‘మనసా... వినవా’ దొంగను చేసింది

‘మనసా... వినవా’ దొంగను చేసింది


సాక్షి, హైదరాబాద్: ‘మనసా... వినవా’ అంటూ తెలుగు సినిమాను తెరకెక్కించి తన నిర్మాత కలను నిజం చేసుకోవడంతో పాటు మేనల్లుడిని హీరోగా పరిచయం చేయాలనుకున్న తమిళనాడు తిరువరూర్‌కు చెందిన బాలమురుగన్ ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. బ్యాంక్ దోపిడీలు చేస్తూనే... సినీ రంగంలో స్థిరపడాలనుకున్న మురుగన్ విలాసవంతమైన జీవితంతో ప్రాణాంతక వ్యాధి బారిన పడి రోజులు లెక్కిస్తున్నాడు. ‘ఆత్మ’ కథతో అదరగొట్టాలని అనుకున్నా...



తన చోరీల గురించి పోలీసులకు తెలిసిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు మూడు నెలల క్రితం బెంగళూరు పోలీసులకు చిక్కడంతో సైబరాబాద్ పోలీసులు పీటీ వారంట్‌పై మంగళవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు బాలమురుగన్‌పై 29 నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.

 

సినిమా కోసం అడ్డదారి...

సినీ కెరీర్‌లో స్థిరపడాలని 2008లోనే బాలమురుగన్, సురేశ్ కలసి దినకరన్‌తో రాత్రివేళలో బెంగళూరు, మడివాల, కరమంగళ, జ్ఞానభారతి ప్రాంతాల్లో ఇళ్ల దొంగతనాలు, దోపిడీలు చేశారు. 2011లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది పాటు జైల్లోనే ఉన్న బాలమురుగన్ 2012లో విడుదలైన తర్వాత మకాం హైదరాబాద్‌కు మార్చాడు. దోచుకున్న సొత్తుతో హిమాయత్‌సాగర్‌లోని కిస్మత్‌పుర్‌లో ఇల్లు కొన్నాడు.



ఆ తర్వాత టాలీవుడ్ వారికి దగ్గరయ్యేందుకు ఈవెంట్స్ చేశాడు. కొందరు ప్రముఖుల వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఎన్.రాజమల్ల ఫిల్మ్స్ బ్యానర్ పేరుతో సౌత్ ఇండియా ఫిల్మ్ గిల్డ్ సభ్యత్వాన్ని తీసుకున్నాడు. తన సినీ కలను నెరవేర్చుకునేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులో బ్యాంక్ దోపిడీలు, ఇళ్ల దొంగతనాలు చేశాడు. 2012 సంవత్సరంలో 50 లక్షల వ్యయంతో మనసా వినవా అనే సినిమా తీశాడు.



అది ఇప్పటికీ విడుదల కాలేదు. రాజమండ్రిలో ఈ సినిమా ప్రారంభానికి పోలీసులు, రెవెన్యూ అధికారులతోనే క్లాప్ కొట్టించాడు. గుడువచేరికి చెందిన రైటర్ సంపత్‌తో కలసి ఆత్మ సినిమా తీయాలనుకున్నాడు. ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే పోలీసులు వెతుకుతున్నారన్న సమాచారం మేరకు బాలమురుగన్ పారిపోయాడు.

 

ఫింగర్ ప్రింట్సే పట్టిచ్చాయి...

ఇంటర్నెట్‌లో గూగుల్ సహకారంతో రూరల్, సబ్‌అర్బన్ ప్రాంతాల్లోని గ్రామీణ బ్యాంక్‌ల గురించి శోధన చేస్తాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న బ్యాంక్‌లనే టార్గెట్ చేసుకొని దోపిడీ చేస్తాడు. దినకరన్, అల్లుడు సురేశ్‌తో పాటు భార్య, కుమారుడు, కుమార్తెను కూడా తీసుకెళతాడు. గ్రేట్ డెన్ కుక్క కూడా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఫ్యామిలీతో చోరీకి వెళతాడు. పిల్లలిద్దరూ దత్తత తీసుకున్నవారే.



బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో సురేశ్, బాలమురుగన్ కుటుంబసభ్యులతో వేచి చూస్తుంటే బాలమురుగన్, దినకరన్ బ్యాంక్‌లోకి వెళ్లి దోపిడీ చేస్తారు. ఆ తర్వాత తమిళనాడుకు పరారవుతారు. గతేడాది ఆగస్టులో మహబూబ్‌నగర్‌లోని గ్రామీణ బ్యాంక్‌లో రూ.40 లక్షల సొత్తు, నవంబర్ 16న చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో రూ.55 లక్షల సొత్తును, డిసెంబర్ 8వ తేదీ రాత్రి ఘట్‌కేసర్‌లోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో రూ.36 లక్షల సొత్తు చోరీ చేశారు.



అయితే ఈ ఏడాది జనవరి 10న ఇబ్రహీంపట్నంలోని హెచ్‌డీసీసీ బ్యాంక్‌లో దోపిడీ చేస్తుండగా బ్లూకోర్డ్స్ రాకను గమనించి పరారయ్యారు. అక్కడే వెల్డింగ్ గ్యాస్, ఇన్నోవా కారును వదిలివెళ్లారు. అక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ బెంగళూరులో ఓ కేసులో నిందితుడిగా ఉన్న బాలమురుగన్ చేతివేళ్లకు మ్యాచ్ అయ్యాయి. అలా బాలమురుగన్‌కు ఈ బ్యాంక్ దోపిడీ కేసుల్లో నిందితుడిగా గుర్తించగలిగారు.



గత మార్చిలో తమిళనాడులోని తిరవరూర్‌లో మురుగన్ ఇంటిపై దాడులు చేయగా పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. ఈ సమయంలో అతనికి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రులకు సమాచారం అందించాలని కోరారు. ఈ క్రమంలో ఎట్టకేలకు 3 నెలల క్రితం బెంగళూరు పోలీసులకు చిక్కడంతో సైబరాబాద్ పోలీసులు పిటీ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top