
అక్కడ రూపాయికే ప్రశస్త భోజనం!
చపాతి, రైస్, సాంబార్, కూరలు, స్వీట్లతో కూడిన ప్రశస్తమైన భోజనాన్ని వడ్డిస్తే, అది కేవలం ఒక రూపాయికే అందిస్తే...
బెంగళూరు: మిట్టమధ్యాహ్నం ఆకలితో కడుపు నకనకలాడుతున్నప్పుడు కలో గంజో కాకుండా...చపాతి, రైస్, సాంబార్, కూరలు, స్వీట్లతో కూడిన ప్రశస్తమైన భోజనాన్ని వడ్డిస్తే, అది కేవలం ఒక రూపాయికే అందిస్తే...అది పగటికల అంటారు ఎవరైనా. కర్నాటకలోని హుబ్బళ్లి ప్రాంతంలోని కాంచ్‌గర్ గల్లీలో ‘రోటీ ఘర్’ ఈ పగటి కలను రోజూ నిజం చేస్తోంది. కూలినాలి చేసుకునేవారే కాదు, ఆటోరిక్షా డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు మొదలుకొని చిన్నా చితక వ్యాపారాలు చేసుకునేవారు రోజు రోటిఘర్‌కు వెళ్లి ప్రశస్తమైన భోజనాన్ని ఆరగిస్తూ బ్రేవ్ మంటూ తేన్పులు తీస్తున్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నడిచే ఈ భోజనశాలకు మురికివాడల ప్రజల నుంచి ఆఫీసులకెళ్లే ఉద్యోగుల వరకు అందరూ ఆహ్వానితులే. సెల్ఫ్ సర్వీస్ ద్వారా వడ్డించేది ముగ్గురే అయినా వారు ఆధునిక కుకింగ్ దుస్తులేసుకొని శుభ్రంగా ఉంటారు. భోజనశాలలో పరిశుభ్రతను పాటిస్తారు. పెట్టిన భోజనానికి చేతులతో డబ్బులు తీసుకోరు. అక్కడే ఉన్న హుండీలో భోజనం చేసిన తర్వాత ఓ రూపాయి వేయమంటారు.
చిల్లరలేక ఎక్కువేసే వాళ్లు, మంచి భోజనం పెట్టారంటూ నాలుగు డబ్బులు ఎక్కువేసే వారు ఉంటారు. అలాగే చిల్లర లేదంటూ చేతులు కడుక్కొని వెళ్లేవారూ ఉంటారు. సామాజిక బాధ్యత కింద ఈ రోటీ ఘర్‌ను నిర్వహిస్తున్నవారు డబ్బులు ఎగ్గొట్టే బాపతు కుత్సిత మనషులను పెద్దగా పట్టించుకోరు. వారు ప్రచారాన్ని కూడా కోరుకోరు. అది వారి మనస్తత్వానికి పడదంటారు.
మహావీర్ యూత్ ఫెడరేషన్ వారు గత ఐదేళ్లుగా ఈ క్యాంటీన్‌ను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఈ యూత్ అసోసియేషన్ వారు ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా ఒక గంటైనా సేవ చేసేందుకు ఎక్కువ మంది వైద్యులు ముందుకు రాకపోవడం, జీతాలకొచ్చే వైద్యులు ఎక్కువ మొత్తాల్లో డిమాండ్ చేయడం, అందుకు సరిపడా నిధులు లేకపోవడం వల్ల అనతి కాలంలోనే ఫెడరేషన్ వారు ఆ ఆస్పత్రిని మూసివేయాల్సి వచ్చింది. మరి ఇలా రూపాయికే భోజనం ఇస్తే దీన్నిమాత్రం ఎంతకాలం నిర్వహిస్తారని ప్రశ్నించగా, ఆడికాడికి సరిపడా విరాళాలు వస్తున్నాయని చెప్పారు. వైద్యం చాలా ఖరీదైనందువల్ల దాన్ని నిర్వహించలేక పోయామని చెప్పారు. ఆ వైఫల్యం నుంచే పేదలకు ఏదో చేయాలనే సదుద్దేశంతోనే దీన్ని నిర్వహిస్తున్నామని పేర్లు వెల్లడించేందుకు కూడా ఇష్టపడని మహావీర్ యూత్ ఫెడరేషన్ నేతలు వివరించారు.