ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి | Mumbai blasts convict Mustafa Dossa dies a day after CBI seeks death penalty for him | Sakshi
Sakshi News home page

ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి

Jun 29 2017 1:20 AM | Updated on Sep 28 2018 3:41 PM

ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి - Sakshi

ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి

1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) బుధవారం గుండెపోటుతో మరణించాడు.

ముంబై: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) బుధవారం గుండెపోటుతో మరణించాడు. దావూద్‌ ఇబ్రహీంకు దోసా అత్యంత సన్నిహితుడు. పేలుళ్ల కేసులో ముస్తఫాతోపాటు మరో నలుగురిని టాడా ప్రత్యేక కోర్టు ఈ నెల 16నే దోషులుగా తేల్చింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ముంబైలోని జైలులో ఉండగా బుధవారం తెల్లవారుజామున దోసాకు ఛాతీలో నొప్పి మొదలైంది. అధికారులు వెంటనే ముంబైలోని జేజే ఆసుపత్రికి అతణ్ని తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం రెండున్నర గంటలప్పుడు దోసా ప్రాణాలు విడిచాడని వైద్యులు వెల్లడించారు.

 ముంబైలో మారణహోమం సృష్టించడానికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను దుబాయ్‌ నుంచి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా దిఘీకి, పాకిస్తాన్‌కు సరఫరా చేసింది దోసానే. దోషులు పాకిస్తాన్‌కు వెళ్లి శిక్షణ పొందడానికి కూడా దోసా సోదరులు సహాయం చేశారు. గతంలో ఇదే కేసులో ఉరితీతకు గురైన యాకుబ్‌ మెమన్‌ కన్నా దోసా పాత్ర ఎంతో ప్రధానమైనదనీ, దోసాకు కూడా మరణశిక్ష విధించాల్సిందిగా కేసు విచారణ సమయంలో సీబీఐ కోర్టుకు విన్నవించింది. కాగా, ముస్తఫా మరణించినందున శిక్షా కాలం నిర్ణయించడానికి సంబంధించిన విచారణను కోర్టు శుక్రవారం వరకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement