ ముఠా సభ్యులతో పాటు మరో సాధారణ దొంగను పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు గురువారం తీసుకువచ్చారు. ఐదుగురు సభ్యులకు గాను కేవలం ముగ్గురు మాత్రమే పోలీసులు ఎస్కార్టుగా వచ్చారు. సాధారణ దొంగను ముందుగా కోర్టులో హాజరుపరిచారు. పార్థీ గ్యాంగు సభ్యులను హాజరు పరిచేందుకు సమాయత్తం అవుతుండగా.. అందులోని ఒక సభ్యుడు పరమేశ్ ఒక్కసారిగా పరుగు లంఘించుకున్నాడు.

అతణ్ని వెంబడిస్తూ ఇద్దరు పోలీసులు పరుగెత్తారు. ఎట్టకేలకు అతణ్ని సితారా టాకీసు సమీపంలో పట్టుకున్నారు. ఈలోగా మిగిలిన ముఠా సభ్యులు పరారయ్యారు. ఎస్కార్టు పోలీసు వారిని కాల్చి వేసేందుకు తుపాకీని లోడ్ చేసి గురిపెట్టగా.. అది పేలకుండా మొరాయించినట్టు సమాచారం. దొరికిన కొద్దిపాటి సమయంలో ముగ్గురు మెరుపులా మాయమయ్యారు.
 
ఇవీ కేసులు..
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పార్లీ వైద్యనాథ్‌కు చెందిన తరుణ బోస్లే, లక్ష్మణ్ బోస్లే, పరమేశ్వర్, కైలాష్‌లు కరడుగట్టిన నేరస్తులు. 2009 నాటికి ఈ గ్యాంగ్‌పై ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో 31 హత్యలు, పలు దోపిడీ కేసులు నమోదయ్యాయి. వీళ్లు పట్టుబడిన సమయానికి వారి వయస్సు 18 ఏళ్ల యువకులు. 2012లో బయటికి వచ్చిన ఈ గ్యాంగ్ మళ్లీ హత్యలు, దోపిడీకి తెగబడింది. 2012 నుంచి 2014 వరకు దాదాపు రెండేళ్ల కాలంలోనే  తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆరు హత్యలు, పలు దోపిడీ కేసులు నమోదయ్యాయి.

వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో ఒక ఇంట్లోకి చొరబడి తల్లీకూతుళ్లతో పాటు పసికందును దారుణంగా హత్య చేసి దోపిడీ చేయడంతో పార్ధీగ్యాంగ్ క్రూరత్వానికి సమాజం వణికిపోయింది. నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో ఒకరిని, కరీంనగర్‌లో వృద్ధ దంపతులను, సుల్తానాబాద్‌లో ఇద్దరిని హత్య చేశారు. మెదక్ జిల్లాలో వీరిపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. రామచంద్రపురం మండలం నాగుపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న  దోపిడీలు, హత్య కేసుల్లో రామచంద్రాపురం పోలీసులు దాదాపు 40 రో జుల పాటు పర్లీలో మకాం వేసిపట్టుకున్నారు.
 
పట్టణం చుట్టూ అష్టదిగ్బంధనం
సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న సంగారెడ్డి పట్టణం నలుమూలను అష్టదిగ్బంధనం చేశారు. మఫ్టీ పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టారు. సాధారణంగా రైల్వే లైన్ ఉన్న ప్రాంతాలనే ఎంచుకొని దోపిడీలు చేసే అలవాటు ఉండటంతో పోలీసులు ఆ దిశగా నిఘా పెట్టారు. కదులుతున్న రైలు ఎక్కటానికి అవకాశం ఉన్న ప్రతి చోట పోలీసులను మొహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement